Naveen Yerneni: కిడ్నాప్ కేసులో నిందితుడిగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్?
Naveen Yerneni: టాలీవుడ్‌లో స్టార్ నిర్మాతలలో ఒకరు అయిన నవీన్ యర్నేనిపై క్రిమినల్ కేసు నమోదు అవ్వడం సంచలనాన్ని సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పేరు కూడా నిందితుల లిస్ట్‌లో చేరింది.
Case Filed On Producer Naveen Yerneni: టాలీవుడ్‌లో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఏదంటే దాదాపు అందరూ మైత్రీ మూవీ మేకర్స్ అనే చెప్తారు. ఎందుకంటే ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న చాలావరకు ప్యాన్ ఇండియా చిత్రాలు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. కానీ తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేనిపై క్రిమినల్ కేసు ఫైల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సమాచారం టాలీవుడ్‌లో కలకలం సృష్టిస్తోంది. జూబ్లీ హిల్స్‌లోని ఒక ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్‌ను తన సొంతం చేసుకోవాలనే ఆలోచనతో బలవంతంగా షేర్లు బదిలీ చేసుకున్నాడంటూ నవీన్‌పై కేసు నమోదైనట్లు తెలిసింది. ఆ హెల్త్ కేర్ సెంటర్ ఓనర్‌ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం.
గతంలో..
ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు.. అన్ని రంగాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో డీసీపీ రాధాకిషన్ రావు, ఇన్‌స్పెక్టర్ గట్టుముల్లు, ఎస్సై మల్లికార్జున్‌తో పాటు నిందితుల లిస్ట్‌లో మరికొందరి పేర్లు నమోదయ్యాయి. ఈ కేసు గురించి తెలుసుకున్న ఒక ఎన్ఆర్ఐ, బిజినెస్ మ్యాన్ చెన్నుపాటి వేణుమాధవ్.. జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఫ్యాన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు.. గతంలో తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా తన దగ్గర నుండి కంపెనీ షేర్లను రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా..
చెన్నుపాటి వేణుమాధవ్ చెప్పినదాని ప్రకారం రాధాకిషన్ రావు, గట్టుముల్లు, మల్లికార్జున్, కృష్ణ, గోపాల్, రాజ్, రవి, బాలాజీ, చంద్రశేఖర్ వేగేతో పాటు మరికొందరిని ఈ కేసులో నిందితులుగా పేర్కొంటూ జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అయితే తనను బెదిరించి షేర్లు రాయించుకున్న సమయంలో పోలీసులు కూడా వారితో చేతులు కలిపారని షాకింగ్ విషయాలు చెప్పారట. పోలీసులతో పాటు తన సంస్థకు చెందిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నలుగురు కూడా ఇందులో భాగమయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిసింది. వేణుమాధవ్ ఇచ్చిన ఫిర్యాదుతో రాజశేఖర్ తలసిల, గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీర్ణమాచినేని పూర్ణచందర్ రావు పేర్లు కూడా కొత్తగా నిందితుల లిస్ట్‌లో చేర్చినట్లు సమాచారం.
స్టార్ డైరెక్టర్స్‌తోనే..
2015లో మైత్రీ మూవీ మేకర్స్‌ను స్థాపించాడు నవీన్ యర్నేని. తనతో పాటు యలమంచిలి రవి శంకర్, మోహన్ చెరుకూరి కూడా చేరడంతో ఈ సంస్థ మరింత పెద్దగా మారింది. మొదట్లో మీడియం బడ్జెట్ సినిమాలను తెరకెక్కించినా కూడా మెల్లగా మైత్రీ సంస్థ.. తన స్కేల్‌ను పెంచుకుంటూ పోయింది. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన ‘శ్రీమంతుడు’తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రయాణం మొదలయ్యింది. అలా మొదటి నుండి ఎక్కువగా పెద్ద దర్శకులతోనే వీరు సినిమాలు చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’తో పాటు మరెన్నో పాన్ ఇండియా చిత్రాలకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.