Subhalekha Sudhakar : ఐశ్వర్య రాజేష్ తండ్రి అలా అయిపోతాడని అనుకోలేదు, అందుకే హీరో కాలేకపోయా - శుభలేఖ సుధాకర్
Subhalekha Sudhakar about Aishwarya Rajesh : సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ తో పాటు ఒకప్పటి నటుడు రాజేష్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Aishwarya Rajesh Father : తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ప్రత్యక్ష గుర్తింపు తెచ్చుకున్నారు శుభలేఖ సుధాకర్ (Subhalekha sudhakar). కె. విశ్వనాథ్ తెరకెక్కించిన 'శుభలేఖ' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన శుభలేఖ సుధాకర్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా నటుడు కావాలనే ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో, విలన్ తదితర పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శుభలేఖ సుధాకర్ తన సినీ కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజేంద్రప్రసాద్, నరేష్, తాను ఒకే సమయంలో కెరియర్ స్టార్ట్ చేశామని, చంద్రమోహన్ గారు తమ కంటే సీనియర్ అని చెప్పారు. ఆయనతో 'తోడల్లుడు' సినిమాలో కలిసి నటించానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
అందుకే హీరో కాలేకపోయా
మీకు హీరోగా అవకాశాలు రాకపోవడానికి మీ పర్సనాలిటీ కూడా ఒక మైనస్ అయి ఉండొచ్చా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు శుభలేఖ సుధాకర్ బదులిస్తూ.. "అయ్యుండొచ్చు, ఎందుకంటే ఒకప్పుడు సినిమాకి కొలబద్ద అనేది ఉండేది. ఒక హీరో అంటే ఇలా ఉండాలి. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. క్యారెక్టర్ యాక్టర్ అంటే ఇలా ఉండాలి.. ఇలా ప్రతిదానికి ఒక కొలబద్ద ఉండేది. అలా నా పర్సనాలిటీని తీసుకుంటే నేను హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్.. దేని కింద పనికిరాను. అలా నాకు అన్ని మైనస్ గా మారాయి. అయినా కూడా నేను నటుడిగా ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నా అంటే అంతా భగవంతుడు ఆశీస్సులు, ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసిన విధానం, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నన్ను తీర్చిదిద్దిన విధానం.. వీటన్నిటి వల్లే ఇప్పటికీ నటుడుగా కొనసాగుతున్నాను" అని అన్నారు.
నా ఫేస్ చూసి ఎవరు లవ్ చేస్తారు? జంధ్యాల కుదిర్చిన బంధం మాది
"నాకు రెండే రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి నా ఇల్లు, రెండు నా భార్య శైలజ అంతే.. అంతకుమించి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు" అని అన్నారు. శైలజ గారితో మీది లవ్ మ్యారేజా? అని అడిగితే.. "నా ఫేస్ చూసి ఎవరు లవ్ చేస్తారండి అని నవ్వుతూ చాలామంది మాది లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు. కానీ మాది లవ్ మ్యారేజ్ కాదు. మా పెళ్లి కుదిర్చింది జంధ్యాల గారు. ఆయనే మా పెళ్లికి మూలకర్త. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారిని నేను సార్ అని పిలుస్తాను. వారు నాకు పరిచయమైనప్పటి నుంచే సర్ అని పిలిచేవాడిని. ఇప్పుడు బంధుత్వం కలిసినా కూడా ఆయన్ని సార్ అని పిలవడమే నాకు ఇష్టం" అని చెప్పారు.
నేను, రాజేష్ రూమ్‌మేట్స్
"నేను, రాజేష్, బాలాజీ, రాజా, సింగర్ మనో.. మేమంతా కలిసి ఉండేవాళ్ళం. సింగర్ మనో కూడా నటుడు అవ్వాలని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఆయనకి సంగీతం మీద కాస్త మక్కువ ఉండడంతో అటు పక్కకు వెళ్ళిపోయారు" అని చెప్పుకొచ్చారు. ఇక ఒకప్పటి నటుడు రాజేష్ గురించి మాట్లాడుతూ.." రాజేష్ చాలా అందగాడు. మంచి పర్సనాలిటీ, ఆయన కెరీర్ లో పెద్ద పొజిషన్లో ఉంటారని నేను అనుకునేవాడిని. ఆయన కొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. విలన్ గా కూడా చేశారు. కానీ అనుకోని విధంగా ఆయన అలా అయిపోతారని అసలు అనుకోలేదు. అప్పుడు ఆయనకి రాని గుర్తింపు ఇవ్వాళ వాళ్ళ అమ్మాయి(ఐశ్వర్య రాజేష్) కి వచ్చింది" అని చెప్పుకొచ్చారు శుభలేఖ సుధాకర్.
Also Read : స్వాతి కోసం బెంగళూరు కాలేజీకి వెళ్ళిన బన్నీ - అప్పుడు ఏం జరిగిందంటే?