Tickets Highcourt : టిక్కెట్ రేట్లపై ఇంకా చర్చిస్తున్నామని కోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం - విచారణ వచ్చే నెలకు వాయిదా !
టిక్కెట్ రేట్లపై ఇంకా చర్చిస్తున్నామని ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. దీంతో వచ్చే నెలకు హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.
చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఓ వైపు సీఎం జగన్‌తో చర్చలు జరుపుతున్న సందర్భంలోనే హైకోర్టులోనూ టిక్కెట్ ధరల అంశంపై విచారణ జరిపింది. సినిమా టికెట్ల ధరలపై త్వరలోనే ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనానికి తెలిపారు. హైకోర్టు సూచనలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కమిటీ ఇప్పటికే 3 సమావేశాలు నిర్వహించిందని తెలిపారు. మరో భేటీ జరపాల్సి ఉందని.. భేటీ తర్వాత టికెట్ల ధరల అంశం కొలిక్కి వస్తుందన్నారు. సమస్య పరిష్కారానికి సమయం కోరారు. అడ్వకేట్ జనరల్ విజ్ఞప్తితో హైకోర్టు విచారణ మార్చి 10కి హైకోర్టు వాయిదా వేసింది.
గత ఏడాది ఏప్రిల్‌లో సినిమా టిక్కెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నెం. 35 జారీ చేసింది. ఎగ్జిబిటర్లు టిక్కెట్ రేట్ల తగ్గింపు ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు గతంలో ఉండేదని..ఈ ప్రభుత్వం తొలగించిందని ధియేటర్ యాజమాన్యాలు కోర్టులో వాదించాయి. పదేళ్ల కిందటి నాటి టిక్కెట్ రేట్లను ఖరారు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని వాదించారు. సింగిల్ బెంచ్ జీవో నెం.35ను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది. తర్వాత ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. టిక్కెట్ ధరలపై కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం కమిటీ నియమించింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధరలను ఖరారు చేసేందుకు నియమించిన కమిటీ మూడు సార్లు సమావేశం అయింది. ధియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు, ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు తమ బాధలన్నీ చెప్పుకున్నారు. టిక్కెట్ రేట్లు అంత తక్కువకు ఉంటే నడపలేమన్నారు. కరెంట్ బిల్లులు, జీఎస్టీ ఛార్జీలు, నిర్వహణ ఖర్చులు భరించలేమన్నారు. అదే సమయంలో ప్రేక్షకుల తరపున ప్రతినిధులు కూడా హాజరయ్యారు. చివరికి రిపోర్ట్ సమర్పించారన్న ప్రచారం జరిగింది కానీ అలాంటిదేమీ లేదని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం టిక్కెట్ ధరలపై నియమించిన కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత సీఎంకు నివేదిక ఇస్తారు. ఆ నివేదికను పరిశీలించి సీఎం టిక్కెట్ ధరలను ఖరారు చేస్తారు. ఇదంతా నెలాఖరులోపు జరిగే అవకాశం ఉంది. అందుకే వచ్చే విచారణ కల్లా సమస్యను పరిష్కరించామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపే అవకాశం ఉంది. టిక్కెట్ల ఇష్యూ పరిష్కారం అయితే వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధమవుతాయి.