అజీత్‌ను టాలీవుడ్‌కు పరిచయం చేసింది చిరంజీవే - ఇప్పుడు అతడి రీమేక్ మూవీలో!
తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ఏకైన తెలుగు సినిమా 'ప్రేమ పుస్తకం'. ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి ప్రమోట్ చేసారు. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తమిళ హీరో అజిత్ కుమార్ బ్లాక్ బస్టర్ మూవీ 'వేదాళం' రీమేక్ గా మెహర్ రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా, భారీ పరాజయం దిశగా పయనిస్తోంది. దీంతో రెండు సినిమాలను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరు - అజిత్ లకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్న అజిత్ కుమార్.. కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు సినిమా చేసారు. అయితే ఆ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి ప్రమోట్ చేశారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. అజిత్ 1993లో 'అమరావతి' అనే తమిళ్ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. అదే ఏడాది తెలుగులో గొల్లపూడి మారుతీరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో 'ప్రేమ పుస్తకం' అనే సినిమా వచ్చింది. ఈ రెండు చిత్రాలూ ఒక నెల రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి.
అప్పటికే 'మెగాస్టార్' గా వెలుగొందుతున్న చిరు.. గొల్లపూడితో ఉన్న సాన్నిహిత్యంతో 'ప్రేమ పుస్తకం' సినిమా పబ్లిసిటీకి తనవంతు సపోర్ట్ ఇచ్చారు. 'అజిత్ కుమార్ - కాంచనలకు చిరంజీవి ఆశీస్సులు అందజేసారు.. ప్రేక్షకులు ఆయన మాటకు తదాస్తు పలుకుతూ ఈ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్నారంటూ వాల్ పోస్టర్స్ అంటించి ప్రమోట్ చేసారు. దీనికి సంబంధించిన ఓల్డ్ ఫోటోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అప్పుడు అజిత్ సినిమాని ఆశీర్వదించిన మెగాస్టార్.. 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అజిత్ నటించిన 'వేదాళం' చిత్రాన్ని రీమేక్ చేసారు. కాకపోతే అక్కడ హిట్టైన సినిమా ఇక్కడ ప్లాప్ అయింది.
అజిత్ విషయానికొస్తే.. హైదరాబాద్ లో పుట్టి పెరిగి ఆయన, 'ప్రేమ పుస్తకం' సినిమాతోనే హీరోగా లాంచ్ అవ్వాల్సి ఉంది. ఈ మూవీ సెట్స్ మీద ఉన్నప్పుడే దర్శకుడు గొల్లపూడి శ్రీనివాస్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఆ చిత్రాన్ని తాత్కాలికంగా కొంత కాలం నిలిపివేశారు. ఆ గ్యాప్ లో తమిళంలో 'అమరావతి' సినిమా చేసిన అజిత్.. అదే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత గొల్లపూడి మారుతీ రావు మిగిలిన భాగానికి దర్శకత్వం వహించి 'ప్రేమ పుస్తకం' చిత్రాన్ని విడుదల చేసారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అజిత్ మాదిరిగానే చిరంజీవి కూడా నటుడిగా ఒక సినిమాతో పరిచయం కావాల్సింది. మరో చిత్రంతో ముందుగా బిగ్ స్క్రీన్ మీదకు వచ్చారు. ఆయన డెబ్యూ మూవీ 'పునాది రాళ్లు' కంటే ముందు 'ప్రాణం ఖరీదు' సినిమా రిలీజ్ అయింది. ఆ విధంగా అజిత్ - చిరుల మధ్య సారూప్యత కనిపిస్తోంది. అజిత్ కుమార్ ఆరంగేట్రం చేసిన 'ప్రేమ పుస్తకం' సినిమానే అతని మొదటి, చివరి తెలుగు చిత్రం. ఆ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్స్ లో నటించలేదు. కేవలం డబ్బింగ్ సినిమాలతోనే అలరిస్తూ వస్తున్నారు. 'ప్రేమలేఖ' 'ఉల్లాసం' 'ప్రియురాలు పిలిచింది' 'వాలి' 'విశ్వాసం' 'వివేకం' 'తెగింపు' వంటి చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
Also Rea: 'భోళా శంకర్' హిందీ టీజర్ రిలీజ్ - తెలుగులో అట్టర్ ప్లాపైన చిత్రాన్ని హిందీలో చూస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial