Muttiah Muralitharan : '800' దర్శకుడికి ఓ కండిషన్ పెట్టిన ముత్తయ్య మురళీధరన్
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ '800' అక్టోబర్ 6న విడుదల కానుంది. మరి, ఈ సినిమాలో నిజం ఎంత? ఫిక్షన్ ఎంత? అని అడిగితే... ఆయన ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.
నిజ జీవితం కథలు, వాస్తవ ఘటనలు, అంశాలను వెండి తెరపై ఆవిష్కరించే క్రమంలో కొంత ఫిక్షన్, మసాలా యాడ్ చేయడం కొన్ని బయోపిక్స్ విషయంలో జరిగింది. మరి, '800' విషయంలో ఏం జరిగింది? అంటే... అటువంటిది ఏమీ లేదని లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. ఆయన బాల్యం నుంచి 800వ వికెట్ తీసే వరకు జరిగిన కథను వెండితెరపై ప్రేక్షకులకు చూపించనున్నారు. ఈ సినిమాతో వెంకట్ ప్రభు దగ్గర దర్శకత్వ శాఖలో కొన్నేళ్లుగా పని చేస్తున్న ఎంఎస్ శ్రీపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిజానికి, ఈ సినిమా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కాలి. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకొన్నారు.
''నా ఫౌండేషన్ ద్వారా శ్రీలంకలో ప్రజలకు సహాయం చేస్తున్నాను. అక్కడి తమిళ ప్రజలకు సాయం చేయడానికి దర్శకుడు వెంకట్ ప్రభు ఓసారి వచ్చారు. నా భార్య మదిమలర్, ఆయన చిన్ననాటి నుంచి స్నేహితులు. నా జీవితం గురించి తెలిశాక, నేను సాధించిన ఘనతలు విని సినిమా తీద్దామని ప్రతిపాదించారు. అందుకు నేను అంగీకరించలేదు. అయితే... సినిమా తీయడం ద్వారా ఫౌండేషన్ గురించి కూడా ఎక్కువ మందికి తెలుస్తుందని నా మేనేజర్ కన్వీన్స్ చేయడంతో ఓకే చెప్పా. కొన్ని కారణాల వల్ల వెంకట్ ప్రభు, నిర్మాత సినిమా నుంచి వాకవుట్ అయ్యారు. అప్పటికి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన శ్రీపతితో కథ రాయమని నేను చెప్పా. విజయ్ సేతుపతి హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో చేయాలనుకున్నాం. అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత మధుర్ మిట్టల్ హీరోగా సినిమా మొదలైంది'' అని ముత్తయ్య మురళీధరన్ వివరించారు.
మసాలాలు వద్దని దర్శకుడికి చెప్పేశా
'800'లో వాస్తవం ఎంత? ఫిక్షన్ ఎంత? అని ప్రశ్నించగా... ''నేను సినిమా స్క్రిప్ట్ 4, 5 సార్లు చదివా. నా జీవితాన్ని తెరకెక్కించేటప్పుడు... అందులో ఎటువంటి మసాలా ఉండకూడదని నిర్ణయించుకున్నా. వాస్తవంగా జరిగిన కథ మాత్రమే సినిమాలో ఉండాలని దర్శక, నిర్మాతలకు కండిషన్ పెట్టాను. నా జీవితమే ఓ సినిమాలా ఉంటుంది. మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా ఇంత సహజంగా ఓ కథ ను రాయలేడని నా నమ్మకం. '800'లో ఫిక్షన్ అసలు లేదు! పూర్తిగా క్రికెట్ చూపించలేదు. ఈ సినిమాలో క్రికెట్ 20 శాతమే, మిగతా 80 శాతం నా జీవితమే. ప్రజలకు తెలియని నా బాలం, ప్రయాణం, వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్న పరిస్థితులు, నా దేశంలో పరిస్థితులను చూపించాం'' అని చెప్పారు.
షూటింగుకు ఒక్కసారి వెళ్ళానంతే...
సినిమా చూడలేదు! థియేటర్లలో చూస్తా!
తానింకా '800' సినిమా చూడలేదని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. థియేటర్లలో చూడాలని అనుకుంటున్నట్లు, కొత్త సినిమా చూస్తున్న ఫీల్ మిస్ కాకూడదని తానూ కోరుకుంటున్నట్లు వివరించారు. చిత్రీకరణకు కూడా వెళ్ళలేదని ఆయన చెప్పారు. ''ఒక్కసారి మాత్రమే షూటింగుకు వెళ్ళా. మా తల్లిదండ్రుల ఇంట్లో చిత్రీకరణ చేస్తున్నారు. ఆ సమయంలో నేను అక్కడికి దగ్గరలో ఉన్నాను. అందుకని, వెళ్ళా'' అని ముత్తయ్య తెలిపారు. '800'లో తన పాత్ర పోషించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ లుక్స్ పరంగా 60, 70 శాతం... తన హావభావాలు పట్టుకోవడంలో 70 శాతం మ్యాచ్ చేశాడని చెప్పారు.
Also Read : హీరో నానికి ఆ లెజెండరీ క్రికెటర్ ఫ్యాన్ - ఆయన ఎవరో తెలుసా?
చిత్రసీమలో 35 ఏళ్ళ అనుభవం ఉన్న శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో '800' ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండటం తనకు సంతోషంగా ఉందన్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషలతో పాటు శ్రీలంక ప్రజల కోసం సింహళీ భాషలో కూడా సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు.
Also Read : 'స్కంద' కోసం రామ్ ఎన్ని కిలోల బరువు పెరిగారో తెలుసా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial