Nayanthara: ఆ లక్ష్యంతోనే ‘అన్నపూర్ణి’ని తెరకెక్కించాం - ఎట్టకేలకు స్పందించిన నయనతార
Annapoorani Controversy: నయనతార కెరీర్‌లో 75వ చిత్రంగా తెరకెక్కిన ‘అన్నపూర్ణి’ మూవీ చుట్టూ ఎన్నో కాంట్రవర్సీలు అల్లుకున్నాయి. ఫైనల్‌గా ఈ కాంట్రవర్సీలపై నయన్ స్పందించింది.
Nayanthara about Annapoorani Controversy: సౌత్ సినిమాల్లోనే లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. అలాంటి నయనతార.. ఇప్పటివరకు తన కెరీర్‌లో 74 చిత్రాలను పూర్తిచేసుకుంది. 75వ చిత్రంగా ఇటీవల ‘అన్నపూర్ణి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ట్రైలర్ విడుదలయినప్పటి నుంచి దీని చుట్టూ కాంట్రవర్సీలు తిరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి ఈ మూవీని ఓటీటీ నుంచి కూడా తొలగించే పరిస్థితి ఏర్పడింది. ఇంత జరిగినా కూడా మూవీ టీమ్ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. నయనతార.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ విషయంపై స్పందించింది. ఎవరైనా తమ సినిమా వల్ల హర్ట్ అయ్యింటే సారీ అని చెప్పింది.
పాజిటివ్ మెసేజ్ ఇవ్వాలనుకున్నాం
జై శ్రీరామ్ అంటూ తన లేఖను ప్రారంభించింది నయనతార. ‘అన్నపూర్ణి’ సినిమా వల్ల జరుగుతున్న పరిణామాలపై స్పందించడం కోసం బరువెక్కిన గుండెతో ఇది రాస్తున్నాను. అన్నపూర్ణి అనేది కేవలం సినిమాలాగా కాకుండా ఎప్పుడూ ధైర్యాన్ని వదలకూడదు అనే స్ఫూర్తిని నింపడం కోసం చేసిన ప్రయత్నం. ఈ సినిమాలో ప్రతీ ఒకరి జీవితానికి అద్దంపట్టి చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంకల్పం ఉంటే ఎలాంటి కష్టాలను అయినా దాటవచ్చని చూపించాలని అనుకున్నాం. ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చే క్రమంలో తెలియకుండానే కొందరిని హర్ట్ చేసి ఉండవచ్చు అంటూ ‘అన్నపూర్ణి’ సినిమా తన మనసుకు ఎంత దగ్గర అయ్యిందో చెప్పుకొచ్చింది నయనతార.
దేవుడిని బలంగా నమ్ముతాను
‘ఒక సినిమాకు సెన్సార్ పూర్తయ్యి.. థియేటర్లలో విడుదలయిన తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నుంచి దానిని తొలగిస్తారని మేము అస్సలు ఊహించలేదు’ అంటూ నెట్‌ఫ్లిక్స్ నుంచి ‘అన్నపూర్ణి’ తొలగింపుపై అసంతృప్తి వ్యక్తం చేసింది నయన్. ‘నా టీమ్ గానీ, నేను గానీ ఎవరి సెంటిమెంట్స్‌ను కావాలని హర్ట్ చేయాలని అనుకోలేదు. జరిగిన సంఘటన లోతు ఎంతో కూడా మాకు అర్థమవుతుంది. దేవుడిని బలంగా నమ్మి.. దేశవ్యాప్తంగా ఆలయాలకు తిరిగే వ్యక్తిగా నేను ఇలాంటి పని కావాలని ఎప్పుడూ చేయను. ఎవరి ఫీలింగ్స్ అయితే హర్ట్ అయ్యాయో.. వారికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను. స్ఫూర్తిని ఇవ్వాలన్నదే అన్నపూర్ణి లక్ష్యం, బాధపెట్టాలన్నది కాదు’ అంటూ అందరికీ క్షమాపణలు తెలిపింది ఈ లేడీ సూపర్ స్టార్.
నా ఉద్దేశ్యం ఒకటే..
‘సినీ పరిశ్రమలో గత రెండు దశాబ్దాలుగా సాగుతున్న నా ప్రయాణం ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే - కేవలం పాజిటివిటీని పంచడం, ఒకదాని నుంచి మరొకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం’ అంటూ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంది నయనతార. నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘అన్నపూర్ణి’లో నయన్.. ఒక బ్రాహ్మిణ అమ్మాయిగా నటించింది. ఇక ఈ మూవీలో హీరోయిన్ చెఫ్ అవ్వాలని కలలు కంటుంది. చెఫ్ అంటే మాంసాహారం కూడా వండాలి కాబట్టి ఒక బ్రాహ్మిణ అమ్మాయి మాంసాహారాన్ని వండాలనుకోవడం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. అందుకే ఈ మూవీని ఖండించడానికి ఎంతోమంది మతపెద్దలు ముందుకు వచ్చారు. దీంతో ఒత్తిడిని తట్టుకోలేక.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ‘అన్నపూర్ణి’ని స్ట్రీమింగ్ నుంచి తొలగించింది.
View this post on Instagram
Also Read: విజువల్ ట్రీట్ ఇచ్చిన 'హనుమాన్' విగ్రహం నిజంగా ఉందా? మూవీ షూటింగ్ లొకేషన్స్ ఎక్కడంటే..