100 కోట్ల క్లబ్‌లో 'విరూపాక్ష' - ఆ హీరోల సరసన చేరిన మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన 'విరూపాక్ష' సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
![100 కోట్ల క్లబ్‌లో 'విరూపాక్ష' - ఆ హీరోల సరసన చేరిన మెగా మేనల్లుడు Sai Dharam Tej's 'Virupaksha' movie collected 100 crores 100 కోట్ల క్లబ్‌లో 'విరూపాక్ష' - ఆ హీరోల సరసన చేరిన మెగా మేనల్లుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/18/f0336c787c98ba35472f5c412ef03a9d1684388143223686_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చాలా కాలంగా సాలిడ్ హిట్ కోసం వేచి చూస్తున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, 'విరూపాక్ష' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మిస్టికల్ థ్రిల్లర్, బాక్సాఫీస్ వద్ద మైలురాయి మార్క్ అందుకుంది. వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
'విరూపాక్ష' సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకొని, బాక్సాఫీసు వద్ద తన హవా కొనసాగించింది. ఆ తర్వాత వారం రిలీజైన సినిమాలు తేలిపోవడం కూడా సాయి తేజ్ చిత్రానికి మరింత కలిసొచ్చింది. ఫలితంగా భారీ కలెక్షన్స్ నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా 100 కోట్ల క్లబ్ లో చేసినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
"సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ 'విరూపాక్ష' అద్భుతమైన కమర్షియల్ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల నుండి అపారమైన ప్రేమతో 100 కోట్లు సాధించింది " అని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోతో పాటుగా వంద కోట్ల పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'విరూపాక్ష' చిత్రానికి తెలుగులో ప్రేక్షకాదరణ దక్కిన తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేశారు. అయితే ఇతర భాషల్లో ఆశించిన మేరకు వసూళ్ళు రాబట్టలేకపోయింది. అయినప్పటికీ మూడు వారాల్లో 91 కోట్లు సాధించగలిగింది. ఈ క్రమంలో నాలుగో వారాంతంలో సగర్వంగా వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరైపోయింది.
1️⃣0️⃣0️⃣ Crores for Spine-Chilling #BlockbusterVirupaksha 🥳🔥
— SVCC (@SVCCofficial) May 18, 2023
Supreme Hero @IamSaiDharamTej's Exhilarating Thrill ride #Virupaksha Triumphs at WW Box-office captivating audience everywhere 👁️@iamsamyuktha_ @karthikdandu86 @Shamdatdop@AJANEESHB @SVCCofficial@SukumarWritings pic.twitter.com/ukxgQEX0cC
క్షుద్రపూజలు, చేతబడులు నేపథ్యంలో 'విరూపాక్ష' సినిమా తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర & సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. స్టార్ డైరక్టర్ సుకుమార్ దీనికి స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, రవి కృష్ణ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
100 కోట్ల హీరో అనిపించుకున్న మరో మెగా మేనల్లుడు..
'రేయ్' సినిమాతో హీరోగా పరిచయమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కష్ట పడుతూ వచ్చాడు. ఓ మోస్తరు విజయాలను అందుకున్నాడు కానీ, బాక్సాఫీసును షేక్ చేసే బ్లాక్ బస్టర్ హిట్స్ మాత్రం పడలేదు. నిన్నగాక మొన్నొచ్చిన తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్, మొదటి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. కానీ సాయితేజ్ మాత్రం ఆ మార్క్ కి చాలా దూరంలో ఉండిపోయాడు. అయితే ఇన్నాళ్ళకు 'విరూపాక్ష' చిత్రంతో 100 కోట్ల హీరో అనిపించుకున్నాడు.
టైర్-2 హీరోలలో ఇప్పటి వరకూ మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, నిఖిల్ సిద్దార్థ, వైష్ణవ్ తేజ్ మాత్రమే సోలోగా 100 కోట్ల క్లబ్ లో చేరారు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఆ లిస్టులో చేరిపోవడంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read Also: నాకు జెండాలు, ఎజెండాలు లేవు - అమిత్ షా పిలిస్తే అందుకే వెళ్ళలేదు: హీరో నిఖిల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)