Nagarjuna: కొడుకు కోడలి ముందు ఇటువంటి వీడియోలు వద్దు... ఇబ్బంది పడిన నాగార్జున
Nagarjuna Embarrassing Moment: తనయుడు నాగచైతన్య తండేల్ భారీ సక్సెస్ సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో ప్రదర్శించిన ఏవీ చూసి నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. నవ్వుతూ ఇటువంటి వద్దని చెప్పేశారు.

Nagarjuna AV at Thandel Love Tsunami Celebrations gets negative feedback: అక్కినేని హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. కింగ్ నాగార్జునను మన్మథుడు అంటూ కొంత మంది ఫ్యాన్స్ ముద్దుగా పిలుస్తారు. 'అన్నమయ్య', 'శ్రీ రామదాసు', 'నమో వెంకటేశాయ' వంటి భక్తి సినిమాలతో పాటు 'శివ' లాంటి యాక్షన్ సినిమాలు సైతం నాగార్జున చేశారు. అయితే... ఆయన చేసిన రొమాంటిక్ ఫ్యామిలీ ఫిలిమ్స్ ప్రేక్షకులకు ముందుగా గుర్తొస్తాయి. అందులో తప్పు లేదు. కానీ, రొమాంటిక్ అంటే హీరోయిన్లకు లిప్ లాక్స్ ఇవ్వడం - కొన్ని సినిమాలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ చెప్పడం అని శ్రేయాస్ మీడియా అనుకోవడం శోచనీయం.
కొడుకు కోడలి ముందు ఇటువంటి వీడియోలు వద్దు!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'తండేల్' భారీ సక్సెస్ సాధించింది. బాక్సాఫీస్ బరిలో 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో ఇది చేరుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. వసూళ్లను మించిన ప్రశంసలు చైతన్య నటనకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఆ పతాక సన్నివేశాలలో ఆయన కనబరిచిన అభినయం అందరి చేత క్లాప్స్ కొట్టించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. దానికి నాగార్జునను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
సినిమా వేడుకలకు వచ్చిన ముఖ్య అతిథుల ఘనతను చాటి చెప్పే విధంగా ఏవీ ప్రదర్శించడం ఆనవాయితీ. సక్సెస్ మీట్ లో నాగార్జున ఏవీ చూసి నాగ చైతన్య శోభితా ధూళిపాళ దంపతులు ఇబ్బంది పడ్డారు. వాళ్లు ఇద్దరూ మాత్రమే కాదు... నాగార్జున సైతం ఇబ్బంది పడ్డారు. ఇక వేడుకకు వచ్చిన అభిమానుల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.
'మన్మథుడు 2'లో హీరోయిన్లకు నాగార్జున లిప్ లాక్స్ ఇచ్చారు. అది ఒక్కటే కాదు... ఇంకొన్ని సినిమాల్లో డైలాగులు కలిపి ఒక వరస్ట్ ఏవీ తయారు చేసింది శ్రేయాస్ మీడియా సంస్థ. అది ప్రదర్శించిన టైంలో కొత్త జంట నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ముఖాలు చూస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో అర్థం అవుతుంది. వేదికపై మాట్లాడడానికి వచ్చిన నాగార్జున ''కొడుకు కోడలి ముందు ఇటువంటి వీడియోలు వద్దు. దయచేసి అడుగుతున్నాను'' అంటూ నవ్వారు. పైకి నాగార్జున నవ్వారు కానీ ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో అనేది ఆ మాటల్లోనే అర్థం అయింది.
Also Read: నేను ఈ జన్మంతా రాజకీయాలకు దూరమే... నా బదులు పవన్ ఉన్నాడు - చిరంజీవి మెగా పొలిటికల్ స్టేట్మెంట్
నాగార్జున అగ్ర కథానాయకులలో ఒకరు. ఆయనకు బోల్డంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కథల పరంగా రొమాంటిక్ సీన్స్ చేసి ఉండొచ్చు. ఆయన కుటుంబ సభ్యులు, అందులోనూ కొత్త జంట వచ్చినప్పుడు ఎటువంటి ఏవి వేయాలనేది చూసుకోవలసిన అవసరం లేదా? నాగ్ అంటే కేవలం లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ అనుకుంటే ఎలా? అసలు ఆ ఏవీని ఎవరు అప్రూవ్ చేశారో? చూసుకోవాల్సిన అవసరం లేదా!? భవిష్యత్తులో ఇటువంటివి రిపీట్ కాకుండా శ్రేయాస్ మీడియా చూసుకోవడం మంచిది.
Also Read: నాగ చైతన్యతో 'తెనాలి రామకృష్ణ' రీమేక్... 'తండేల్' సక్సెస్ మీట్‌లో కన్ఫర్మ్ చేసిన దర్శకుడు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

