Pawan Kalyan: పవన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రిపుల్ ట్రీట్, ఆ మూడు ఒకేసారి!
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పవన్ మూడు అప్‌కమింగ్ చిత్రాల నుండి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చే అదిరిపోయే అప్డేట్స్ విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది.
తమ అభిమాన హీరో లేదా హీరోయిన్.. పుట్టినరోజు వచ్చిందంటే వారి సినిమాలకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్‌ను ఆటోమేటిక్‌గా ఆశిస్తారు ఫ్యాన్స్. వారి తరువాతి చిత్రాల నుంచి ఏదో ఒక విధమైన అప్డేట్ కచ్చితంగా బయటికి రావాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు మేకర్స్ మాత్రం ఎలాంటి అప్డేట్ లేకుండా ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తారు. కానీ ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు మాత్రం ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లభిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పవన్ మూడు అప్‌కమింగ్ చిత్రాల నుంచి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చే అదిరిపోయే అప్డేట్స్ విడుదల అవుతున్నట్టు తెలుస్తోంది.
ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు అప్డేట్స్..
సెప్టెంబర్ 2 వచ్చిందంటే చాలు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో పవన్ ఫ్యాన్స్‌కు తన బర్త్‌డేను ఎలా సెలబ్రేట్ చేయాలో తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మళ్లీ రోజులు మారిపోయాయి. పవన్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా మూవీ పోస్టర్ రిలీజ్ అవ్వగానే వెంటనే దాంతో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. మళ్లీ మునుపటి ఉత్సాహం అంతా పవన్ ఫ్యాన్స్‌లో క్లియర్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. అయితే ఆ మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్.. సెప్టెంబర్ 2న పవన్ బర్త్‌డే సందర్భంగా విడుదల కానున్నట్టు సమాచారం.
‘ఓజీ’ టీజర్‌కు టైమ్ వచ్చేసింది..
ప్రస్తుతం పవన్ చేస్తున్న అన్ని సినిమాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఓజీ’. యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చాలాకాలం తర్వాత పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నాడు. అప్పుడెప్పుడో ‘పంజా’లో స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పవన్.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ‘ఓజీ’ కోసం గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. గ్యాంగ్‌స్టర్ డ్రామాలు తెరకెక్కించడంలో సుజీత్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడో ‘సాహో’ చూస్తే తెలుస్తోంది. అందుకే ఫ్యాన్స్‌కు ‘ఓజీ’పై అంచనాలు మామూలుగా లేవు. ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదల కానుంది. దీనికి యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని పవన్ ఫ్యాన్స్ అప్పుడే సన్నాహాలు మొదలుపెట్టారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా ప్రియాంక మోహన్ కనిపించనుంది.
‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కలిసి..
‘ఓజీ’ కంటే ముందు పవన్ ప్రారంభించిన సినిమాలు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. ఈ రెండిటి కంటే ముందు ప్రారంభించిన ‘బ్రో’ సైతం షూటింగ్ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ రెండు చిత్రాలు మాత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే పవన్ బర్త్‌డే సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి అర్థరాత్రి 12.17 నిమిషాలకు ఒక పోస్టర్ విడుదల కానుందని సమాచారం. దీంతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్‌ను కూడా రేపే అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ద్వారా హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే ఈసారి పవర్ స్టార్ పుట్టినరోజుకు ఫ్యాన్స్‌కు ట్రిపుల్ బొనాన్జా గ్యారెంటీ అని అర్థమవుతోంది.
Also Read: ‘బిగ్ బాస్’ సీజన్ - 7 సందడి షురూ, హౌస్‌లో ఎంట్రీకి సిద్ధమైపోయిన సెలబ్రిటీలు వీళ్లే
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial