Pawan Kalyan: కళ్యాణ్ బాబు అమ్మ దగ్గరికి రాడు - మేం ముగ్గురు కలిసే ఉండాలనేది ఆమె కోరిక, కానీ..: నాగబాబు
Naga Babu: అన్నదమ్ముల మధ్య ఉండే బాండింగ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు నాగబాబు. తన తమ్ముడి గురించి, . ముగ్గురు కలిసుంటే అమ్మకి చాలా చాలా ఇష్టం అని అన్నారు. ఎన్నో విషయాలను పంచుకున్నారు.
Naga Babu About Bonding with Pawankalyan and Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముగ్గురి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కి సపోర్ట్ గా నాగబాబు, వాళ్ల కుటుంబం ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ కల్యాణ్ చిరంజీవిని కలిసి వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. వాళ్లు ముగ్గురుకి ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంటుందో అర్థం అవుతుంది. అయితే, ఆ ప్రేమ తన తల్లి కారణంగానే వచ్చిందని చెప్పారు నాగబాబు. ముగ్గురం కలిసి ఉంటే.. అమ్మకి చాలా ఇష్టం అని, ఐదుగురం ఎప్పుడూ కలిసే ఉంటాం అని అన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా విషయాలు పంచుకున్నారు.
నాన్నకి యాక్టింగ్ చాలా ఇష్టం..
మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ లోకి రావడానికి నాన్నే కారణం అని చెప్పారు నాగబాబు. అన్నయ్య అమ్మ దగ్గర ఎక్కువగా చదువుకోలేదని అన్నారు. "నేను, కల్యాణ్ బాబు, చెల్లెలం అమ్మ దగ్గరే ఉన్నాం. అన్నయ్య మాత్రం కొన్ని రోజులు ఇక్కడ, మరికొన్ని రోజులు వేరే చోట చదువుకున్నారు. యాక్టింగ్ విషయానికి వస్తే.. మా నాన్నకి యాక్టింగ్ చేయాలనే కోరిక చాలా ఉండేది. ఒకటి రెండు సినిమాలు యాక్ట్ చేశారు కూడా. ఫ్యామిలీ పరిస్థితుల వల్ల వదలుకోవాల్సి వచ్చింది. అన్నయ్యకి నాన్న సపోర్ట్ ఉండేది. ఇక నాన్న ఏమంటే అమ్మ దానికి ఓకే అనేది. అలా సినిమాల్లోకి వెళ్లాడు అన్నయ్య. నిజానికి అమ్మకి సినిమాలు అంటే ఇష్టం. చాలా సార్లు అన్నయ్య చెప్పుంటాడు కూడా అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు అమ్మ సినిమాకి వెళ్లి గుర్రం బండి నుంచి పడిపోయింది అని. నాగేశ్వరరావు గారి సినిమా అప్పుడు. అలా అమ్మకు కూడా ఇంట్రెస్ట్. ఇక నాన్నగారు జాగ్రత్తలు చెప్పి సినిమా ఇన్ స్టిట్యూట్ కి పంపించారు. ఒక సంవత్సరం ఛాన్స్ రాకపోతే మరో ఆరు నెలలు అంతే ఆ తర్వాత వెనక్కి వచ్చేయాలి అని చెప్పి పంపారు. లైఫ్ మొత్తం అక్కడే గడపొద్దు, ఉద్యోగం చేసుకోవాలి అన్నారు. కెరీర్ లేకుండా అయిపోవద్దు. అదృష్టం ఎక్కువ రోజులు పరీక్షించుకోవద్దు ప్రాక్టికల్ గా ఉండాలి అని చెప్పేవాళ్లు. అదృష్టమో, కష్టమో అన్నయ్య ఫిలిమ్ స్కూల్ లో ఉండగానే ఛాన్స్ వచ్చింది" అని చెప్పారు నాగబాబు.
అన్నయ్య, కల్యాణ్ బాబు సినిమాలు చూస్తుంది...
"అమ్మ సినిమాలు బాగా చూస్తుంది. ఇప్పటికి కూడా అన్నయ్య, కల్యాణ్ బాబు, చరణ్, తేజ్ బాబు, వరుణ్ తేజ్ అందరి సినిమాలు చూస్తుంది. ఆమె చాలా గర్వంగా ఫీల్ అవుతుంది మమ్మల్ని చూసి. ఆమెకు ఏంటంటే? అందరూ ఫోన్ చేసి మాట్లాడాలి.. కలవాలి. నేను రోజు ఫోన్ చేసి, అమ్మని కలుస్తుంటాను. అన్నయ్య దగ్గరే ఉంటుంది కాబట్టి అన్నయ్య కలుస్తారు. కల్యాణ్ బాబు మాత్రం వెళ్లడు.. వెళ్తే ఒక పూట లేదా ఒక రోజు అమ్మ దగ్గరే ఉండిపోతాడు. నేను మాత్రం 15 రోజులకి ఒకసారి వెళ్లి ఆమెకి ఉన్న వెలితిని తీర్చేసి వస్తాను. కబుర్లు చెప్పి ఒక గంట ఉంటాను. చెల్లెల్లు ఇద్దరూ ఆడపిల్లలు కదా.. ఎక్కువ కలుస్తుంటారు. ఆవిడకి ఒక్కటే ఆశ.. ఎప్పుడూ మీరు ముగ్గురు కలిసి ఉండాలిరా. ఆనందంగా ఉండాలిరా అంటుంది. ఎప్పుడైనా మా మధ్య ఏమైనా అవుతుందేమో ఇష్యూ వస్తుందేమో అని ఆమెకు భయం."
ఆమె వల్లే ఇలా ఉన్నాం..
"ఎలాఉండాలి? ఎలా ఆలోచించాలి చెప్పేంత అనుభవం అమ్మకి లేదు. కానీ, ఏంటంటే అందరూ కలిసి ఉండాలి అంటారు. ఇంత వయసు వచ్చినా కూడా మేం వెళ్లి ఆమె పక్కన నిద్రపోతాం ఇప్పటికీ. అంతే ఆమెను హత్తుకుని పడుకుంటాం. అమ్మ దగ్గరికి వెళ్లగానే మా ఏజ్ మాకు గుర్తరాదు. చాలా లవబుల్ పర్సన్. ఆమె చూపించే ప్రేమ తెలియకుండా మా ఐదుగరి మధ్య ఒక గట్టి బాండ్ ఏర్పడేలా చేసింది. మా ఐదుగురి మధ్య ఏవైనా చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వచ్చినా అక్కడికే ఆగిపోతాయి తప్ప.. బాండింగ్ అలానే ఉంటుంది. అది కేవలం అమ్మ కోసమే. నా కొడుకులు, కూతుళ్లు చాలా బలంగా ఉంటారనే నమ్మకం ఆమెకు ఉంది. ఆమె మాకు వేసిన బంధం అన్ బ్రేకబుల్. మా అమ్మ మా మధ్య బిల్డ్ చేసిన బాండింగ్ అలాంటిది. అన్నయ్య వయసులో పెద్దవారు కాబట్టి... ఆయన మాకు నాన్న అనే ఫీలింగ్. నేను కల్యాణ్ బాబు అలానే ఫీల్ అవుతాం. అన్నయ్య కూడా కొడుకులా చూసుకుంటారు. దానికి కారణం.. ఆమె మమ్మల్ని అలా చూసుకుంది. చూసుకుంటుంది" అని నాగబాబు చెప్పారు.
Also Read: ఎవరికీ తలవంచని పర్వతం దివికేగింది.. రామోజీరావుకు చిరంజీవి, పవన్ కళ్యాణ్ నివాళులు