పూనమ్ కౌర్ సుదీర్ఘ సందేశం - పవన్ ఫ్యాన్స్ కోసమేనా?
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ తనను సోషల్ మీడియాలో టార్గెట్ చేసే వాళ్లకోసం సుదీర్ఘ సందేశాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు ఒక్కోసారి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య పూనం కౌర్ సోషల్ మీడియాలో ఏదైనా ట్విట్ చేస్తే వెంటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. అంతే కాకుండా కొంత మంది ఫ్యాన్స్ అయితే ఆమెపై తీవ్ర పదజాలంతో దాడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు సంబంధం లేని పోస్టులు పెట్టిన కూడా ఆయన ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్పందించిన పూనం కౌర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నేరుగా మెన్షన్ చేయకుండా పరోక్షంగా ఓ సందేశాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ పోస్టులో పూనం కౌర్ పేర్కొంటూ " చాలామంది నా జీవితాన్ని ఒకే వ్యక్తి చుట్టూ ఎందుకు తిప్పుతున్నారో అర్థం కావడం లేదు? నేను ఒక స్త్రీగా సామాజిక సమస్యలపై ఎంతో లోతుగా ప్రశ్నిస్తున్నాను. మల్లయోధుల గురించి ఎవరు మాట్లాడరు. అలాగే మణిపూర్ హింస గురించి, మహిళల గురించి ఎవరూ మాట్లాడరు. ఇక ఒక స్త్రీ జీవితాన్ని మీడియా చాలా లైట్ తీసుకుంటుంది. మీడియా వల్లే మనిషి జీవితంలో శారీరకంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. రేణుజీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఓ చేనేత కార్మికుల కోసం చాలా పని చేశాను. మేమంతా జీరో జీఎస్టీ కోసం ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాం. నేను ఒంటరిగానే ఒకటిన్నర సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాను. నేను మాట్లాడేది శాంతి కోసం మాత్రమే'' అని తెలిపింది.
''మీరంతా ఆధ్యాత్మిక విషయాలపై మాట్లాడుతారు. కానీ నా వరకు వచ్చేసరికి నా జీవితాన్ని మీ ప్రాఫిట్ కోసం వాడుకోవడంతో పాటు నా వ్యక్తిత్వాన్ని ఒక వ్యక్తికే పరిమితం చేశారు. వాస్తవానికి కొంతమంది నిజ జీవితాల్లో ఏం జరుగుతుందో బయట తెలీకపోయినా మీడియా చేసే ప్రచారం వల్ల వాళ్ళ జీవితాలు బాధపడతాయి. నేను నా జీవితంలో ఎవరికోసం రాజీ పడలేదు. ఎప్పటికీ పడను కూడా. నేను మహిళల సమస్యలు మరియు ఆ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడతాను. అంతే గాని, ఇది మల్ల యోధుల గురించో లేకపోతే రాజకీయ నాయకుల గురించో లేక ఇంకెవరి గురించో కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ధన్యవాదాలు" అంటూ పూనం కౌర్ తన సందేశంలో రాస్కొచ్చింది.
ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని ఇలా సందేశం రూపంలో చెప్పింది. దీన్ని పవన్ ఫ్యాన్స్ కానీ రాజకీయ నాయకులు కానీ ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి. ప్రస్తుతం పూనం కౌర్ షేర్ చేసిన ఈ స్పెషల్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా కచ్చితంగా పూనం కౌర్ ఈ సందేశాన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే పోస్ట్ చేశారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. కాకపోతే ప్రత్యక్షంగా వాళ్ల పేరును ప్రస్తావించకుండా.. పరోక్షంగా ఇలా సందేశం రూపంలో చెప్పిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ‘కల్కి 2898 AD’లో నా పాత్ర చాలా కామెడీగా ఉంటుంది: ప్రభాస్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial