Pawan Kalyan: మళ్లీ కెమెరా ముందుకు పవన్ కళ్యాణ్ - రెండు పడవల ప్రయాణం సాఫీగా సాగేనా?
జనసేనాని పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌లు మొదలు పెట్టారు. మంగళగిరిలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలో పాల్గొన్నారు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఆయన మేనేజ్ చేయగలరా?
జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మళ్లీ సినిమా షూటింగ్‌లు మొదలు పెట్టారు. ఎన్నికల కారణంగా దాదాపు ఒక ఆరు నెలల నుంచి షూటింగ్ పక్కన పెట్టేసారాయన. పోనీ ఎన్నికలు పూర్తయ్యాక పెండింగ్ సినిమాలు పూర్తి చేస్తారనుకుంటే ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు వలన కుదరలేదు. అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న 'OG' సినిమా షూటింగ్ కూడా ఇప్పుడు చేయలేనని తాను 'ఓజీ అంటే ప్రజలు క్యాజీ అంటారు' అని కూడా ఆయన కొంతకాలం క్రితం సెటైర్ వేశారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్లీ షూటింగ్‌లు మొదలు పెట్టారు.
మంగళగిరిలోనే సినిమా సెట్టింగ్స్
మధ్యలో సినిమా షూటింగ్‌లు ఆగిపోయి తన కోసం ఎదురుచూస్తున్న నిర్మాతల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆ షూటింగులు పూర్తి చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఆయన కొన్ని కండిషన్స్ నిర్మాత, దర్శకులకు పెట్టారు. ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు వచ్చి షూటింగ్ చేయడం కష్టమని కాబట్టి తాను ఉండే మంగళగిరి ఆఫీసుకు దగ్గర్లోనే సెట్టింగ్స్ వేసుకుని షూటింగ్స్ జరపాలని కోరారు. దానికి అంగీకరించిన నిర్మాత, దర్శకులు మంగళగిరి జనసేన కార్యాలయం దగ్గరలో సెట్స్ వేసి షూటింగ్స్ మొదలు పెట్టారు. సోమవారం (సెప్టెంబర్ 23) చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు.
ప్రధానంగా ఆ మూడు సినిమాలే
షూటింగ్స్ మధ్యలో ఆగిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రధానంగా మూడు ఉన్నాయి... అవే 'హరిహర వీరమల్లు', 'ఓజీ', 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ మూడు సినిమాల్లో 'హరిహర వీరమల్లు' షూటింగ్ మళ్లీ మొదలైంది. ఎప్పుడో మెగా నిర్మాత ఏఎం రత్నానికి తాను ఇచ్చిన మాటను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు ఒప్పుకొన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాకు మొదట డైరెక్టర్‌గా క్రిష్ కొంతకాలం పనిచేసినా ఏమైందో తెలియదు గానీ ఆ మధ్య వచ్చిన టీజర్ తరువాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ నటిస్తున్న పిరియాడిక్ మూవీ కావడంతో 'హరిహర వీరమల్లు'పై భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ నటుడు బాబి డియోల్, నిధి అగర్వాల్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సీన్ల షూటింగ్ వేగంగా కంప్లీట్ చేసేందుకు మూవీ టీం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
రెండు పడవల ప్రయాణం సాఫీగా సాగేనా?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మీద ఉన్న పెద్ద బాధ్యత అటు పాలిటిక్స్, ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేయడం. రానున్న మూడు సినిమాలు చాలా పెద్దవి. అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ ముందు ఉన్న టార్గెట్స్ కూడా పెద్దవే. ఇటు షూటింగ్స్ అటు పదవి బాధ్యతలు రెండింటిని ఆయన సమానంగా ఆయన నిర్వర్తించాల్సి ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)యే పొరపాటు తమకు దొరుకుతాడా అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నారు. పూర్తిగా షూటింగ్లకు పరిమితం అయితే మంత్రిత్వ బాధ్యతలు పక్కన పెట్టేసారని విమర్శిస్తారు. పోనీ ప్రజల్లోనే ఉండి పని చేద్దాం అంటే నమ్ముకున్న నిర్మాతలను మధ్యలో ముంచేసాడన్న నిందలు మోపేస్తారు.
గతంలో ఎన్టీఆర్ విపక్షంలో ఉన్న సమయంలో 'మేజర్ చంద్రకాంత్' లాంటి సినిమాలు తీస్తేనే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. సోషల్ మీడియా లేని ఆ రోజుల్లోనే ఆ విమర్శల ధాటి తీవ్రంగా ఉండేది. అలాంటిది ఈ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రత్యర్థి రాజకీయ పార్టీల ఐటి సెల్స్ ఒక్కసారిగా విమర్శల దాడి ప్రారంభించేస్తాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాలపైనే ఆసక్తి ఉన్నట్టు చాలాకాలం క్రితమే స్పష్టం చేశారు. కానీ ఆయన అంటే ప్రాణం ఇచ్చే అభిమానుల కోసం, జనసేన పార్టీ నిర్వహణ ఖర్చుల కోసం సినిమాలు చేస్తా అని కూడా చెప్పారు. ఆ నేపథ్యంలో ఎన్నికల కారణంగా మధ్యలో ఆగిపోయిన సినిమాల షూటింగ్‌లను పవర్ స్టార్ మళ్లీ మొదలుపెట్టడం ఆయన ఫ్యాన్స్ కు కిర్రెక్కించే న్యూస్ అనే చెప్పాలి.