HanuMan: ఫిమేల్ సూపర్ హీరో కూడా ఉంటుంది, ఇది ఇండియాలో జరిగే కథ కాదు - ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
Prasanth Varma: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు దర్శకుడు.
Teja Sajja : 2024 సంక్రాంతికి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘గుంటూరు కారం’లాంటి భారీ స్కేల్ చిత్రాలు ఉండగా.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’లాంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పెద్ద స్టార్లు, భారీ బడ్జెట్ చిత్రాలతో పోటీపడి గెలుస్తామని ప్రశాంత్ వర్మ గట్టి నమ్మకంతో ఉన్నాడు. అంతే కాకుండా తన సినిమాలతో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను ఫార్మ్ చేస్తానని ప్రశాంత్ ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా దాని గురించి మరొక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అంతే కాకుండా తన డైరెక్షన్‌ను మలచుకోవడానికి రాజమౌళి ఇచ్చిన సలహాలు, సూచనలు ఎంతో సహాయపడ్డాయని గుర్తుచేసుకున్నాడు.
రాజమౌళినే ఫాలో అయ్యాను..
‘‘మేము చాలా తక్కువ బడ్జెట్‌తో పనిచేశాం. పెద్ద పెద్ద స్టూడియోలను ఉపయోగించేంత బడ్జెట్ మా దగ్గర లేదు. రాజమౌళి సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ స్టూడియోస్‌తో, టెక్నికల్ వ్యక్తులతో పనిచేశాం. రాజమౌళి వారితో ఎలా కూర్చొని మాట్లాడేవారో.. డెవలప్మెంట్స్‌ను ఎలా దగ్గరుండి చూసుకునేవారో.. చివరి నిమిషంలో మార్పులు చేర్పుల కోసం ఎలా తమ చేతిలో నుంచి మౌజ్ తీసుకునేవారో వారు చెప్తుండేవారు. నేను కూడా అదే పద్ధతిని ఫాలో అయిపోయాను. ఉదాహరణకు చెప్పాలంటే మనం విజువల్‌ను ఎలా ఉండాలని కోరుకుంటున్నామో ఒకరికి వివరించడంకంటే మనమే మార్పులు చేయడం మరింత సులభంగా ఉంటుంది’’ అని ‘హనుమాన్’ విజువల్స్ కోసం మేకర్స్ పడిన కష్టం గురించి బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.
ఫ్రెంచ్ భాషలో కూడా..
రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను టెక్నికల్ పరంగా ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోయారని ప్రశాంత్మ వర్మ ప్రశంసించాడు. అంతే కాకుండా ‘హనుమాన్’ను ముందుగా కేవలం తెలుగులోనే విడుదల చేయాలనుకున్నా.. ఇప్పుడు ప్లాన్స్ అన్నీ మారిపోయాయని, మొత్తంగా 11 భాషల్లో ఈ మూవీ విడుదల కానుందని బయటపెట్టాడు. అయితే అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటే గందరగోళంగా ఉంటుందని, ముందుగా తెలుగులో విడుదలయిన తర్వాత వేరే భాషల గురించి ఆలోచించమని రాజమౌళి సలహా ఇచ్చారని అన్నాడు. అందుకే ముందుగా తెలుగులో విడుదల చేసి.. ఆ తర్వాత ఫ్రెంచ్ లాంటి ఫారిన్ భాషల్లో ‘హనుమాన్’ విడుదల కానుందని తెలిపాడు. ముందుగా ‘హనుమాన్’ కథ అనేది ప్రశాంత్ వర్మ ఆలోచనల నుండే పుట్టినా.. దానిని ‘స్క్రిప్ట్స్‌విల్లే’ అనే రైటింగ్ టీమ్‌తో కలిసి డెవలప్ చేశారట. ఈ రైటింగ్ టీమ్‌ను ప్రశాంత్ వర్మ, తన సోదరి స్నేహతో కలిసి స్థాపించాడు.
అది వేరే ప్రపంచం..
‘హనుమాన్’ సినిమా భారతదేశంలో జరగదని, దానికోసం అఖండ భారతం అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించామని ప్రశాంత్ తెలిపాడు. ‘‘మొఘలులు, బ్రిటిష్ పాలన లేని ఇండియాను ఊహించుకోవాలనుకున్నాను. అఖండ భారతం అనేది ఒక ప్యారలెల్ ప్రపంచంలాంటిది. అక్కడ కూడా మనలాంటి మనుషులే ఉంటారు. అక్కడ బాహుబాలిలాంటి సినిమాలు కూడా విడుదలవుతాయి. కానీ ముంబాయ్‌లాంటి సిటీ మాత్రం ఉండదు’’ అని ప్రశాంత్ స్పష్టం చేశాడు. అయితే ఎలాగో అఖండ భారతం అనే ఒక ప్యారెలల్ ప్రపంచాన్ని సృష్టించాడు కాబట్టి.. తన తరువాతి సూపర్ హీరో సినిమాలు కూడా ఈ ప్రపంచంలోనే జరుగుతాయని ప్రశాంత్ తెలిపాడు. ‘‘ఈ యూనివర్స్‌లోనే అన్ని సూపర్ హీరో సినిమాలను నేనే డైరెక్ట్ చేయను ఎందుకంటే నేను వేరే జోనర్లలో కూడా ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికీ అన్ని సూపర్ హీరోల సినిమాలకు సంబంధించిన బ్లూ ప్రింట్ రెడీ అయ్యింది. హనుమాన్ విడుదల అవ్వగానే వాటిపైన దృష్టిపెడతాం’’ అన్నాడు ప్రశాంత్. ఇక ఈ సూపర్ హీరో సినిమాల్లో ఒక ఫీమేల్ సూపర్ హీరో సినిమా కూడా ఉంటుందని ప్రశాంత్ రివీల్ చేశాడు.
Also Read: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ