(Source: ECI/ABP News/ABP Majha)
Sabari: వరలక్ష్మికి చెప్పాల్సిన పని లేదు... ఆవిడ ఎంపిక, 'శబరి' టైటిల్ వెనుక రీజన్స్ చెప్పిన డైరెక్టర్ అనిల్ కాట్జ్
Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'శబరి'తో అనిల్ కాట్జ్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. మే 3న మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ...
వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar)కి సన్నివేశం వివరించిన తర్వాత కెమెరా యాంగిల్స్, షాట్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదని... దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం ఉండటంతో అద్భుతంగా చేసుకుంటూ వెళతారని దర్శకుడు అనిల్ కుమార్ కాట్జ్ (Anil Kumar Katz) చెప్పారు. ఆవిడ ఉంటే సెట్‌లో కో డైరెక్టర్ ఉన్నట్టేనని తెలిపారు. వరలక్ష్మితో పని చెయ్యడం సంతోషంగా ఉందని అనిల్ అన్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో అనిల్ కాట్జ్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'శబరి' (Sabari Movie). శశాంక్, గణేష్ వెంకట్రామన్, మైమ్ గోపి, బేబీ నివేక్ష ఇతర ప్రధాన తారాగణం. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించిన చిత్రమిది. మే 3న పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కాట్జ్ చెప్పిన విశేషాలు...
ప్రాణానికి మించిన ప్రేమ... ప్రాణం తీసేంత ద్వేషం!
నాలుగైదేళ్ల క్రితమే తన మదిలో 'శబరి' చిత్రకథకు పునాది పడిందని దర్శకుడు అనిల్ కాట్జ్ చెప్పారు. ''మనం ఎవరినైనా ప్రాణానికి మించి ప్రేమిస్తే... ఆ ప్రేమ ప్రాణం తీసేంత ద్వేషంగా మారుతుందనేది కథకు బీజం. స్వచ్ఛమైన ప్రేమ అంటే నాకు తల్లి ప్రేమ గుర్తుకు వచ్చింది. సృష్టిలో మారుతున్న సమాజంలో అన్నీ మారుతూ వచ్చాయి... ఒక్క తల్లి ప్రేమ తప్ప! అందుకని తల్లి ప్రేమ నేపథ్యంలో 'శబరి' కథ, నేను చెప్పాలనుకున్న పాయింట్ రాసుకున్నా'' అని అనిల్ కాట్జ్ వివరించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గరకు ఎందుకు వెళ్లానంటే...
మహిళా ప్రాధాన్య చిత్రాలు చేయగల నటీమణులు మన దేశంలో చాలా తక్కువ మంది ఉన్నారని, ఆ కొందరిలో తాను రాసుకున్న 'శబరి' పాత్రకు న్యాయం చేసే సత్తా వరలక్ష్మిలో కనిపించిందని, అందుకని ఆవిడను సంప్రదించానని అనిల్ కాట్జ్ తెలిపారు. వరలక్ష్మి గురించి ఇంకా ఆయన మాట్లాడుతూ... ''హీరోయిన్లు ఎవరైనా సరే ఒక్కసారి హీరోయిన్ జోన్ నుంచి బయటకు వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయడానికి ఒప్పుకోరు. కానీ, వరలక్ష్మి గారు అలా కాదు. కథానాయికగా చేశారు. 'సర్కార్', 'విక్రమ్ వేద', 'పందెం కోడి 2' వంటి సినిమాల్లో నటిగా మెప్పించారు. ఆమె నటనతో పాటు వ్యక్తిత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను వరలక్ష్మి గారి ఇంటర్వ్యూలు చూశా. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. నేను రాసిన కథలో విషయాల్ని నమ్ముతారని అనిపించింది. ఆర్టిస్ట్ నమ్మినప్పుడు స్క్రీన్ మీద నటన మరింత బావుంటుంది. ఆ స్వార్థంతో ఆమెను సంప్రదించాను. ఒక్కసారి కథ విని ఓకే చేశారు'' అని చెప్పారు.
Also Read: రణవీర్ సింగ్‌ను రాక్షసుడిగా చూపించనున్న 'హనుమాన్' ప్రశాంత్ వర్మ?
హీరోయిన్ పేరు శబరి కాదు... మరి ఆ టైటిల్ ఎందుకు?
'శబరి' ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో వరలక్ష్మి పేరు శబరి కాదు. మరి, ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? అని ప్రశ్నిస్తే... ''రాముడు తన సొంత కొడుకు కాకపోయినా ఆయన కోసం శబరి వేచి చూస్తుంది. ఫలాలను అందించేటప్పుడు ఆ రామచంద్రునికి ఏమైనా అవుతుందేమోనని ముందు కొరికి చూస్తుంది. ప్రమాదం లేదని నిర్ధారించుకున్నాక ఇస్తుంది. నా కథలో ప్రధాన పాత్రధారిలో కుమార్తెపై ఆ ప్రేమ ఉంది. సంస్కృతంలో శబరి అంటే ఆడపులి. కుమార్తె కోసం పులిలా పోరాటం చేసే గుణం వరలక్ష్మి పాత్రలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శబరి నది ఉంది. శబరిమల తెలియనివారు ఉండరు. అందుకే ఆ టైటిల్ పెట్టాను'' అని అనిల్ సమాధానం ఇచ్చారు.
నిర్మాత వచ్చాక పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారింది!
వరలక్ష్మికి తాను కథ చెప్పినప్పుడు తెలుగులో సినిమా తీయాలని అనుకున్నానని, తమిళంలోనూ విడుదల చేస్తే బావుంటుందని భావించినట్టు అనిల్ కాట్జ్ చెప్పారు. అయితే, నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల వచ్చిన తర్వాత ఇది పాన్ ఇండియా ప్రాజెక్టుగా మారిందని వివరించారు. ''కథకు సూటయ్యే నాకు నచ్చిన ఆర్టిస్ట్ ఓకే చెప్పారు. ఆ ఆర్టిస్టుకు తగ్గ ప్రొడక్షన్ హౌస్ దొరకడానికి టైమ్ పట్టింది. వరలక్ష్మి గారు ఓకే చేయడం ఒక కారణమైతే... కథ నచ్చడంతో మహేంద్రనాథ్ గారు ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. బడ్జెట్ ఎక్కువైనా క్వాలిటీ మూవీ ప్రేక్షకులకు ఇవ్వాలని సపోర్ట్ అందించారు. కథలో యూనివర్సల్ అప్పీల్ ఉందని పాన్ ఇండియా సినిమాగా చేశారు'' అని చెప్పారు.
'శబరి' థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ... ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని, కథలో పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం చేసినప్పుడు ఆ థ్రిల్లింత కలుగుతుందని, ఆ విధమైన కథ, కథనాలతో పాటు భావోద్వేగాలున్న ఈ మూవీ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు.
Also Read: ఎన్టీఆర్‌ను చుట్టుముట్టిన ముంబై మీడియా... బాలీవుడ్ స్టార్లతో యంగ్ టైగర్ పార్టీ