Prasanth Varma: చిరంజీవి మెసేజ్‌ను చూసుకోలేదు, బాలయ్య తిడుతూ ఉండేవారు - ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’కు ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. మూవీ చూసిన తర్వాత చిరు, బాలయ్య రియాక్షన్ గురించి బయటపెట్టాడు దర్శకుడు.
Prasanth Varma: ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘హనుమాన్’ మూవీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో హౌజ్‌ఫుల్ షోలతో రన్ అవుతోంది. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ మూవీతో ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఈ సినిమా విడుదల అవ్వకముందు చాలామంది ప్రశాంత్ కాన్ఫిడెన్స్‌ను చూసి ట్రోల్ చేశారు. చాలావరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ పెయిడ్ ప్రీమియర్స్ నుండే ‘హనుమాన్’కు సూపర్ హిట్ టాక్ రావడంతో ఒకసారి మూవీ ఎలా ఉందో చూడాలని ఆసక్తి అందరిలో మొదలయ్యింది. ఇక సినిమా చూసిన తర్వాత రవితేజ, చిరంజీవి, బాలకృష్ణలాంటి స్టార్ హీరోలు ఎలా రియాక్ట్ అయ్యారో ప్రశాంత్ వర్మ బయటపెట్టాడు.
గట్టిగా హగ్ చేసుకున్నారు..
ప్రేక్షకులను మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలను సైతం ‘హనుమాన్’ మూవీ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మాస్ మహారాజ్ రవితేజ అయితే సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్లస్ అయ్యారు. రవితేజ ఇచ్చిన వాయిస్ ఓవర్ ‘హనుమాన్’ చూసినవారిని విపరీతంగా ఆకట్టుకుంది. దీనిపై ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘‘దాదాపు మూడు సంవత్సరాల ముందే నేనొక సినిమా చేస్తున్నాను, మీరు దానికి వాయిస్ ఇవ్వాలి అని రవితేజకు చెప్పాను. ఇక రిలీజ్‌కు ఒక్క నెల ముందు అందరి డబ్బింగ్స్ అయిపోయాయి. ఒక్క క్యారెక్టర్‌కే డబ్బింగ్ ఉంది అని ఆయనను మళ్లీ అప్రోచ్ అయ్యాను. ఆయన చేసిన ‘ఈగల్’ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఉన్నా కూడా ఇచ్చిన మాట మీద నిలబడి వెంటనే రమ్మని డబ్బింగ్ చెప్పేశారు’’ అని రవితేజ గురించి చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ఆయనకు కూడా సినిమా బాగా నచ్చిందని హగ్ చేసుకొని ప్రశంసించాడని తెలిపాడు.
ప్రతీది వివరంగా రాశారు..
‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి మూవీకి తన సపోర్ట్‌ను అందిస్తున్నట్టు తెలిపారు. దానిపై కూడా ప్రశాంత్ వర్మ స్పందించాడు. ‘‘చిరంజీవి నెంబర్ నా దగ్గర లేదు. నాకు చాలా పెద్ద మెసేజ్ రాసి పెట్టారు. అది నేను ముందుగా చూసుకోలేదు. సినిమా రిలీజ్ తర్వాత వందల మెసేజ్‌లు వచ్చాయి. అలా ఒక్కొక్కరికీ రిప్లై ఇస్తూ వస్తున్నప్పుడు ఆయన పంపిన మెసేజ్ చూశాను. ఎవరు ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు.. ఫ్యాన్ ఏమో అనుకుంటూ స్క్రోల్ చేసుకుంటూ చూస్తుండగా చివర్లో చిరంజీవి అని ఉంది. దాదాపు ఒక్కరోజు తర్వాత చూశాను. థాంక్యూ అని రిప్లై ఇచ్చాను. మెసేజ్‌లో సినిమా గురించి చాలా వివరంగా పొగిడారు’’ అని చెప్పాడు ప్రశాంత్ వర్మ.
హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ..
చిరంజీవి తర్వాత ‘హనుమాన్’ చూసిన బాలకృష్ణ రియాక్షన్ గురించి చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ‘‘ఆయన సినిమా జరుగుతున్న టైమ్‌లో ఇంకా ఎన్నిరోజులు తీస్తావు అని తిడుతూ ఉండేవారు. ‘అన్‌స్టాపబుల్’ ఫస్ట్ ప్రోమో తీస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగితే హనుమాన్ సినిమా చేస్తున్నానని చెప్పాను. సెకండ్ ప్రోమో అప్పుడు అడిగారు అదే చెప్పాను. భగవంత్ కేసరి షూటింగ్ అప్పుడు ఏం చేస్తున్నావు, అయిపోయిందా అని అడిగారు. లేదు, ఇంకా హనుమాన్ జరుగుతుంది అనేవాడిని. ఇన్నిరోజులు చేస్తున్నావేంటి, త్వరగా ఫినిష్ చేయి మనం ఏదో ఒకటి చేయాలి కదా అనేవారు. ఆయన ఫైనల్‌గా సినిమా చూసి ఇప్పుడు అర్థమయ్యింది. ఇన్నిరోజులు ఎందుకు పట్టిందో, చాలా బాగుంది, హాలీవుడ్ లెవెల్ క్వాలిటీ కనిపించింది అన్నారు’’ అని సంతోషంగా బాలయ్య ఇచ్చిన ప్రశంసలను గుర్తుచేసుకున్నాడు.
Also Read: ‘అయాలన్’ ఓటీటీ రిలీజ్‌పై కీలక అప్డేట్ - ఎప్పుడు, ఎక్కడంటే?