Sairam Shankar: బంపర్ ఆఫర్ + అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి = వెయ్ దరువెయ్ : సాయిరామ్ శంకర్
'143', 'బంపర్ ఆఫర్' సినిమాలతో విజయాలు అందుకున్న సాయి రామ్ శంకర్, కొంత విరామం తర్వాత 'వెయ్ దరువెయ్' సినిమాతో ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
పూరి జగన్నాథ్ తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నటుడు సాయి రామ్ శంకర్ (Sairam Shankar). తొలుత 'ఇడియట్'లో చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ తర్వాత '143'తో హీరోగా పరిచయం అయ్యారు. 'బంపర్ ఆఫర్'తో మరో విజయం అందుకున్నారు. కరోనా వల్ల ప్రతి ఒక్కరి సినిమాలు ఆలస్యం అయ్యాయి. కొంత విరామం తర్వాత 'వెయ్ దరువెయ్'తో హీరోగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు సాయి రామ్ శంకర్ వస్తున్నారు. ఈ సినిమా మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి ట్రైలర్ విడుదల చేశారు.
'వెయ్ దరువెయ్' ట్రైలర్ ఎలా ఉందంటే?
'గుడ్ (మంచి)లో గుడుంబా శంకర్, ఈగోలో ఇస్మార్ట్ శంకర్, స్నేహంలో సాయి రామ్ శంకర్' అంటూ యాక్షన్ సీక్వెన్సులోని సన్నివేశాలతో 'వెయ్ దరువెయ్' ట్రైలర్ ప్రారంభమైంది. కామారెడ్డికి చెందిన టిపికల్ తెలంగాణ యువకుడిగా హీరో పాత్ర తీర్చిదిద్దినట్లు అర్థం అవుతోంది. 'తూ ఫికర్ మత్ కారో మామా' అంటూ సాయి రామ్ శంకర్ ఏం చేశారో తెలియాలంటే మార్చి 15న థియేటర్లకు వెళ్లాలి.
'వెయ్ దరువెయ్' సినిమాలో కామారెడ్డి నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ యువకుడికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనేది సినిమాలో చూడాలి. ఇందులో 30 ఇయర్స్ పృథ్వీ, 'సత్యం' రాజేష్, ప్రభాస్ శీను, 'చమ్మక్' చంద్ర కామెడీ చేయగా... సునీల్ విలన్ రోల్ చేశారు. సాదాసీదాగా కనిపించిన ఓ యువకుడికి విపరీతమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఎదురు తిరిగాడు? ఎంత పవర్ ఫుల్ గా మారాడు? అనేది సినిమాగా తెలుస్తుంది. కమర్షియల్ ఫిల్మ్ అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ''బంపర్ ఆఫర్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' లాంటి ఎమోషన్స్‌తో 'వెయ్ దరువెయ్' ఉంటుంది'' అని సాయి రామ్ శంకర్ చెప్పారు. ఇందులో ఓ ఎమోషన్ కూడా ఉందని దర్శకుడు నవీన్ రెడ్డి తెలిపారు.
Also Read: సినిమాల్లోకి రావాల్సినోడు... నటుడిగా రాణించాలనుకున్నాడు... రాజకీయాల్లో ఇద్దరు సీఎంలను ఓడించాడు
34 రోజుల్లో సినిమా తీయడం గ్రేట్ - హరీష్ శంకర్!
'వెయ్ దరువెయ్' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ఓ ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ''నేను ట్రైలర్ ముందు చూశా. బావుంది. 34 రోజుల్లో ఈ సినిమా తీశామని దర్శక నిర్మాతలు చెబితే ఆశ్చర్యపోయా. పక్కా ప్రణాళికతో సినిమా చేశారు. సాయి రామ్ శంకర్ నాకు బ్రదర్ లాంటి వాడు. అతని ఫుల్ ఎనర్జీని 'వెయ్ దరువెయ్'లో చూడబోతోన్నారు. పాటలు బాగున్నాయి. భీమ్స్ మంచి పాటలే కాదు... మంచి మాటలు కూడా మాట్లాడతాడని ఈ రోజే తెలిసింది. అతనితో పని చేయాలని కోరుకుంటున్నాను. మార్చి 15న ఈ సినిమా విడుదలవుతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి'' అని అన్నారు.
మంచి క్యారెక్టర్లు వస్తే చేయడానికి రెడీ - సాయి రామ్ శంకర్!
కథానాయకుడిగా '143'తో విజయం అందుకున్న తర్వాత మాస్ మహారాజా రవితేజ 'నేనింతే'లో సాయి రామ్ శంకర్ నటించారు. ఇప్పుడు రవితేజతో హరీష్ శంకర్ 'బచ్చన్ సాబ్' సినిమా చేస్తున్నారు. పవన్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా స్టార్ట్ చేశారు. ఒకవేళ ఆయా సినిమాల్లో అవకాశాలు వస్తే నటిస్తారా? అని అడిగితే 'ఎస్' అన్నారు సాయి రామ్ శంకర్. కొంత విరామం తర్వాత సినిమా విడుదల అవుతుండటంతో ఫస్ట్ సినిమా విడుదలైనట్టు ఉందని చెప్పుకొచ్చారు.