శ్రీనగర్‌కు రామ్ చరణ్ - షూటింగ్‌కు కాదు, జీ 20 సదస్సుకు!
2019తర్వాత తొలిసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 సదస్సుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. ఇప్పటికే శ్రీనగర్‌కు చేరుకున్న ఆయన పలువురు అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ కానున్నారు.
Ram Charan : జమ్ము కశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొననున్నారు. అందుకోసం ఇప్పటికే ఆయన శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సమ్మిట్ కు హాజరైన అనంతరం టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో ఆయన అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ అవుతారు. కాగా వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు, ప్రముఖులు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు. మన దేశంలో టూరిజం పరంగా ముఖ్యమైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సినిమా షూటింగ్ ల కోసం సింగిల్ విండోను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఇదిలా ఉండగా ఈ సదస్సుకు ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
కట్టుదిట్టమైన సాయుధ దళాల సెక్యూరిటీ మధ్య జీ 20 సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు G20 సభ్య దేశాల నుంచి 60 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ సదస్సుకు మెగా హీరో రామ్ చరణ్ కూడా హాజరు కానుండడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఆయనకు దక్కిన ఈ అరుదైన గౌరవాన్ని కొనియాడుతున్నారు.
కశ్మీర్ అందాలను వీక్షించనున్న అతిథులు
ఇదిలా ఉండగా.. జీ 20 సదస్సుకు ఇప్పటికే ఫిల్మ్ టూరిజం పాలసీపై జరిగే చర్చలో ధర్మ, నెట్‌ఫ్లిక్స్, ఫిక్కీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశానికి అత్యధిక సంఖ్యలో విచ్చేసిన ప్రతినిధులు సింగపూర్ నుంచి వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. సమ్మిట్ చివరి రోజున ప్రతినిధులంతా శ్రీనగర్ లోని వివిధ ప్రాంతాలను కూడా సందర్శిస్తారు. ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం , ఫిల్మ్ టూరిజం పాలసీ అవకాశాలపై ప్రత్యేక సెషన్‌లు కూడా జరగనున్నాయి. మూడు రోజుల పాటు సాగనున్న ఈ సదస్సులో చివరి రోజున అతిథులందరూ పోలో వ్యూ, జీలం రివర్ ఫ్రంట్ , శ్రీనగర్ నగర్ లోని ఇతర ప్రదేశాలను కూడా సందర్శించనున్నారు.
ఇదే తొలిసారి..
మరో ముఖ్య విషయమేమిటంటే.. 2019వ సంవత్సరం ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసి, రాష్ట్ర హోదాను తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ప్రాంతంలో అంతర్జాతీయ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి కావడం చెప్పుకోదగిన విషయం. పాకిస్థాన్ ఈ సదస్సును బహిష్కరిస్తున్నట్లు అంతర్జాతీయంగా ప్రచారం చేసినప్పటికీ అనేక దేశాల ప్రతినిధులు మాత్రం ఈ మూడు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. అయితే చైనా, టర్కీ , సౌదీ అరేబియా దేశాలు మాత్రమే ఈ సదస్సుకు దూరంగా ఉన్నాయి.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లోనూ రామ్ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నుంచే నేర్చుకున్నానని, ఆయన కలను సజీవంగా ఉంచేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని రామ్ చరణ్ పిలుపునిచ్చారు.
Read Also : 'ఇండియన్ ఐడల్ సీజన్ - 2'కు ఐకానిక్ గెస్ట్ జడ్జ్