Happy Birthday Megastar Chiranjeevi: హ్యపీ బర్త్ డే చిరు: బాస్ తలచుకుంటే బాక్సులు బద్దలు కావాల్సిందే, ఇదీ మెగాస్టార్ స్టామినా!
నేడు (ఆగస్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన 68వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బర్త్ డే విషెస్ అందజేస్తూ, ఆయన సినీ ప్రయాణంలోని విశేషాలను తెలుసుకుందాం.
భారతీయ చిత్ర చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న హీరో 'మెగాస్టార్' చిరంజీవి. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అసాధారణ వ్యక్తిగా ఆవిర్భవించిన మహోన్నత వ్యక్తి ఆయన. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి, తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసారు.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్మరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సేవాగుణంలోనూ తనకు సాటిలేరు అనిపించుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడిగా మారాడు. ఎందరికో స్ఫూర్తినిచ్చి ఆపన్నులకు అండగా ఉన్న కృషి వలుడు 'రియల్ హీరో' చిరంజీవి పుట్టినరోజు నేడు. ఆ సందర్భంగా 'బిగ్ బాస్' సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుందాం.
చిరంజీవి బాల్యం, విద్యాబ్యాసం..
ఆంధ్ర ప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో కానిస్టేబుల్ కొణిదెల వెంకటరావు - అంజనాదేవి దంపతులకు 1955 ఆగస్టు 22న జన్మించారు చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివ శంకర వరప్రసాద్. కానిస్టేబుల్ అయిన తన తండ్రి వృత్తిరీత్యా తరచుగా బదిలీ అవుతుంటారు కాబట్టి, అతని బాల్యం అంతా స్వగ్రామంలో తాతయ్యలతో గడిపాడు. నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులలో పాఠశాల విద్యను అభ్యసించాడు. ఒంగోలులోని C.S.R. శర్మ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాడు. నర్సాపురంలోని శ్రీ వైఎన్ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసాడు. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి కలిగి ఉన్న చిరు.. యాక్టింగ్ నేర్చుకోడానికి 1976లో మద్రాసు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు.
చిరు సినీ ప్రయాణానికి 'పునాది'రాళ్లు..
చిరంజీవి 'పునాదిరాళ్లు' సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించాడు. అయితే 'ప్రాణం ఖరీదు' (1978) చిత్రం ముందుగా విడుదలైంది. అదే ఆయన్ను తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఫస్ట్ మూవీ 'పునాదిరాళ్లు' 1979లో రిలీజ్ అయింది. 'మన వూరి పాండవులు' సినిమా నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించారు. 'ఐ లవ్ యూ' 'ఇది కథ కాదు' 'మోసగాడు' 'రాణి కాసుల రంగమ్మ' '47 రోజులు' 'న్యాయం కావాలి' వంటి చిత్రాలలో ప్రధాన ప్రతినాయకుడిగా మెప్పించారు.
1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమా హీరోగా చిరంజీవికి మంచి కమర్షియల్ విజయాన్ని అందించింది. అదే ఏడాది వచ్చిన 'శుభలేఖ' చిత్రం ఉత్తమ నటుడిగా మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'ఇది పెళ్లంటారా' 'సీతాదేవి' 'టింగు రంగడు' 'మొండి ఘటం' వంటి సినిమాల్లో కనిపించాడు. ఆ టైములో 'పట్నం వచ్చిన పతివ్రతలు' 'బిల్లా రంగ' 'మంచు పల్లకి' వంటి మల్టీస్టారర్ సినిమాలలో నటించాడు. 1982లో వచ్చిన 'బంధాలు అనుబంధాలు' ఆయన కెరీర్ లో 50వ చిత్రం. అంటే తెరంగేట్రం చేసిన 5 ఏళ్లలోనే యాభై సినిమాల్లో నటించేశారు చిరు.
'ఖైదీ'తో స్టార్‌డమ్..
1983లో వచ్చిన 'ఖైదీ' సినిమా బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు, చిరంజీవికి స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'మంత్రి గారి వియ్యంకుడు', 'సంఘర్షణ', 'ఛాలెంజ్', 'దొంగ' 'అడవి దొంగ' 'దొంగ మొగుడు' 'జేబు దొంగ' 'కొండవీటి రాజా' 'చంటబ్బాయి' 'విజేత' వంటి హిట్లు పడటంతో, కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 'స్వయంకృషి' (1987) చిత్రానికి గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా తన మొదటి నంది అవార్డును అందుకున్నారు. 'పసివాడి ప్రాణం', 'యముడికి మొగుడు', 'మంచి దొంగ' 'ఖైదీ నెం. 786' 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' 'స్టేట్ రౌడీ' 'కొండవీటి దొంగ' (70mm 6-ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్‌లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం) వంటి సినిమాలు సుప్రీం హీరోని టాప్ లో నిలబెట్టాయి. చిరు సహ నిర్మాతగా వ్యవహరించిన 'రుద్రవీణ' (1988) సినిమా నర్గీస్ దత్ అవార్డు గెలుచుకుంది.
బిగ్గర్ ద్యాన్ బచ్చన్..
1990లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' వంటి సోషియో ఫాంటసీ సినిమాతో ప్రయోగం చేసి బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు చిరంజీవి. 1991లో 'గ్యాంగ్ లీడర్' 'రౌడీ అల్లుడు' చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని ఆయన్ను 'బాస్ ఆఫ్ తెలుగు సినిమా'గా 'మెగాస్టార్'గా మార్చేశాయి. 'ప్రతిబంధ్' 'ఆజ్ కా గూండా రాజ్' వంటి రీమేక్ సినిమాలతో హిందీలోనూ ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి. 'ఘరానా మొగుడు' (1992) మూవీ బాక్సాఫీస్ వద్ద ₹10 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'ఆపద్బాంధవుడు' చిత్రానికి అత్యధికంగా ₹1.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడుగా కొన్ని నేషనల్ మ్యాగజైన్స్ చిరంజీవి కవర్ పేజీని ముద్రించాయి. 'బిగ్గర్ ద్యాన్ బచ్చన్', 'ది న్యూ మనీ మెషిన్' అంటూ కీర్తించాయి.
CHIRANJEEVI born on this day pic.twitter.com/TQUcIbgfk1
— Film History Pics (@FilmHistoryPic) August 22, 2022
అయితే 'ముఠామేస్త్రి' వంటి సూపర్ హిట్ తర్వాత వరుస ప్లాప్స్ తో కెరీర్ కాస్త డౌన్ అయింది. 'మెకానిక్ అల్లుడు' 'S.P. పరశురాం' 'బిగ్ బాస్' 'రిక్షావోడు' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు అందుకోలేదు. మధ్యలో 'ముగ్గురు మొనగాళ్లు' సినిమా యావరేజ్ ఫలితాన్ని నమోదు చేసింది. 'అల్లుడా మజాకా' చిత్రం పెద్ద ఎత్తున ట్రోలింగ్ ఎదుర్కొనేలా చేసింది. అప్పుడే 'సిపాయి' (1996) వంటి కన్నడ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు.
1997లో 'హిట్లర్' మూవీతో మెగాస్టార్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. 'మాస్టర్', 'బావగారు బాగున్నారా?', 'చూడాలని ఉంది' 'స్నేహం కోసం' చిత్రాలతో విజయాన్ని అందుకున్నాడు. 1999లో హాలీవుడ్ ప్రొడక్షన్ లో 'ది రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్' అనే సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. తెలియరాని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. 'అన్నయ్య'తో చిరంజీవి కొత్త దశాబ్దం మొదలైంది. 'మృగరాజు' 'డాడీ' సినిమాలు నిరాశ పరిచినప్పటికీ, 2002లో 'ఇంద్ర' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది.. టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగసింది. ఆ తర్వాత 'ఠాగూర్' 'శంకర్ దాదా MBBS' సినిమాలు హిట్ అవ్వగా..'అంజి' 'అందరివాడు' 'స్టాలిన్' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
2007లో 'శంకర్ దాదా జిందాబాద్' సినిమా తరువాత, చిరంజీవి సుమారు 10 సంవత్సరాలు ఏ చిత్రంలోనూ హీరోగా నటించలేదు. ఆ సమయంలో 'ప్రజారాజ్యం' పార్టీ స్థాపించి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అయితే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, 2012 - 2014 మధ్య కాలంలో పర్యాటక శాఖా మంత్రిగా సేవలు అందించారు. మధ్యలో తన కుమారుడు రామ్ చరణ్ నటించిన 'మగధీర' (2009) & 'బ్రూస్ లీ: ది ఫైటర్' (2015) అనే రెండు చిత్రాలలో స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చారు. 'వరుడు' 'రుద్రమదేవి' చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించారు.
'ఖైదీ నెం. 150' తో రీఎంట్రీ..
రాజకీయాలకు దూరమైన తర్వాత 'ఖైదీ నెం. 150' వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు చిరంజీవి. ఆ తర్వాత వచ్చిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేసారు. ఇదే క్రమంలో వచ్చి 'ఆచార్య' సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోగా, 'గాడ్ ఫాదర్' సినిమా హిట్ టాక్ తెచ్చుకొని కూడా బ్రేక్ ఈవెన్ సాధించలేకపోయింది. 'వాల్తేరు వీరయ్య' సినిమా బిగ్ బాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి చూపించింది. అయితే ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన 'భోళా శంకర్' మూవీ తీవ్ర నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో రాబోయే సినిమాతో ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ అవ్వాలని, సుఖ శాంతులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, 'ABP దేశం' మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial