Nani Comments: ‘కేజీఎఫ్’ వివాదంపై స్పందించిన నాని - ఆ దర్శకుడికి చురకలు!
నాని ‘దసరా’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు దర్శకుడు వెంకటేష్ మహాకు కౌంటర్ అంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇంతకు నాని ఉద్దేశ్యం ఏంటో..!
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించారు. 'దసరా' సినిమా కమర్షియల్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే ధీమాతో ఉన్న నాని.. ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన పలు విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన కమర్షియల్ సినిమా అంటూ చేసిన వ్యాఖ్యలను ఇటీవల ‘కేజీఎఫ్’ చిత్రంపై దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ అన్నట్లుగా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాపై తీవ్రమైన విమర్శలు చేసిన దర్శకుడిని ఉద్దేశించే నాని ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
'దసరా' చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ.. ‘‘కమర్షియల్ సినిమాలు లేకపోతే ఇండస్ట్రీలో డబ్బు కనిపించదు. అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించగల సత్తా కమర్షియల్ సినిమాలకుంది. ఒక సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యిందంటే దర్శకుడితో పాటు మొత్తం టీం కష్టం చాలా ఉంటుంది. యూనిట్ సభ్యులంతా కూడా ఎంతో కష్టపడి ఆ సినిమాకు వర్క్ చేశారని అర్థం. ఇండియన్ సినిమా ప్రస్తుతం ఈ స్థాయిలో స్ట్రాంగ్ గా నిలవడానికి కమర్షియల్ సినిమాలే ప్రధాన కారణం. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలూ కమర్షియల్ హంగులతో ఉంటేనే సక్సెస్ అవుతాయి’’ అని అన్నారు. కమర్షియల్ సినిమా అనగానే లాజిక్ లేకుండా తీస్తున్నారనే అభిప్రాయమున్న నేపథ్యంలో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
క్షమాపణ చెప్పినా..
‘కేజీఎఫ్’ సినిమాలోని హీరో పాత్ర, తల్లి పాత్ర గురించి పేరు ఎత్తకుండా వెంకటేష్ మహా అవమానకరంగా మాట్లాడిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యలకు ఆయన ఇప్పటికే తగిన మూల్యం చెల్లించారు. ‘కేజీఎఫ్’ అభిమానులు మాత్రమే కాకుండా కమర్షియల్ సినీ ప్రేమికులు, ఇండస్ట్రీ వర్గాల వారు ఆయనపై తీవ్రంగా స్పందించారు. మొత్తం కమర్షియల్ సినిమాను, ఆ తరహా సినిమాలను రూపొందించే మేకర్స్ ను అవమానించారంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా తన వ్యాఖ్యలను ఒక వైపు సమర్థించుకుంటూనే మరో వైపు తన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలంటూ బహిరంగ క్షమాపణ చెప్పాడు. అయినా కూడా వివాదం ముగియలేదు. తాజాగా హీరో నాని కూడా పేరు ఎత్తకుండా వెంకటేష్ మహా పై విమర్శలు చేశారంటూ సోషల్ మీడియా టాక్.
నాని 'దసరా' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. సింగరేణి సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన హీరో పాత్ర నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ ఏడాది ఎక్కువగా మాట్లాడుకునే సినిమాల జాబితాలో 'దసరా' సినిమా నిలుస్తుందంటూ నాని ప్రమోషన్ కార్యక్రమాల్లో చెబుతున్నారు. ఉత్తర భారతంలో కూడా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసేందుకు గాను అన్ని భాషల ట్రైలర్ ను అక్కడే విడుదల చేయాలనే ప్లాన్ చేశారట. నాని మొదటి సారి పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి పెట్టిన నేపథ్యంలో 'దసరా' ఫలితంపై అందరి దృష్టి ఉంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే సౌత్ పాన్ ఇండియా స్టార్స్ జాబితాలో నాని చేరబోతున్నాడని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.