శరత్ బాబు నన్ను సిగరెట్ తాగొద్దని మందలించేవాడు: రజనీ కాంత్
మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న శరత్ బాబు మరణంపై సూపర్ స్టార్ రజనీకాంత్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. తనను బాగా ఇష్టపడే వ్యక్తి.. తనపై ప్రేమ, ఆప్యాయతలు చూపించే వ్యక్తి ఇప్పుడు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
Rajinikanth : ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు.. మే 22న హైదరాబాద్‌లో కన్నుమూశారు. దీంతో పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు, స్టార్ హీరోలు శరత్ బాబుకు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ రజనీ కాంత్ చెన్నైలోని శరత్ బాబు నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం రజనీకాంత్ శరత్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ముఖంలో ఎప్పుడూ కోపం చూడలేదని, ఎప్పుడూ నవ్వుతూ కనిపించేవారని వెల్లడించారు.
శరత్ బాబును కడసారి చూసేందుకు వెళ్లిన రజనీ కాంత్ ఎమోషనల్ అయ్యారు. ఆయన భౌతిక కాయాన్ని చూడగానే రజనీ భావోద్వేగానికి గురయ్యారు. తన పట్ల శరత్ బాబు చాలా ఆప్యాయంగా, ప్రేమగా ఉండేవారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఆయన మృతి చెందడం తనకు చాలా బాధను మిగిల్చిందన్న రజనీ.. ఆయనకు తనకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. ఆయన తనకు నటుడు కాకముందే బాగా పరిచయమన్నారు. మంచి వ్యక్తి అని, ఎప్పుడూ నవ్వుతూనే కనిపించే వారని రజనీ తెలిపారు. ఆయన సీరియస్ గా ఉండడం ఎప్పుడూ చూడలేదన్న సూపర్ స్టార్.. ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపించేవారని చెప్పారు.
కలిసి నటించాం.. విజయం సాధించాం..
శరత్ బాబు తన సినీ ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారని రజనీ కాంత్ చెప్పారు. తామిద్దరం కలిసి పలు చిత్రాల్లో నటించడం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వాటిల్లో ముల్లుమ్ మలరుమ్ , ముత్తు , అన్నామలై, వేలైక్కారన్ సినిమాలు చేశానని, అవన్నీ చాలా పెద్ద హిట్స్ అయ్యాయని చెప్పారు.
సిగరెట్ తాగొద్దని మందలించేవారు
తనకు శరత్ బాబు ఎప్పుడూ ధూమపానం మానేయమని సలహా ఇస్తుండేవారని రజనీ కాంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయనకు తనపై చాలా ప్రేమ, ఆప్యాయత ఉండేవని చెప్పారు. తాను ఎప్పుడైనా అతనికి సిగరెట్ తాగుతూ కనిపిస్తే దాన్ని లాక్కొని ధూమపానం చేయకుండా ఆపేవాడని రజనీ అన్నారు. కాబట్టి తాను అతని ముందు సిగరెట్ తాగడ మానేశానని చెప్పారు. ఓ సందర్భంలో నేను సిగరెట్ కాల్చడం చూసి.. మానేయమంటూ మందలించినట్టు రజనీ తెలిపారు. ‘అన్నామలై’ సినిమాలో ఓ ఛాలెంజింగ్ సన్నివేశాన్ని రజినీకాంత్ గుర్తు చేసుకున్నారు. ‘‘శరత్‌బాబుతో స్నేహం చెడిపోయిన తర్వాత వచ్చే భావోద్వేగ సీన్ సరిగ్గా రాకపోవడంతో చాలా టేకులు తీసుకోవల్సి వచ్చింది. ఆ సమయంలో శరత్ బాబు తనకు సిగరెట్ ఇచ్చారు. దీంతో నేను కాస్త రిలాక్స్ అయ్యాను. ఆ తర్వాత శరత్‌తో కలిసి ఆ సన్నివేశంలో నటించా. ఆ టేక్ కూడా ఓకే అయింది’’ తెలిపారు. అతను ఎల్లప్పుడూ తనకు మంచి జరగాలని, తన ఆరోగ్యం గురించి సలహా ఇచ్చేవాడని, తనను బాగా ఇష్టపడేవారని.. కానీ అతను ఇప్పుడు మధ్య లేడని రజనీకాంత్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ శరత్ బాబుతో తనకున్న అనుబంధాన్ని చెప్పుకొచ్చారు.
Read Also : Ram Charan Hollywood Debut : హాలీవుడ్ అరంగేట్రంపై రామ్ చరణ్ హింట్ - జీ20 సదస్సులో ఏం చెప్పారంటే?