Bellamkonda Suresh Car: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో మందు బాటిళ్లు కొట్టేసిన దొంగలు
ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు అద్దాలను దుండగులు ధ్వంసం చేశారు. కారులోని నగదు, మద్యం బాటిళ్లను చోరీ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత బెల్లకొండ సురేష్ కారు అద్దాలను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టారు. కారులోని కొంత నగదుతో పాటు ఖరీదైన మద్యం సీసాలను దొంగిలించారు. ఈ ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే?
నిర్మాత బెల్లంకొండ సురేష్ జూబ్లీహిల్స్, రోడ్ నెం 70లోని జర్నలిస్టు కాలనీలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి లాగే తన ఇంటి ముందు కారు పార్క్ చేశారు. టీఎస్ 09 ఈసీ 3033 నెంబర్ బెంజి కారు రాత్రి పూట పార్కింగ్ ప్లేసులో పెట్టారు. ఇవాళ ఉదయం లేచి చూసే సరికి కారు అద్దాలు పగలుగొట్టబడి ఉన్నాయి. అంతేకాదు, కారులోని నగదుతో పాటు విలువైన 11 రాయల్ సెల్యూట్ లిక్కర్ బాటిళ్లు(ఒక్క బాటిల్ ధర రూ. 28 వేలు) మాయం అయ్యాయి. సుమారు రూ. 50 వేల నగదును కూడా దుండగులు అపహరించారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన బెల్లంకొండ
కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు మద్యం బాటిళ్లు, నగదు దొంగతనం చేసిన ఘటనపై బెల్లంకొండ సురేష్ డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెంజి కారు వెనుకాల అద్దం పగలగొట్టిన దుండగులు డిక్కీలో ఉన్న మద్యం బాటిళ్లు ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనలకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. సమీపంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.
ఇంతకీ చోరీ అయిన మద్యం బాటిళ్లు పదకొండా? ఐదా?
ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కారులో మద్యం సీసాలు ఉన్న విషయం తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి దగ్గర అనుమతి లేకుండా 6 కంటే ఎక్కువ మద్యం బాటిళ్లు ఉండకూడదు. కానీ, బెల్లంకొండ కారులో 11 మద్యం బాటిళ్లు ఎందుకు ఉన్నాయనే విషయాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, 100 కాల్ చేసి చెప్పినప్పుడు 11 మద్యం బాటిళ్లు ఉన్నట్లు చెప్పిన బెల్లంకొండ, ఫిర్యాదులో మాత్రం 5 మాత్రమే ఉన్నాయని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ కేసుపై జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
View this post on Instagram
నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎన్నో అద్భుత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. బాలకృష్ణతో కలిసి ‘చెన్నకేశవరెడ్డి’, ‘లక్ష్మీనరసింహా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. జూ. ఎన్టీఆర్, రామ్ పోతినేతిలో పాటు పలువురు హీరోలతో సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన కొడుకులు శ్రీనివాస్, గణేష్ హీరోలుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలను నిర్మించడం తగ్గించారు. కొడుకులను హీరోలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
Read Also: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ బ్యూటీ, నెట్టింట్లో ఫోటోలు వైరల్