‘నన్నెందుకు సెలక్ట్ చేయలేదు?’ సెలక్టర్లపై స్టార్ పేసర్ సీరియస్
ఆస్ట్రేలియా టూర్‌కోసం తనని కన్‌సిడర్ చేయకపోవడంపై టీమిండియా వెటరన్ పేసర్ మహమ్మద్ షమీ సెలక్టర్లపై సీరియస్ అయ్యాడు. ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం సెలెక్షన్ కమిటీ రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. అందులో వన్డే స్క్వాడ్‌లో వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ప్లేస్ దక్కగా.. షమీని సెలెక్ట్ చేయలేదు. దాంతో షమి ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడేమో అనుకున్నారంతా. కానీ రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన షమీ.. తన ఫిట్‌నెస్‌పై క్లారిటీ ఇచ్చాడు. తాను ఫిట్‌గానే ఉన్నానని, బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఆడేందుకూ రెడీగా ఉన్నాన్న షమి.. అయినా తనని ఎందుకు సెలక్ట్ చేయలేదో అర్థం కావడం లేదన్నాడు. టీమ్ సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని, ఈ విషయంపై ఇంకా మాట్లాడి ఇష్యూ చేయాలనుకోవడం లేదని అన్నాడు. ‘నాకేమైనా ఫిట్‌నెస్ సమస్యలు ఉంటే బెంగాల్ తరఫున రంజీ క్రికెట్ ఎందుకు ఆడుతాను? టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడి వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. రంజీ ట్రోఫీలో నాలుగు రోజుల మ్యాచ్ ఆడగలిగినప్పుడు 50 ఓవర్ల క్రికెట్‌లోనూ బరిలోకి దిగగలను. ఫిట్‌నెస్ గురించి చెప్పడం.. అడగడం.. సమాచారం ఇవ్వడం నా బాధ్యత కాదు. పనికాదు. ఎన్‌సీఏకు వెళ్లి సిద్దమవడం.. మ్యాచ్‌లాడటమే నా పని. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ రెగ్యులర్‌గా ఆడుతున్నా. అయినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. దానికి నేనేం చేయలేను'అని షమీ అనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ఈ కామెంట్స్‌తో షమి ఫ్యాన్స్ కూడా సెలక్షన్ కమిటీపై సీరియస్ అవుతున్నారు. ‘ఇంకెంతమంది ప్లేయర్ల జీవితాలతో ఆడుకుంటారు?’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.





















