Aishwarya Rajesh : ‘సంక్రాంతికి వస్తున్నాం’ నా రేంజ్‌ని పెంచేసింది.. ఎయిర్ పోర్ట్‌లో వస్తుంటే ఎగబడుతున్నారు
Aishwarya Rajesh Sankranthiki Vasthunnam Interview: ‘సంక్రాంతికి వస్తున్నాం’ తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని, ఈ సినిమా ఎంతగా జనాల్లోకి వెళ్లిందో.. ఐశ్వర్య రాజేష్ ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు.
Aishwarya Rajesh about Sankranthiki Vasthunnam: ఈ సంక్రాంతికి టైటిల్‌లోనే సంక్రాంతిని నింపుకుని వస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విక్టరీ వెంకటేష్ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి హిట్ మెషిల్ అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 14న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పోటీలో ఉన్న రెండు సినిమాలు ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ కంటే ముందుంది.
సైలెంట్‌గా వెంకీ ఈ సినిమాను ప్రేక్షకులలోనికి తీసుకెళ్లారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు పెద్ద విజయం సాధించడంతో.. సంక్రాంతికి వచ్చే బొమ్మలలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్న చిత్రమిదే అనేలా టాక్ వినిపిస్తుంది. ఇక చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..
‘‘నేను ‘సుడల్’ అనే వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి కాల్ వచ్చింది. ఓ సినిమా కోసం మిమ్మల్ని అనుకుంటున్నాం. లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. అంతకు ముందు అనిల్ రావిపూడిగారి సినిమాలన్నీ చూశాను. మంచి హిట్ సినిమాలు. ఆయన నుండి ఫోన్ రాగానే సర్‌ప్రైజ్ అయ్యాను. లుక్ టెస్ట్ నిమిత్తం హైదరాబాద్ వచ్చాను. నా పాత్రకి ఒక యాస వుంది. రెండే రెండు లైన్స్ చెప్పాను.. అంతే మీరు సెలక్ట్ అయ్యారు అంటూ స్టోరీ చెప్పడం మొదలెట్టారు. ఆయన స్టోరీ చెబుతున్నంత సేపూ పడిపడి నవ్వుతూనే ఉన్నాను. నా కెరీర్‌లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ మరొకటి లేదు. ఇందులో భాగ్యం పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర నాకు దక్కడం నిజంగా నా అదృష్టం అని భావిస్తున్నాను.
‘సంక్రాంతికి వస్తున్నాం’ నాకు చాలా స్పెషల్ సినిమా. ఎందుకంటే.. ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ఇందులోని ‘గోదారి గట్టు’ పాట అందరికీ రీచ్ అయ్యింది. నేను ఎయిర్ పోర్ట్‌లో వస్తుంటే.. ప్రతి ఒక్కరూ నాతో ఫోటో కోసం ఎగబడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ అలా జరగలేదు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్‌లా జనాల్లోకి వెళ్లిపోయింది. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇప్పటి వరకు నేను కొన్ని సినిమాలు చేశాను కానీ.. ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ మాత్రం నాకు పడలేదు. ఆ లోటు ‘సంక్రాంతికి వస్తున్నాం’లోని ‘గోదారి గట్టు’ పాట తీర్చేసింది. వెంకటేష్‌గారిలాంటి బిగ్ హీరోతో ఇలాంటి సాంగ్ పడటం, అది ఇంత వైరల్ హిట్ కావడం నిజంగా చాలా ఆనందంగా వుంది. అలాగే సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్ హిట్ అవడంతో.. విడుదలకు ముందే సగం సినిమా పాసైపోయినట్లుగా నేను భావిస్తున్నాను. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేసే సినిమా.
ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం అనే పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇంకా చెప్పాలంటే కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. ఏ కొంచెం బ్యాలెన్స్ తప్పినా సినిమా అంతా ఆగమవుతుంది. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ అయితే నేను చేయలేదు. ఆడియన్స్ చూస్తున్నప్పుడు నా పాత్రపై జాలి పుడుతుంది. ఏ కొంచెం శృతిమించినా ఓవర్ డోస్ అయిపోతుంది. అసలీ పాత్రని అర్థం చేసుకోవడానికే నాకు పదిరోజులు పట్టింది. అయితే సెట్‌లోకి వెంకీగారు, అనిల్ రావిపూడి ఎంతో సపోర్ట్ చేశారు. వెంకీ గారి ఎమోషన్స్ అన్నీ చాలా నేచురల్‌గా వుంటాయి. ఆయన ఫ్యామిలీ హీరో. ఆయన టైమింగ్ అద్భుతం. అలాంటి బిగ్ స్టార్.. భాగ్యం క్యారెక్టర్‌లో అదరగొడుతున్నావ్, క్రెడిట్ మొత్తం నీకే వస్తుందని మెచ్చుకుంటుంటే భలే అనిపించేది. కానీ, ఆయన ముందు డైలాగులు చెప్పేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది. ఆ టైమ్‌లో యూనిట్ అంతా చాలా సపోర్ట్ ఇచ్చేది. ముఖ్యంగా వెంకీగారు చాలా పాజిటివ్‌గా వుంటారు. వండర్ ఫుల్ పర్సన్.
నేను చేసిన భాగ్యం లాంటి పాత్ర ఈ ఐదారేళ్ళుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ పాత్ర. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైంది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ రావిపూడిగారు చాలా క్రియేటివ్‌గా ఎంటర్‌టైన్ చేస్తూ ఈ కథని చెప్పారు. ఇందులో నాతో పాటు నటించిన మీనాక్షికి, నాకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. తను చాలా స్వీట్ పర్సన్. ఈ సినిమాతో మా ఇద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మీను సాంగ్‌లో తప్పితే.. ముగ్గురం (వెంకీగారు, నేను, మీనాక్షి) సినిమా అంతా ట్రావెల్ అవుతాం. మా ముగ్గురిని చూడాల్సిందే.
ఇందులో వెంకీ గారిది మా ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్ర. ఆయన సీనియారిటీ ఈ పాత్రకు ప్రాణం పోసింది. దిల్ రాజు, శిరీష్ గార్ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో చేయాలని అందరికీ ఉంటుంది. ఈ బ్యానర్‌లో వర్క్ చేయడం నైస్ ఎక్స్‌పీరియన్స్. సినిమా అనేది భిన్నమైన కథలు చెప్పడానికి గొప్ప వేదిక అని నేను అనుకుంటున్నాను. నా వరకూ ఎప్పుడూ డిఫరెంట్ రోల్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుంటాను. ఏ పాత్ర చేసినా సోషల్ రెస్పాన్స్‌బిలిటీ ఉండాలని బాగా నమ్ముతాను’’ అని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చింది.
Also Read: తెలంగాణలో 'గేమ్ చేంజర్' బెనిఫిట్ షోలు లేవు, కానీ టికెట్ రేట్లు పెరిగాయ్... ఎంతో తెలుసా?