Agent: డాక్టర్ అఖిల్‌ను గంటసేపు మట్టిలో కూర్చోబెట్టమన్నారు: నాగార్జున
సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన 'ఏజెంట్' కచ్చితంగా హిట్ అవుతుందని హీరో హీరో నాగార్జున విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని, తన ఎనర్జీ మొత్తాన్ని పెట్టి చేశాడన్నారు..
Agent : దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వహించిన ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతుంది. హీరో అఖిల్ అక్కినేని, హీరోయిన్ సాక్షి వైద్య జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే వరంగల్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి హీరో అక్కినేని నాగార్జునతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పాల్గొన్నారు. కాగా ఈ వేడుకలో నాగ్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ గొప్పతనాన్ని చెబుతూ స్పీ్చ్ స్టా్ర్ట్ చేసిన ఆయన.. వరంగల్ పోరాటాలకు అడ్డా.. వీరత్వానికి ఇంటి పేరు అంటూ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్లని, ఓ కొత్త జోనర్ తో, ఓ మంచి సినిమాను ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారని హీరో నాగార్జున అన్నారు. ఇప్పుడు అదే తరహాలో సురేందర్ రెడ్డి ఓ చక్కటి, థ్రిల్లింగ్ ,స్పై సినిమాను తీశారని.. ఏజెంట్ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు. తాను నిజానికి సినిమా చూడలేదని, కనీసం కథ కూడా తెలియదని, అప్పుడప్పుడు అఖిల్ మాట్లాడితే వినడమేనని చెప్పారు. సురేందర్ రెడ్డి ఇండస్ట్రీకి ఎన్ని హిట్లు ఇచ్చాడో అందరికి తెలుసన్న నాగార్జున.. అనిల్ సుంకర .. వీరిద్దరూ దేనికీ వెనకాడకుండా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోందని చెప్పారు. ఈ సినిమాకు వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారంటే అఖిల్ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అయినట్టేనని నాగార్జున విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏజెంట్ సినిమా కోసం గత రెండేళ్లుగా అఖిల్ ఎంత కష్టపడుతున్నాడో తాను చూశానని నాగార్జున చెప్పారు. కేవలం 9 నెలల్లోనే ఇలాంటి లుక్ న్యాచురల్ గా రావడం కష్టమని, అందుకు అఖిల్ ఎంతో కష్టపడినట్లు ఆయన చెప్పుకొచ్చారు. చిన్నప్పట్నుంచీ అఖిల్ హైపర్ యాక్టివ్ అని, అతని అల్లరిని భరించలేక వాళ్ళ అమ్మ అమల.. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లిందని అప్పటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. డాక్టరేమో అఖిల్ ను రోజూ ఆరు బయట, వాకిట్లో ఉన్న మట్టిలో గంట కూర్చోబెట్టమని.. అతనిలో ఉన్న ఎనర్జీ భూమి లోపలికి వెళ్ళిపోతుందని చెప్పినట్లు నాగార్జున వివరించారు. ఇప్పుడు ఆ ఎనర్జీ మొత్తాన్ని సురేందర్ రెడ్డి ఖర్చుపెట్టినందుకు ఆయనకు ఈ సందర్భంగా నాగార్జున థాంక్స్ చెప్పారు.
ఇక మలయాళ స్టార్ మమ్ముట్టిపైనా నాగార్జున ప్రశంసలు గుప్పించారు ఏజెంట్ సినిమా హిట్ అవ్వడానికి కారణాల్లో మమ్ముట్టి కూడా ఒకరని చెప్పారు. ఆయన సాధారణంగా ఇలాంటి సినిమాలు ఓకే చేయరని, కానీ ఏజెంట్ ను ఆయన నమ్మి చేశారంటే .. సినిమా హిట్ అన్నట్టేనని చెప్పారు. ఆయన చాలా గ్రేట్ అని, ఈ మధ్యే వారి తల్లిగారు చనిపోయినా.. సినిమా రిలీజ్ దగ్గరపడుతుందని డబ్బింగ్ చెప్పి వచ్చారని మమ్ముట్టిని కొనియాడారు. ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుందని, అందరూ ఏప్రిల్ 28న థియేటర్ కు వెళ్లి చూడాల్సిందిగా ఈ సందర్భంగా నాగార్జున ప్రేక్షకులను కోరారు.
దాదాపు రెండేళ్ల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందు రాబోతుండడంతో అక్కనేని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా ఉందంటూ పలువురు సినీ ప్రముఖులు సైతం పొగుడుతుండడం విశేషం. మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది. ఇప్పటివరకూ అఖిల్ తీసిన సినిమాలకు భిన్నంగా.. భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో రిలీజ్ కానున్న ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.