SAG Strike: రోడ్డెక్కిన హాలీవుడ్ స్టార్స్, త్వరలో షూటింగ్స్ బంద్! 61 ఏళ్ల హిస్టరీ రిపీట్? ఇంతకీ, వారికొచ్చిన కష్టాలేమిటీ?
గత కొన్ని రోజులుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా చేస్తున్న సమ్మెలో హాలీవుడ్ నటీనటులు సైతం పాల్గొంటున్నారు. స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం అవ్వడంతో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సామూహిక సమ్మెకు సిద్ధమైంది.
హాలీవుడ్ లో రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. తాము రాసే టీవీ షోలు, ఓటీటీ సిరీసుల నుంచి మంచి లాభాలు ఆర్జించే నిర్మాణ సంస్థలు.. తమకు కనీస వేతనం ఇవ్వట్లేదని ఆరోపిసస్తూ రైటర్స్ గిల్డ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హాలీవుడ్ లో ఏ ఒక్క రైటర్ కూడా పని చెయ్యట్లేదు. వీరి సమ్మెకు కొన్ని యూనియన్లు, పలువురు ప్రముఖులు మద్దతు పలికాయి. అయితే ఇప్పుడు హాలీవుడ్ నటీనటులు సైతం రైటర్ స్ట్రైక్ లో చేరాలని నిర్ణయించున్నారు.
రైటర్ స్ట్రైక్ కు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ (SAG-AFTRA) తమ మద్దతు ప్రకటించింది. స్ట్రీమింగ్ దిగ్గజాలు మంచి వేతనాలు ఇవ్వాలని, మెరుగైన వర్క్ కండిషన్స్ కు అంగీకరించాలని స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కోరుకుంది. అయితే ప్రధాన స్టూడియోలతో చర్చలు విఫలం అవ్వడంతో, నటీనటులు ఈ నిరసనలలో పాల్గొనడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. దాదాపు 160,000 మంది ప్రదర్శకులు పనులు ఆపేస్తారని నివేదికలు పేర్కొన్నాయి. దీంతో సినీ ఇండస్ట్రీలో గత 63 ఏళ్లలో అతిపెద్ద షట్ డౌన్ ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
హలీవుడ్ లో A-లిస్ట్ యాక్టర్స్ తో సహా 160,000 మంది ప్రదర్శనకారులకు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్-అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ (SAG-AFTRA) ప్రాతినిధ్యం వహిస్తోంది. బుధవారం ప్రధాన స్టూడియోలతో ఒక ఒప్పందానికి రాలేకపోయినట్లు గిల్డ్ ప్రకటించింది. జీతాలు పెంచడం, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో ముప్పుపై వారి డిమాండ్లపై ఒప్పందం లేకుండానే ఈ చర్చలు ముగిశాయని తెలియజేసింది.
ఈ క్రమంలో సామూహిక సమ్మెకు చర్చల కమిటీ గురువారం ఉదయం ఏకగ్రీవంగా ఓటు వేసింది. హలీవుడ్ లో ఇది డబుల్ స్ట్రైక్ కు దారి తీసింది. ప్రస్తుతం కొనసాగుతున్న టెలివిజన్, ఫిల్మ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. 1960 తర్వాత ఇది మొదటి హాలీవుడ్ షట్ డౌన్ ను ప్రేరేపిస్తుంది. అందుకే యాక్టర్స్ గిల్డ్ నిర్ణయాన్ని స్టూడియోలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ (AMPTP) తప్పుబట్టింది.
"టీవీ కార్యక్రమాలు, చలన చిత్రాలకు జీవం పోసే ప్రదర్శకులు లేకుండా స్టూడియోలు పనిచేయలేవు కాబట్టి సమ్మె అనేది ఖచ్చితంగా మేము ఆశించిన ఫలితం కాదు" అని అలయన్స్ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్స్ పేర్కొంది. పరిశ్రమపై ఆధారపడిన వేల మంది ప్రజలకు ఆర్థిక ఇబ్బందులకు దారితీసే మార్గాన్ని యూనియన్ విచారకరంగా ఎంచుకుందని తమ ప్రకటనలో రాసుకొచ్చింది.
ఇకపోతే స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ సమ్మె గురువారం అర్ధరాత్రి ప్రారంభమమైంది. సమ్మె స్టార్ట్ అవడంతో లండన్ లో క్రిస్టోఫర్ నోలన్ 'ఓపెన్ హైమర్' ప్రీమియర్ నుండి రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫీ, మాట్ డామన్, ఎమిలీ బ్లంట్ వంటి స్టార్స్ తో సహా పలువురు నటీనటులు నిష్క్రమించారని హలీవుడ్ మీడియా తెలిపింది. పారామౌంట్, వార్నర్ బ్రదర్స్ , డిస్నీకి ముందు, అలానే కాలిఫోర్నియా నెట్ ఫ్లిక్స్ ప్రధాన కార్యాలయం వెలుపల శుక్రవారం ఉదయం పికెటింగ్ ప్రారంభమవుతుందని పేర్కొన్నాయి.
రిపోర్టుల ప్రకారం, హాలీవుడ్ రచయితలు , నటీనటుల డబుల్ స్ట్రైక్ యావత్ సినీ పరిశ్రమను స్తంభింపజేస్తుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఎన్నో టీవీ షోలు, వెబ్ సిరీసులు ఆలస్యం అవుతాయి. సమ్మె ఇలా కొనసాగితే, భవిష్యత్తులో బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా వాయిదా వేయబడతాయి. అంతేకాదు సెప్టెంబర్ 18న జరగనున్న ఎమ్మీ అవార్డ్స్, టెలివిజన్ వెర్షన్ ఆస్కార్ అవార్డులు కూడా నవంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశం ఉంది.
హలీవుడ్ లో మొదటిసారి 1960లో నటుడు రోనాల్డ్ రీగన్ నేతృత్వంలో రెండు యూనియన్లు డబుల్ స్ట్రైక్ చేశాయి. అలానే 1980లో స్క్రీన్ యాక్టర్స్ సమ్మె జరిగింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు రైటర్స్ గిల్డ్ , స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ కలసి డబుల్ స్ట్రైక్ చేస్తుండటం గమనార్హం.
Also Read: ‘ఫ్యామిలీ’ లెక్క - విజయ్, రష్మికల రిలేషన్‌పై స్పందించిన ఆనంద్ దేవరకొండ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial