Leo Trailer: ‘లియో’ ట్రైలర్ రివ్యూ: విజయ్ ఒక్కడు కాదట, ఇవి గమనించారా?
విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'లియో'. దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేసారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లియో’. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, రెండు పాటలు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ తాజాగా ట్రైలర్ ను ఆవిష్కరించారు.
‘‘సీరియల్ కిల్లర్ నడి రోడ్డు మీద గుడ్డిగా షూట్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలా మంది చనిపోయారు.. వాడు అందరినీ కలుస్తున్నాడు’’ అంటూ వాయిస్ ఓవర్ తో కథను చెప్పడంతో ‘లియో’ ట్రైలర్ ప్రారంభమైంది. ఇది లోకేష్ కనగరాజ్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఓవైపు యాక్షన్ ను హైలైట్ చేస్తూనే, మరోవైపు సినిమా కథేంటి? అనే ఆసక్తి రేకెత్తించేలా ఈ ట్రైలర్ ను కట్ చేశారు.
కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తారా? ఒకరు మంచోడైతే, మరో క్యారెక్టర్ లో నెగటివ్ షేడ్స్ చూపించబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తేలా లియో ట్రైలర్ సాగింది. లియోదాస్, పార్థి అనే రెండు పాత్రల్లో విజయ్ ను చూపించారు. అయితే ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటంతో ఒకరనుకొని మరొకరిని శత్రువులు వెంబడిస్తున్నట్లు ట్రైలర్ లో చూపించారు.
రౌడీల నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి తప్పించుకొని తిరుగుతున్న పార్థి, చివరకు వారిపై తిరగబడటాన్ని మనం చూడొచ్చు. విజయ్ భార్యగా త్రిష నటించింది. ఆమె పాత్రకు మంచి స్కోప్ ఉన్నట్లు తెలుస్తోంది. సంజయ్ దత్, అర్జున్, డైరెక్టర్ మిస్కిన్ లు విలన్స్ గా.. గౌతమ్ మీనన్ పోలీసాఫీసర్ గా కనిపించారు. చివర్లో లియోగా విజయ్ ను ఇంకో లుక్ లో చూపించడంతో ట్రైలర్ ముగుస్తుంది.
అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? లియో, పార్థి ఇద్దరూ ఒకరేనా? ఒకవేళ వేర్వేరు అయితే ఒకేలా ఎందుకున్నారు? అనేది ఆసక్తికరంగా మారింది. అలానే ఈ కథలో అనురాగ్ కశ్యప్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ వంటి ఇతర ప్రధాన పాత్రధారులను కథలో ఎలా భాగం చేశారనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.
'లియో'లో విజయ్ చాలా రోజుల తర్వాత సరికొత్త గెటప్ అండ్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఆయనపై చిత్రీకరించిన యాక్షన్ సీన్స్, అతని ఇంటెన్స్ యాక్టింగ్ అభిమానులను మెప్పిస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఎప్పటిలాగే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. కెమెరామెన్ మనోజ్ పరమహంస విజువల్స్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. అన్బురివ్ ఫైట్స్ ఆకట్టుకుంటాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
'లియో' చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించారు. అక్టోబర్ 19న తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. తెలుగులో ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్, విజయ్ సినిమాలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. మరి విజయ దశమికి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: ‘భగవంత్ కేసరి’ నుంచి బాలయ్య, శ్రీలీలాల సాంగ్ వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial