Pragya Jaiswal: నా బర్త్‌డే ప్రతి ఏడాది వస్తుంది... కానీ ఈసారి బాలయ్యతో సినిమా వస్తోంది - ప్రగ్యా జైస్వాల్ ఇంటర్వ్యూ
Pragya Jaiswal Interview: ‘అఖండ’తో ఘన విజయం అందుకుని మరోసారి బాలయ్య సినిమాలో అవకాశం పొందిన ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య సినిమా అంటేనే సెలబ్రేషన్ అంటోంది. ప్రగ్యా చెప్పిన డాకు మహారాజ్ ముచ్చట్లివే..
Pragya Jaiswal interview About Daaku Maharaaj: నందమూరి నటసింహం బాలయ్యతో వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. ‘అఖండ’ సినిమాలో బాలయ్య సరసన నటించిన ప్రగ్యా.. ఇప్పుడు సంక్రాంతికి రాబోతోన్న ‘డాకు మహారాజ్’లోనూ హీరోయిన్‌గా నటించింది. అలాగే ‘డాకు మహారాజ్’ తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ‘అఖండ 2’ సినిమాలోనూ అవకాశం పొంది.. నందమూరి హీరోయిన్‌గా పేరు వేయించుకుంటుందీ భామ. అయితే ఇప్పుడు రాబోతోన్న ‘డాకు మహారాజ్’ తనకి ఎంతో ప్రత్యేకం కూడా. ఎందుకంటే, కరెక్ట్‌గా ఆమె పుట్టినరోజు (జనవరి 12)నే ఈ సినిమా థియేటర్లలోకి దిగుతోంది. దీంతో ఈ సినిమా నాకెంతో స్పెషల్ అని చెబుతోంది ప్రగ్యా. తాజాగా ఆమె ‘డాకు మహారాజ్’ ముచ్చట్లను మీడియాతో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ..
‘‘2015 నుండి నేను తెలుగులో సినిమాలు చేస్తున్నాను. ఈ ప్రయాణంలో ఎందరో ప్రముఖ నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో కలిసి పని చేసి, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. పలు మంచి సినిమాల్లో భాగమయ్యాను. మరిన్ని మంచి సినిమాలతో అలరించడానికి ప్రయత్నిస్తున్నాను. ముఖ్యంగా బాలకృష్ణగారితో వరుసగా సినిమాలు చేసే అవకాశం రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ సమయంలో ఎవరూ పెద్దగా సినిమాలు చేయలేదు. అలాంటి సమయంలో బోయపాటి శ్రీనుగారు ‘అఖండ’ కథ చెప్పి, అందులో నన్ను భాగం చేశారు. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో.. అప్పటి వరకు పడుతూ లేస్తున్న నా సినీ కెరీర్ మరో స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ‘డాకు మహారాజ్’లో మరోసారి బాలకృష్ణ గారితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ‘డాకు మహారాజ్’ కూడా ఘన విజయం సాధిస్తుంది. అలాగే ఇందులో నా పాత్రకు కూడా మంచి పేరు వస్తుందని ఎంతగానో నమ్ముతున్నాను.
‘డాకు మహారాజ్’లో కావేరి అనే పాత్రలో నటించాను. నటనకు ఆస్కారమున్న చాలా మంచి పాత్ర ఇది. ఇంకా చెప్పాలంటే ఇందులో డీ గ్లామరస్ రోల్ చేశాను. నేను ఇప్పటివరకు పోషించిన పాత్రలకు చాలా భిన్నంగా ఉంటుంది. కావేరి పాత్రను బాబీ గారు డిజైన్ చేసిన తీరు అద్భుతం అని చెప్పగలను. ఈ పాత్ర నాకు నటిగా ఛాలెంజింగ్‌గా అనిపించింది. కావేరి పాత్రతో పాటు ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. దర్శకుడు బాబీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం ఇంత కాలానికి వచ్చింది. బాబీ అద్భుతమైన దర్శకుడే కాదు మంచి మనిషి కూడా. సెట్స్‌లో చాలా కూల్‌గా ఉంటారు. నటీనటులను ఒత్తిడికి గురి చేయకుండా, వారి పనిని తేలిక చేసి, మంచి నటనను రాబట్టుకుంటారు. ఆయన ఈ కథ చెప్పినప్పుడే ఇది మంచి చిత్రం అవుతుందని నమ్మాను. నేను ఊహించిన దానికంటే గొప్పగా ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. బాలయ్యగారిని చాలా కొత్తగా చూపించారు. విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
నందమూరి బాలకృష్ణగారికి సినీ పరిశ్రమలో ఎంతో అనుభవం ఉంది. అయినా కూడా ఇంకా కొత్తగా ఏదో నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తనలో తాను స్ఫూర్తి నింపుకోవడమే కాకుండా, ఇతరులలోనూ ఆ స్ఫూర్తి నింపుతుంటారు. సెట్స్‌లో ఆయన అందరితో ఎంతో సరదాగా ఉంటారు. సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలు ఆయన నుంచి నేర్చుకోవచ్చు. ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే.. దర్శకుడికి ఏం కావాలో అది నూటికి నూరు శాతం ఇచ్చే హీరో. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ బ్యానర్ నిర్మాతలు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో ఉంటారు. నాగవంశీ గొప్ప నిర్మాత. ఆయన దర్శకులను, టీమ్‌ని ఎంతో నమ్ముతారు. అందరికీ స్వేచ్ఛనిస్తారు. మంచి సినిమాలను అందించడానికి ఆయన తపిస్తూ ఉంటారు.
మన సినీ పరిశ్రమలో ఉన్న గొప్ప సంగీత దర్శకులలో థమన్ ఒకరు. ముఖ్యంగా బాలయ్యగారి సినిమాలకు ఆయన ఇచ్చే సంగీతం చాలా గొప్పగా ఉంటుంది. ఈ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇందులో నాకు ‘డాకు’ సాంగ్ ఎంతో ఇష్టం. పాటలతో పాటు ఈ చిత్ర నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. సినిమా విడుదలరోజే నా పుట్టినరోజు. అయితే పుట్టినరోజు ప్రతి ఏడాది వస్తుంది. కానీ బాలకృష్ణగారి సినిమా అనేది ఒక సెలబ్రేషన్ లాంటిది. బాలయ్యగారితో కలిసి నేను నటించిన సినిమా నా బర్త్ డేకి విడుదల కావడం నా అదృష్టం. ఇది నా పుట్టినరోజుకి ఒక పెద్ద బహుమతిగా భావిస్తున్నాను. అలాగే నేను నటించిన సినిమా సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు విడుదలవుతుండటం కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వస్తున్న ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా డ్రీమ్ రోల్స్ అంటే.. ఎస్.ఎస్. రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలీ వంటి గొప్ప దర్శకులు తీసే భారీ సినిమాలలో శక్తివంతమైన పాత్రలలో నటించాలని ఉంది. అలాగే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉంది.. అలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను..’’ అని ప్రగ్యా జైస్వాల్ తెలిపింది.
కాగా, శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో ఈ ‘డాకు మహారాజ్’ సినిమాను నిర్మించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా నటించగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఓ కీలక పాత్రలో నటించారు.