Megastar Flop Movies: ఆ సినిమా ఫ్లాప్ అవడంతో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చిన చిరంజీవి!
'మెగాస్టార్' గా గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవి కెరీర్ లో కొన్ని డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. 40 ఏళ్ళ సినీ కెరీర్ లో చిరుని తీవ్రంగా నిరాశ పరిచిన ఆ చిత్రాలు ఏవంటే!
గత నాలుగు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఇన్నేళ్ల కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నారు. ఓవైపు ఇండస్ట్రీ రికార్డులు, భారీ బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నా.. మరోవైపు డిజాస్టర్లు, భారీ ఫ్లాపులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ డౌన్ అవుతుంది అన్నప్పుడు ఒకే ఒక్క సినిమాతో అన్నింటినీ సమం చేయడం చిరుకి అలవాటే. ఎప్పుడూ తన సినిమాలతో అభిమానులు రంజింపజేయాలని తాపత్రయపడే చిరు.. కొన్ని సార్లు తీవ్రంగా నిరాశ పరిచారు. ఈరోజు ఆయన బర్త్ డే సందర్భంగా ఆ సినిమాలెంటో ఇప్పుడు చూద్దాం!
1978లో 'ప్రాణం ఖరీదు' సినిమాతో వెండితెరకు పరిచయమైన చిరంజీవి.. కెరీర్ ప్రారంభంలో రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చారు. 'మనవూరి పాండవులు' తర్వాత చేసిన 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ', 'కొత్త అల్లుడు', 'ఐ లవ్యూ' లాంటి చిత్రాలు ప్రేక్షకులని అలరించలేదు. 'శ్రీ రామ బంటు', 'అగ్ని సంస్కారం', 'జాతర' సినిమాలు ఇదే కోవకు చెందుతాయి. 'పున్నమి నాగు' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న చిరు.. వెంటనే 'నకిలీ మనిషి' 'కాళి' 'లవ్ ఇన్ సింగపూర్' చిత్రాలతో పరాజయాలు చవిచూశారు. 'న్యాయం కావాలి' బ్లాక్ బస్టర్ హిట్టయిన తర్వాత, 'ఊరికిచ్చిన మాట' '47 రోజులు' వంటి ఫ్లాప్స్ పడ్డాయి.
1981 - 82 కాలంలో 'చట్టానికి కళ్ళు లేవు' 'కిరాయి రౌడీలు' 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' 'శుభలేఖ' సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు సాధించారు చిరంజీవి. కానీ ఆ తర్వాత 'ఇది పెళ్ళంటారా' 'సీతాదేవి' 'రాధ మై డార్లింగ్' వంటి హ్యాట్రిక్ ఫ్లాప్స్ పలకరించాయి. 'పట్నం వచ్చిన పతివ్రతలు' చిత్రంతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. అయితే చిరు సిల్వర్ జూబ్లీ మూవీ 'బంధాలు అనుబంధాలు' మాత్రం నిరాశ పరిచింది. హిట్ అవుతుందని నమ్మిన 'శివుడు శివుడు శివుడు' సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.
Also Read: చిరంజీవిని ‘మెగాస్టార్’ చేసిన మూవీస్ ఇవే - ఇలాంటి పాత్రలు మరే హీరో చేయలేరంటే నమ్ముతారా?
'ఖైదీ' చిత్రంతో ఫుల్ ఫార్మ్ లోకి వచ్చిన చిరంజీవికి 'మహానగరంలో మాయగాడు' మూవీ బ్రేక్ వేసింది. 'పులి', 'కిరాతకుడు' సినిమాలు కూడా ఆశించిన విజయాలు అందుకోలేదు. మెగాస్టార్ ఎన్నో ఆశలు పెట్టుకున్న 'వేట' చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 'ఖైదీ' కాంబినేషన్ కావడంతో, అంతకు మించి హిట్ అవుతుందని చిరు హోప్స్ పెట్టుకున్నారు. ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ అవడం ఆయన్ను బాగా కలిచివేసింది. ఆ బాధను తట్టుకోలేక ఇంట్లో దుప్పటి కప్పుకుని వెక్కివెక్కి ఏడ్చినట్లు చిరు ఓ ఇంటర్వూలో స్వయంగా వెల్లడించారు. దాన్నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టిందని చెప్పారు.
'వేట' ప్లాప్ తర్వాత వెంటనే 'చంటబ్బాయ్' తో తిరిగి పుంజుకున్నారు. అయితే 'దైర్యవంతుడు', 'చాణక్య శపథం', 'ఆరాధన' సినిమాలు కూడా చిరంజీవికి సక్సెస్ అందించలేకపోయాయి. కచ్ఛితంగా హిట్ అవుతుందని అనుకున్న 'రుద్రవీణ' పరాజయం చెందగా, 'లంకేశ్వరుడు' నిరాశ పరిచింది. 90స్ లో మెగాస్టార్ కెరీర్ ను దెబ్బేసిన సినిమాలు చాలా ఉన్నాయి. 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్', 'SP పరశురామ్' 'బిగ్ బాస్' 'రిక్షావోడు' 'ఇద్దరు మిత్రులు' వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
2001 సంక్రాంతికి 'మృగరాజు' సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు చిరు. ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్న 'అంజి' (2004) చిత్రం కూడా డిజార్డర్ గా నిలిచింది. 2022లో వచ్చిన 'ఆచార్య' సినిమా మెగాస్టార్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే భారీ డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. తనయుడు రామ్ చరణ్ తో కలసి చేసిన మల్టీస్టారర్ మూవీ మెమరబుల్ గా మిగిలిపోవాలని కోరుకున్నారు. కానీ అది తీవ్ర నిరాశ పరిచింది. ఇప్పుడు లేటెస్టుగా 'భోళా శంకర్' సినిమాతో మరో భారీ డిజాస్టర్ చవిచూశారు.
Also Read: Happy Birthday Megastar - బాస్ తలచుకుంటే బాక్సులు బద్దలు కావాల్సిందే, ఇదీ మెగాస్టార్ స్టామినా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial