Manchu Manoj: మా అన్న కెరీర్ కోసం నన్ను వాడుకున్నారు... ఆడవేషం వేయించారు... కన్నీటి పర్యంతమైన మంచు మనోజ్
Manchu Manoj : మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. "మా అన్న కెరియర్ కోసం నన్ను వాడుకున్నారు. ఆయన కోసమే ఆడవేషం వేశాను అంటూ మంచు విష్ణుపై మనోజ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

మంచు ఫ్యామిలీ వార్ మళ్ళీ మొదలైంది. తన కారు పోయిందని పేర్కొంటూ మంచు మనోజ్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంతో వార్తల్లో నిలిచింది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ ఇదంతా తన సోదరుడు విష్ణు కావాలని చేయిస్తున్నాడని ఆరోపిస్తూ, జల్ పల్లి లోని మోహన్ బాబు నివాసం గేటు బయట బైఠాయించి, నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
మనోజ్ ఎమోషనల్ కామెంట్స్
మంచు మనోజ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ "ఇదంతా అసలు ఆస్తి గొడవ కాదు. విద్యార్థుల భవిష్యత్తు గురించి జరిగిన గొడవల నుంచే మొదలైంది. డిసెంబర్ నుంచి ఇన్ని గొడవలు జరుగుతుంటే పోలీసులు ఇప్పటిదాకా ఒక్క ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. గన్ లు, కత్తులతో రౌడీలు మమ్మల్ని కొట్టడానికి వచ్చిన సాక్షాధారాలు సైతం పోలీసులకు అందించాను. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్లడానికి కోర్టు అనుమతించినప్పటికీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. మోహన్ బాబు చెబితేనే ఇంట్లోకి వెళ్ళనిస్తాము అంటున్నారు.
నేను ఊర్లో లేనప్పుడు నా వస్తువులన్నీ ఎత్తుకెళ్లారు. నన్ను ఇంట్లోకి వెళ్ళనివ్వండి. ఆ ఇంట్లో ఉన్న మూడు పెట్స్ ఉన్నాయి. వాటిని ఇవ్వమని అడుగుతున్నాను. ఏ రోజూ నేను ఆస్తి కోసం గొడవ పడలేదు. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. విష్ణుకి నేను అంటే కుళ్ళు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. తప్పుడు సంతకాలతో కోర్టులను సైతం పక్కదారి పట్టిస్తున్నారు. ఇక అన్న కెరియర్ కోసం నన్ను వాడుకున్నారు. మా నాన్న కోరిక మేరకే అన్న కోసం ఆయన సినిమాలో ఆడవేషం కూడా వేశాను. బయట ప్రొడక్షన్లో హిట్టు కొట్టినా సరే తీసుకొచ్చి సొంత నిర్మాణ సంస్థలో సినిమా చేయమని అడిగేవారు. వాళ్ళ కోసం గొడ్డు చాకిరీ చేసినప్పటికీ ఇంతగా దిగజారుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి నా సమస్యను పరిష్కరించమని విన్నవించుకుంటున్నాను" అంటూ ఎమోషనల్ అయ్యారు.
మోహన్ బాబు, విష్ణు ఎక్కడ ?
మనోజ్ ఇంకా మాట్లాడుతూ "కన్నప్పకు పోటీగా భైరవం సినిమాను రిలీజ్ చేద్దాం అనుకున్నాను. అందుకే కన్నప్ప సినిమాను విష్ణు వాయిదా వేసుకున్నాడు. తనపై కోపం తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు" అంటూ ఆరోపించాడు. ఇప్పుడు మంచు మనోజ్ జల్ పల్లి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు మోహన్ బాబు, ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు, ప్రభుదేవా తదితరులతో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. అక్కడ మోహన్ బాబు, మంచు విష్ణు 'కన్నప్ప' మూవీ గురించి చర్చించినట్టు సమాచారం. కాగా 'కన్నప్ప' మూవీని వాయిదా వేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీని ఏప్రిల్ 25 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తామని ముందు అనౌన్స్ చేశారు. వీఎఫ్ఎక్స్ పెండింగ్ వర్క్ కారణంగా 'కన్నప్ప'ను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు చిత్ర బృందం అఫిషియల్ గా వెల్లడించింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

