Samantha: నా విడాకులకు, రాజకీయాలకు సంబంధం లేదు - కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నటి సమంత స్పందించారు. తన విడాకులకు రాజకీయాలకు సంబంధం లేదని ఆవిడ స్పష్టం చేశారు. ఇంకా ఏమన్నారంటే?
అక్కినేని నాగచైతన్య, సమంత వైవాహిక జీవితం మీద విడాకుల మీద తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ కన్వెన్షన్ అక్రమ కట్టడం అని, కూల్చి వేయకుండా ఉండడం కోసం తన వద్దకు సమంతను పంపించాలని కేటీఆర్ అడిగితే అక్కినేని నాగ చైతన్య, నాగార్జున వెళ్ళమని చెప్పారని, అందుకు సమంత నిరాకరించడంతో విడాకులు ఇచ్చి పంపించేసారని కొండా సురేఖ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆవిడ వ్యాఖ్యల పట్ల సమంత స్పందించారు. తనపై వచ్చిన పుకార్ల మీద ఏమన్నారంటే?
కొండా సురేఖ గారు... మహిళగా చాలా ధైర్యం కావాలి!
''ఒక మహిళగా ఉండడం... అందులోనూ ఇంటి నుంచి బయటకు వచ్చి పని చేయడం... గ్లామర్ ప్రపంచంలో మనుగడ సాగించడం... ప్రేమలో పడటం... ఆ ప్రేమ నుంచి బయట పడటం... ఆ తరువాత ధైర్యంగా నిలబడి పోరాడటం... అందుకు చాలా ధైర్యం, బలం కావాలి'' అని సమంత పేర్కొన్నారు.
కొండా సురేఖ గారు అని గౌరవంగానే బదులు ఇచ్చినప్పటికీ సమంత మాటల్లో పదును చాలా ఉంది. ''నా ప్రయాణం పట్ల నేను చాలా గౌరవంగా ఉన్నాను. ఈ ప్రయాణం నన్ను తీర్చిన తీరుపట్ల కూడా గౌరవంగా ఉన్నాను. ఒక మంత్రిగా మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుందని మీరు గ్రహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇతరుల వ్యక్తిగత అంశాలు గురించి మీరు మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా, గౌరవంగా వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను'' అని సమంత తెలిపారు.
విడాకులు నా వ్యక్తిగత విషయం... రాజకీయం లేదు!
విడాకులు తన వ్యక్తిగత విషయమని సమంత స్పష్టం చేశారు. ఆ విషయంపై ఎటువంటి పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండాలని తాను రిక్వెస్ట్ చేస్తున్నానని తెలిపారు. తాము (అక్కినేని నాగచైతన్య, సమంత) విడాకుల విషయాన్ని రహస్యంగా ఉంచడం వెనుక ఎటువంటి తప్పుడు ప్రచారాలకు ఆహ్వానం పలికినట్లు కాదని చాలా సూటిగా చెప్పారు సమంత.
Official statement from Samantha @Samanthaprabhu2 pic.twitter.com/z3QORsInSi
— Vamsi Kaka (@vamsikaka) October 2, 2024
నాగ చైతన్యకు, తనకు మధ్య విడాకులు పరస్పర అంగీకారంతో, చాలా సామరస్య పూర్వకంగా జరిగాయని, అందులో ఎటువంటి రాజకీయం లేదని సమంత కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. రాజకీయ యుద్ధం నుంచి తన పేరును దూరంగా ఉంచవలసిందిగా సమంత రిక్వెస్ట్ చేశారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటున్నానని అదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సమంత వివరించారు.
Also Read: మంత్రి కొండా సురేఖ ఆరోపణల్ని ఖండించిన నాగార్జున... ఆయన ఏం చెప్పారంటే?
నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం మీద కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల పరిశ్రమ ప్రముఖులలో మాత్రమే కాదు సామాన్య ప్రేక్షకులలో కూడా ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం అవుతున్నాయి. సమంతకు ఆవిడ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. కోన వెంకట్, బీవీఎస్ రవి వంటి ప్రముఖులు సైతం ట్వీట్లు చేశారు.
Also Read: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్