Leo : ‘లియో’ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనా! - క్లారిటీ ఇచ్చిన నిర్మాత
విజయ్ హీరోగా నటించిన ‘లియో’ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మామూలుగా స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ ప్రారంభమయై, విడుదలయ్యేసరికి కనీసం సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది. కానీ విజయ్ మాత్రం ‘లియో’తో ఈ మాటను రివర్స్ చేశాడు. జనవరిలో లోకేశ్ కనకరాజ్‌తో కలిసి విజయ్ సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్‌మెంట్ వచ్చింది. ఆ తర్వాత రోజే సినిమా టైటిల్ ‘లియో’ అని ప్రకటించారు. వెంటనే షూటింగ్ ప్రారంభమైందని, ఆ తర్వాత మొదటి షెడ్యూల్ పూర్తైందని.. ఇలా బ్రేక్ లేకుండా షూట్ చేస్తూ.. ‘లియో’ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే ఉంది మూవీ టీమ్. ఇక ఈ సినిమా గురించి ప్రేక్షకుల్లో ఉన్న కొన్ని సందేహాలపై నిర్మాత క్లారిటీ ఇచ్చాడు. అంతే కాకుండా ‘లియో’ అనేది లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా? కాదా? అనే విషయాన్ని కూడా బయటపెట్టాడు.
‘మాస్టర్’ తర్వాత ‘లియో’తో..
అక్టోబర్ 19న భారీ స్థాయిలో విడుదలకు ‘లియో’ సిద్ధమవుతోంది. ఇక అక్టోబర్ 5న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను మరింత పెంచేసింది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మించింది. ఇక దీని నిర్మాత ఎస్ఎస్ లలిత్ కుమార్.. ట్రైలర్ లాంచ్ తర్వాత ట్విటర్ ద్వారా విజయ్ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యారు. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. లోకేశ్ కనకరాజ్, విజయ్ కలిసి ఇప్పటికే ‘మాస్టర్’ అనే సినిమాకు పనిచేశారు. 2021లో విడుదలైన ఈ సినిమా.. మిక్స్‌డ్ టాక్ అందుకుంది కానీ కలెక్షన్స్ విషయంలో మాత్రం బ్లాక్‌బస్టర్‌ను అందుకుంది.
ఓటీటీ రైట్స్ రూ.120 కోట్లు..
‘లియో’ చిత్రం హిందీ ల్యాంగ్వేజీలో మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయమని నిర్మాత లలిత్ కుమార్ తెలిపారు. అంటే పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి వాటిలో ‘లియో’ హిందీ వెర్షన్ విడుదల కాదట. ఎందుకంటే హిందీలో ఒక సినిమా థియేటర్‌లలో విడుదలైతే.. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో విడుదల అయ్యేందుకు అనుమతి ఉంటుంది. కానీ సౌత్‌లో మాత్రం ఒక సినిమా థియేటర్‌లలో విడుదలై నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే ‘లియో’ హిందీ వర్షన్ ఓటీటీ రిలీజ్‌కు ఆలస్యమవుతుందని మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని లలిత్ కుమార్ స్పష్టం చేశారు. కానీ నార్త్ ఇండియాలో దాదాపు 2000 సింగిల్ స్క్రీన్స్‌లో ‘లియో’ హిందీ వర్షన్ విడుదల కానుందట. అంతే కాకుండా ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను రూ.120 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.
కావాలనే సీక్రెట్‌గా..
ఇక ‘లియో’ సినిమా ప్రారంభమయినప్పటి నుంచి ‘ఖైదీ’, ‘విక్రమ్’ చిత్రాలలాగా ఇది కూడా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమేనా అని తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విషయాన్ని నిర్మాత లలిత్‌ను అడిగారు. ‘ఆ విషయాన్ని పెద్ద స్క్రీన్‌పై చూసే తెలుసుకోవాలి. మేకర్స్ కావాలనే ఆ విషయాన్ని సీక్రెట్‌గా పెట్టారు.’ అన్నాడు లలిత్. ఇక విజయ్ కెరీర్‌లో 67వ చిత్రంగా తెరకెక్కిన ‘లియో’ కోసం చాలాకాలం తర్వాత త్రిషతో జతకట్టాడు ఈ హీరో. వీరితో పాటు సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్, మిస్కిన్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం ‘లియో’కు హైలెట్‌గా నిలవనుందని నిర్మాత తెలిపారు.
Also Read: టాలీవుడ్ హీరో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ
Join Us on Telegram: https://t.me/abpdesamofficial