Sanjay Dutt : సంజూ బాబాపై ఇంకా తగ్గని 'కేజీఎఫ్' ఎఫెక్ట్.. వరుసగా అవే పాత్రల్లో ఛాన్స్
Sanjay Dutt New Movie : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ వరుసగా విలన్ పాత్రలు పోషిస్తున్నారు. ' కేజిఎఫ్' సినిమాలో విలన్ పాత్రను పోషించిన తర్వాత ఆయనకు అన్ని ఇలాంటి పాత్రలే వస్తుండడం గమనార్హం.
Sanjay Dutt Movies : పాన్ ఇండియా సినిమా ఎఫెక్ట్ నటీనటులపై ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా బాలీవుడ్ పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే చాలామంది బాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలలో భాషతో సంబంధం లేకుండా నటించడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. కుదిరితే విలన్ రోల్, లేదంటే సపోర్టింగ్ రోల్ దక్కినా సరే అన్నట్టుగా ఉన్నారు. కానీ గత కొన్ని రోజుల్లో కొంతమంది బాలీవుడ్ స్టార్ల జీవితాలను పాన్ ఇండియా సినిమాలు పూర్తిగా మార్చేశాయి. ముఖ్యంగా విలన్ పాత్రల కోసం కొంతమంది హిందీ హీరోలు పర్ఫెక్ట్ అన్నట్టుగా మారిపోయింది మేకర్స్ అభిప్రాయం. అందులో భాగంగా పలువురు బాలీవుడ్ స్టార్ట్స్ కి వరుసగా అలాంటి అవకాశాలే వస్తున్నాయి. అందులో సంజయ్ దత్ కూడా ఒకరు.
'కేజిఎఫ్' సినిమాలో సంజయ్ దత్ ఎంత క్రూయల్ గా కనిపించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పాత్రను చూస్తే థియేటర్లలో ఎవ్వరికైనా సరే దడ పుట్టాల్సిందే. ఎలాంటి జాలి, దయ లేకుండా మనుషుల్ని నరికి చంపే క్రూరమైన విలన్ గా కనిపించారు సంజయ్ దత్. అప్పటిదాకా ఆయనను కలలో కూడా ఎవ్వరూ అలాంటి మేకోవర్ లో చూసి ఉండరు. కానీ అప్పటి నుంచి ఈ హీరోకి వరసగా అలాంటి అవకాశాలే వస్తున్నాయి. 'కేజీఎఫ్' తరువాత సంజయ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలో కూడా విలన్ పాత్రను పోషించారు. తాజాగా సంజయ్ దత్ 'బాఘీ 4' సినిమాలో విలన్ గా నటించబోతున్నారు అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
సాజిద్ నదియావాలా నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్నారు. 'బాఘీ' ఫ్రాంచీలో ఇప్పటికే మూడు సీక్వెల్స్ రిలీజ్ అయ్యాయి. ఇక నాలుగవ సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ హీరో కాగా, ఫస్ట్ లుక్ లో ఆయన వాష్ రూమ్ కమోడ్ పై కూర్చుని మోస్ట్ వైలెంట్ మ్యాన్ గా కనిపించాడు. చేతిలో కత్తి, మరో చేతిలో మందు, ఆయన ముందు చచ్చి పడి ఉన్న మనుషులు, రక్తపు మరకలతో ఉన్న బట్టలు... ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. కన్నడ దర్శకుడు A హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా కనిపించబోతున్నాడు అంటూ తాజాగా మరో మోస్ట్ వైలెంట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అందులో ఓ సింహాసనంపై కూర్చున్న సంజు బాబా.. ఒడిలో ఓ అమ్మాయిని పడుకోబెట్టుకుని కోపంతో, బాధతో అరుస్తున్నట్టుగా కనిపిస్తోంది. అతని బట్టలు రక్తంతో తడిసిపోయి కనిపిస్తున్నాయి. సంజయ్ దత్ ని ఇంత క్రూరమైన లుక్ లో చూపించాలి అనుకోవడానికి ముఖ్యమైన కారణం 'కేజిఎఫ్' సినిమానే అని చెప్పొచ్చు. ఎప్పుడైతే 'కేజిఎఫ్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో అప్పటి నుంచి ఈ హీరోకి వరుసగా ఇలాంటి అవకాశాలే వస్తుండడం గమనార్హం. ఇక తాజాగా రిలీజ్ అయిన 'బాఘీ 4'లో సంజయ్ దత్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కొంతమేరకు 'యానిమల్' పోలికలు కూడా కూడా కన్పిస్తున్నాయి.