(Source: ECI/ABP News/ABP Majha)
Konda Pre Release Event: 'కొండా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్లాప్ కావాలనే రేవంత్ రెడ్డి అరెస్ట్, ఇది మంత్రి దయాకర్ రావు విఫల యత్నం - సురేఖ ఫైర్
'కొండా' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్లాప్ కావాలనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని, మంత్రి దయాకర్ రావువిఫల యత్నాలు చేస్తున్నారని సురేఖ అన్నారు.
ఘట్‌కేసర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఆయన అనుచరులకు, పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. తన నియోకవర్గంలో ఉండగా పోలీసులు ఎలా అరెస్ట్ చేస్తారని రేవంత్ రెడ్డి నిలదీశారు. తాజాగా ఆయనను అరెస్ట్ చేయడంపై కొండా సురేఖ స్పందించారు.
వరంగల్‌లో తమ 'కొండా' ప్రీ రిలీజ్ ఫంక్షన్ సినిమా ఫ్లాప్ కావాలని రేవంత్ రెడ్డిని మంత్రి దయాకర్ రావు అరెస్ట్ చేయించారని కొండా సురేఖ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఆందోళనలు, అల్లర్లలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమ సంస్కారాలకు రేవంత్ రెడ్డి బయలుదేరడంతో ఆయన అరెస్ట్ చేసుకుందనేది అధికార వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అది పక్కన పెట్టి కొండా సురేఖ ఏమన్నారనేది ఒక్కసారి చూస్తే...
కొండా సురేఖ మాట్లాడుతూ ''తెలంగాణ ప్రజలు అందరికీ నమస్కారం. ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు వరంగల్‌లో 'కొండా' ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం సక్సెస్ కాకూడదని, ప్లాప్ చేయాలని గత వారం రోజులుగా పోలీసులు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ సంబంధించిన మంత్రి దయాకర్ రావు గారు విఫల ప్రయత్నం చేస్తున్నారు. మాకు వరంగల్ కోట దగ్గర అనుమతి ఇవ్వకుండా... ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించుకోమని చెప్పారు. సరేనని అక్కడ ఏర్పాటు చేసుకుంటే... టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరు కాకుండా ఘట్ కేసర్ పోలీసులు ఎటువంటి కారణం లేకుండా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిని ప్రజలంతా గమనించాలి. 'కొండా' ప్రీ రిలీజ్ వేడుకను పెద్ద హిట్ చేయాలి'' అని అన్నారు.
Also Read: 'పక్కా కమర్షియల్'లో రాశీ ఖన్నా రోల్ ఇదే - పక్కా హిలేరియస్ అన్నమాట
View this post on Instagram
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమే 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్ అలియాస్ ఆదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ పతాకంపై కొండా సుష్మితా పటేల్ నిర్మించారు. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ - 'సైన్యం' ఆగింది