Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్
జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించారు.
స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్, ప్రముఖ నటుడు రాజు శ్రీవాత్సవ (Raju Srivastava) కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ రోజు (బుధవారం) ఉదయం న్యూ ఢిల్లీలోని ఒక జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.
''వర్కవుట్స్ చేస్తున్న సమయంలో రాజు గారికి మైల్డ్ ఎటాక్ వచ్చింది. ఆయన్ను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించాం. ఆయన ఆరోగ్యం బానే ఉంది. స్పృహలో ఉన్నారు'' అని రాజు శ్రీవాత్సవ బృందంలోని సభ్యులు హిందీ మీడియాకు తెలిపారు.
ఆగస్టు 1వ తేదీ నుంచి సౌత్ ఢిల్లీలో రాజు శ్రీవాత్సవ ఉంటున్నారని ఆయన టీమ్ మెంబర్స్ తెలిపారు. ఆయన జూలై 29న ముంబై నుంచి ఉదయ్ పూర్ వెళ్ళారు. అక్కడ జూలై 30న ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఢిల్లీలోని బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌ను కలవడానికి వెళ్ళారు. సౌత్ ఢిల్లీలోని కల్ట్ జిమ్‌లో థ్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారి కుప్పకూలిపోయారట. దాంతో వెంటనే ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ సభ్యులు తెలిపారు.
రాజు శ్రీవాత్సవ వయసు 59 సంవత్సరాలు. గతంలో ఒకసారి హృద్రోగ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయనకు స్టెంట్ వేశారట. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ... వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆయన కండిషన్ అబ్జర్వ్ చేసి, ఆపరేషన్ చేయాలా? వద్దా? అనేది వైద్యులు నిర్ణయిస్తారని 'ఏపీబీ న్యూస్'తో రాజు శ్రీవాత్సవ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రాజు శ్రీవాత్సవ కోలుకుంటున్నారని, అవుటాఫ్ డేంజర్ అని కమెడియన్ సునీల్ పాల్ తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు భావంతుడిని ప్రార్థిస్తున్నారు.
రాజు శ్రీవాత్సవ అంటే... ప్రేక్షకులకు స్టాండప్ కామెడీ షోస్ ఎక్కువ గుర్తుకు వస్తాయి. టైమింగ్‌తో ఆయన వేసే జోక్స్, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అటువంటి సందర్భాలు ఉన్నాయని కనెక్ట్ అయ్యేలా ఆయన చేసే కామెడీకి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. స్టాండప్ కామెడీ టాలెంట్ హంట్ షో 'ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్'తో రాజు శ్రీవాత్సవ వెలుగులోకి వచ్చారు.
Also Read : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
హిందీ సినిమాల్లో కూడా రాజు శ్రీవాత్సవ నటించారు. హృతిక్ రోషన్, కరీనా కపూర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ నటించిన 'మై ప్రేమ్ కి దివాన్ హూ'తో సహా కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించారు. సినిమాల కంటే స్టాండప్ కామెడీ షోస్ ఆయనకు ఎక్కువ గుర్తింపు తెచ్చాయి. ఇటీవల వరుసగా సినీ ప్రముఖులకు హార్ట్ ఎటాక్ రావడంతో పరిశ్రమలోని పలువురు ఈ విషయమై చర్చించుకుంటున్నారు. ఆరోగ్యం మీద మరింత శ్రద్ధ వహించాలని అనుకుంటున్నారు.