Sajjanar Warning: పిల్లలతో అలాంటి ఇంటర్యూలు చేసే వారికి సజ్జనార్ హెచ్చరిక - ఇక నుంచి కనిపిస్తే బయటపడలేని విధంగా కేసులే!
Sajjanar: పిల్లలతో అసభ్య వీడియోలు తీస్తున్న వారికి పోలీస్ కమిషనర్ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు.వ్యూస్ కోసం దిగజారిపోతే పోక్సో కేసులు పెడతామనిప్రకటించారు.

Police Commissioner Sajjanar warns Youtubers: సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించుకోవడానికి అలవాటు పడిన వారు దారి తప్పుతున్నారు. చిన్న పిల్లలతో ఇంటర్యూలు చేయించి వారితో అసభ్యకరమైన పనులు చేయిస్తున్నారు. తాము ప్రేమించుకుంటున్నామని చెప్పి వారితో ముద్దులు పెట్టించడం వంటి పనులు చేయిస్తున్నారు. వ్యూస్ కోసం ఇలాంటివి చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి వీడియోలు వైరల్ అయినప్పుడు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా తీవ్రంగా స్పందించారు.
వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా అని సజ్జనార్ ప్రశ్నించారు. వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం సమంజసం కాదన్నారు. వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని.. అలాంటి వీడియోలు చేసే వారిని ప్రశ్నించారు. చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దని హెచ్చరించారు.
గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు — క్షమార్హం.. చట్టరీత్యా నేరమని.. ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుందన్నారు. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. తక్షణమే వీటిని తొలగించకున్నా.. భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని ప్రకటించారు.
వ్యూస్ మాయలో విలువలు మరిచిపోతే ఎలా!?
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 16, 2025
వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!?
వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!?
చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా… pic.twitter.com/flvJeg4EHy
సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు.
తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దని సూచించారు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించాలన్నారు.
ఏఐ వీడియోలతో కొంత మంది రెచ్చిపోతున్నారు. అత్యం.త అసభ్యకమరైన మాటలతో వీడియోలు తయారు చేసి పెడుతున్నారు. వారి సంగతి కూడా చూడాలని నెటిజన్లు సజ్జనార్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.





















