MAA Election : "మా" రాజకీయంలో మరిన్ని ట్విస్టులు..! క్లైమాక్స్ దిశగా తీసుకెళ్తున్న ప్రస్తుత కార్యవర్గం..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై వివాదాలు కొనసాగుతున్నాయి. తక్షణం ఎన్నికలు పెట్టాలని ప్రస్తుత కార్యవర్గంలోని 15 మంది సీనియర్ నటుడు కృష్ణంరాజుకు లేఖలు రాశారు.
కరోనా కారణంగా టాలీవుడ్‌లో షూటింగ్‌లు.. బిజినెస్‌లకు ఇబ్బంది ఏర్పడిందేమో కానీ రాజకీయాలు మాత్రం ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. మా ఎన్నికల విషయంలో ఎత్తులు.. పైఎత్తులు వేస్తూ.. రాజకీయం ఓ రేంజ్‌లో చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు పెడతారు అనే ఉత్కంఠ కొనసాగుతూండగా.. త్వరగా పెట్టాల్సిందేనని.. ఒత్తిడి పెంచేందుకు కొత్త కొత్త ప్లాన్లతో తెరపైకి వస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గంలో పదిహేను మంది ఈ సారి లీడ్ తీసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కమిటీలోని 15 మంది సభ్యులు, మా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు అయిన కృష్ణం రాజుకు లేఖలు రాశారు. తక్షణం ఎన్నికలు నిర్వహించేలా చూడాలని అందులో కోరారు.
వాస్తవానికి "మా " కార్యవర్గ పదవీ కాలం పూర్తయింది. 2019లో జరిగిన ఎన్నికల్లో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. అయితే.. గెలిచిన వారి మధ్య సఖ్యత లేకపోవడంతో అనేక వివాదాలు వచ్చాయి. ఆ తర్వాత కరోనా రావడంతో అందరూ సైలెంటయిపోయారు. పెద్దగా చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. అయితే నరేష్ ఒంటెత్తు పోకడల వల్ల ఆయన టీంలోని చాలా మంది ఈ సారి ఆయనను పక్కన పెట్టేసి.. వేరే ప్యానళ్లలో చేరిపోయారు. ప్రస్తుత కార్యవర్గంలో ఉన్న పదిహేను మంది అలా... ఇప్పుడు ఎన్నికల కోసం .. కృష్ణంరాజు కు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం.. లేఖను కృష్ణంరాజుకు పంపినప్పటికీ.. ఈ వివాదంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదేమో కానీ ఆయన స్పందించలేదు. అయితే ప్రస్తుత కార్యవర్గంలోని పదిహేను మంది సభ్యులు పట్టు వదలకుండా మరో లేఖ రాశారు. దానిపైనైనా స్పందిస్తారేమోనని ఎదురు చూస్తున్నారు. కృష్ణంరాజు స్పందించకపోతే ఏం చేయాలన్నదానిపై.. వర్చువల్‌గా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ అంశంపై కృష్ణంరాజు స్పందించి.. త్వరలోనే డేట్స్ ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
కొద్ది రోజుల కిందట.. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించారు. దానికి ప్రస్తుత అధ్యక్షుడు నరేష్.. సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని రిప్లయ్ ఇచ్చారు. అయితే కార్యవర్గ పదవీ కాలం ముగిసినందున.. తక్షణం ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను ఎక్కువ మంది వినిపిస్తున్నారు. ఈసారి మా అధ్యక్ష పదవికి ఐదుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితారాజశేఖర్, హేమతో పాటు సీవీఎల్ నర్సింహరావు కూడా ఉన్నారు. వీరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలున్నాయి. మరోవైపు ఏకగ్రీవం అంశం కూడా తెరపైకి వచ్చింది. దీనిపై... గురువారం.. ప్రస్తుత కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఎన్నికల కోసం నటులు రోడ్డున పడే సందర్భం వచ్చినా.. సినీ పెద్దలు కల్పించుకునేందుకు ఇష్టపడటం లేదు. ఎవరూ ఒకరి మాట ఒకరు వినే పరిస్థితి లేకపోవడం వారికి చెప్పే పెద్దలు కూడా లేకపోవడంతో... టాలీవుడ్ రాజకీయం హైలెట్ అవుతోంది.