Siddharth Roy: చెన్నైలో ఉండి బతికిపోయాడు - సంగీత దర్శకుడిపై 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టర్ ఫైర్
Siddharth Roy: మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై 'సిద్ధార్థ్ రాయ్' డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసారు. చెన్నైలో ఉండి బతికిపోయాడని, ఇక్కడ ఉంటే చాలా గొడవలు అయ్యేవని ఫైర్ అయ్యారు.
Siddharth Roy: చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘సిద్ధార్థ్ రాయ్’. వి యశస్వీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూర్చారు. ఈరోజు గ్రాండ్ గా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు యశస్వీ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫైర్ అయ్యారు. సినిమా ఇంత లేట్ అవ్వడానికి అతనే కారణమని, చెన్నైలో ఉండి బతికిపోయాడని, ఇక్కడ ఉంటే చాలా పెద్ద గొడవలు అయ్యేవంటూ విరుచుకుపడ్డారు.
యశస్వీ మాట్లాడుతూ.. 'సిద్ధార్థ్ రాయ్' సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయిందని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవుతూ వచ్చిందని తెలిపారు. అయితే ఈ ఆలస్యానికి ప్రధాన కారణం సంగీత దర్శకుడు రధనే అని అన్నారు. తనలాగా ఇంకెవరూ మోసపోకూడదనే ఈ విషయం చెప్తున్నాను. "రధన్ అధ్బుతమైన టెక్నీషియన్ అనుకోని మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ అతని చేతిలో పడి సినిమా నలిగిపోతోంది. రధన్ అనే వ్యక్తి ఎప్పుడూ గొడవ పడటానికే మాట్లాడతాడు" అని చెప్పారు.
"రధన్ అనే వ్యక్తి ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ అనేది అటుంచితే.. అతను సినిమాని కంప్లీట్ గా ఒక కార్నర్ కి తీసుకెళ్ళి మనల్ని వదిలేస్తాడు. అతను చెన్నైలో ఉంటాడు. అక్కడ ఉండి బతికిపోయాడు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉంటే చాలా గొడవలు జరిగేవి" అంటూ యశస్వి నిప్పులు చెరిగారు. ఒక డెబ్యూ డైరెక్టర్ ప్రముఖ సంగీత దర్శకుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
నిజానికి రధన్ పై ఇలాంటి విమర్శలు రావటం మొదటి సారి ఏమీ కాదు. గతంలో సంగీత దర్శకుడి తీరుపై డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకి అనుకున్న సమయాని కంటే చాలా ఆలస్యంగా ట్యూన్స్ ఇచ్చాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకానొక స్టేజ్ లో తను ఈ సినిమా వదిలేస్తే ఏం చేస్తావ్ అని అన్నాడని తెలిపారు. అందుకే బ్యాగ్రౌండ్ స్కోర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో చేయించామని చెప్పారు.
'అందాల రాక్షసి' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రధన్.. 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'అర్జున్ రెడ్డి', 'హుషారు', 'జాతి రత్నాలు', 'పాగల్', 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చినప్పటికీ తెలుగులో పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోయాడు. దీనికి అతని ప్రవర్తనే కారణమని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక 'సిద్ధార్థ్ రాయ్' సినిమా విషయానికొస్తే, ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. సుకుమార్ లాంటి అగ్ర దర్శకుడు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగం అయ్యారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ & విహిన్ క్రియేషన్స్ పతాకాలపై జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయినలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు విడుదలైన ఈ న్యూ ఏజ్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: హీరోలుగా ముగ్గురు కమెడియన్లు.. హిట్టు కొట్టేదెవరు?