VVIP Security: రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల రక్షణ ఎలా ఉంటుందో తెలుసా? షాకింగ్ నిజాలు!
మన దేశంలో ముఖ్యమైన వ్యక్తులకు (VVIPలు, VIPలు) వారిపై ఉన్న ముప్పు (Threat Perception) ఆధారంగా భద్రతను కల్పించే పద్ధతిని ఆరు గ్రేడ్‌లుగా విభజించారు. ఈ భద్రత ఆయా వ్యక్తుల హోదాను బట్టి ఉంటుంది.

VVIP Security: భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులకు ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తారు? ఎస్పీజీ, జెడ్ ప్లస్, జెడ్ వంటి కేటగిరీలు ఎన్ని ఉన్నాయి? ఈ కేటగిరీలో ఉండే వీవీఐపీలకు భద్రత ఎలా ఉంటుంది? అన్న విషయాలు మీకు తెలుసా? ఈ ఆసక్తికరమైన కథనం పూర్తిగా చదివితే మన దేశంలో వీవీఐపీ భద్రత ఎలా ఉంటుందన్న విషయాలు పూర్తిగా తెలుస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? మీ కంటికి పని చెప్పి, ఈ పూర్తి వివరాలు తెలుసుకోండి.
మన దేశంలో ప్రధానమంత్రి హోదాలో ఉండగానే ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దారుణంగా హత్యకు గురయ్యారు. ఇక ముఖ్యమంత్రి హోదాలో ఏపీ సీఎం చంద్రబాబు నక్సల్ దాడికి గురై ప్రాణాలతో బయటపడ్డారు. దీన్ని బట్టి మన దేశంలో వీవీఐపీలకు, వీఐపీల ప్రాణాలకు ఎంతటి ప్రమాదం పొంచి ఉందో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలు. వీటి నుంచి పాఠాలు నేర్చుకున్న భద్రతా సంస్థలు వీఐపీ భద్రతకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాయి. అయితే, మన దేశంలో ముఖ్యమైన వ్యక్తులకు (VVIPలు, VIPలు) వారిపై ఉన్న ముప్పు (Threat Perception) ఆధారంగా భద్రతను కల్పించే పద్ధతిని ఆరు గ్రేడ్‌లుగా విభజించారు. ఈ భద్రత ఆయా వ్యక్తుల హోదాను బట్టి ఉంటుంది. ఈ భద్రతను సాధారణంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), రాష్ట్ర పోలీసుల ద్వారా కల్పిస్తారు.
భద్రతను కల్పించే గ్రేడ్‌లు ఇవే...
1. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) భద్రత: ఇది అత్యున్నత భద్రత కల్పించే గ్రేడ్. ఈ గ్రేడ్ రక్షణలో వీవీఐపీకి ఎంత మంది భద్రత ఇస్తారన్నది పూర్తిగా రహస్యంగా ఉంచుతారు. అత్యంత కఠిన శిక్షణ పొందిన, మెరికల్లాంటి కమాండోలు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపులో ఉంటారు. ప్రస్తుతం ఉన్న భారత ప్రధానమంత్రికి మాత్రమే ఈ భద్రత కల్పిస్తారు. గత చట్టాల ప్రకారం మాజీ ప్రధానమంత్రులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా SPG భద్రత ఉండేది, కానీ 2019 సవరణ తర్వాత అది ప్రధానమంత్రికి మాత్రమే పరిమితం చేయడం జరిగింది.
2. Z+ (జెడ్ ప్లస్) కేటగిరీ భద్రత: ఎస్పీజీ తర్వాత మన దేశంలో వీఐపీలకు కల్పించే రెండో అత్యున్నత స్థాయి భద్రత. ఇందులో 55 మంది వరకు భద్రతా సిబ్బంది ఉంటారు. నిఘా, ఎస్కార్టును ఈ జెడ్ ప్లస్ కేటగిరీ వీఐపీలు పొందుతారు. ఈ 55 మందిలో పది మందికి పైగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) కమాండోలు ఉంటారు. వీరిని 'బ్లాక్ క్యాట్స్' అని కూడా పిలుస్తారు. వీరు అత్యంత కఠినమైన యుద్ధ పోరాటాల్లో శిక్షణ పొందిన వారు. వీరు వీఐపీకి రక్షణ వలయంగా ఉంటారు. వీరితో పాటు వ్యక్తిగత భద్రతాధికారులు (PSOs) 5 నుంచి 10 మంది వరకు ఈ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా ఉంటారు. వీరు కమాండోలు లేదా సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) నుంచి తీసుకుంటారు. వీరు వీఐపీకి నిత్యం దగ్గరగా ఉండి తక్షణ రక్షణ ఏర్పాట్లను అందించడానికి సిద్ధంగా ఉంటారు. ఇక, వీరితోపాటు ఇతర సాయుధ సిబ్బంది సుమారు 30 నుంచి 40 మంది వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), లేదా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) వంటి CAPF బలగాల నుంచి ఎంపిక చేస్తారు. ఈ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉండే భద్రతా సిబ్బందిలో వీరే అధిక సంఖ్యలో ఉంటారు. ఇక వీరితోపాటు వీఐపీ వాహనం రక్షణకు ఎస్కార్ట్/సెక్యూరిటీ డ్రైవర్లు 5 నుంచి 10 మంది వరకు ఉంటారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడానికి, ఎస్కార్ట్ వాహనాల్లో ఉండే సిబ్బంది జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో భాగంగా ఉంటారు. ఇక వీరితో పాటు వీఐపీ పర్యటనలో రాష్ట్ర పోలీసులు స్థానిక సిబ్బందిని అవసరాన్ని బట్టి ట్రాఫిక్ రూట్స్ తెలియజేయడానికి ఎస్కార్టుగానూ, అవసరమైన చోట రక్షణగానూ ఉంచుతారు. కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖేష్ అంబానీ వంటి అతిపెద్ద పారిశ్రామికవేత్తలు ఈ కేటగిరీలో ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ హోం ఎఫైర్స్ సూచనల మేరకు ఈ భద్రత కల్పించడం జరుగుతుంది.
3. Z (జెడ్) కేటగిరీ భద్రత: జెడ్ ప్లస్ తర్వాత ఉన్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇందులో కమాండోలు, ఎస్కార్టు వాహనం ఏర్పాటు చేస్తారు. దాదాపు 22 మంది వరకు భద్రతా సిబ్బంది ఈ కేటగిరీలో వీఐపీకి భద్రత కల్పిస్తారు. నలుగురు నుంచి ఆరుగురు వరకు ఎన్.ఎస్.జి. కమాండోలు లేదా సీఆర్పీఎఫ్ కమాండోలు భద్రతా సిబ్బందిలో ఉంటారు. వీరు వీఐపీకి తక్షణ భద్రతను కల్పిస్తారు. ఇక వీరితో పాటు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) (CRPF, ITBP, CISF) లేదా రాష్ట్ర పోలీసు సిబ్బంది ఉంటారు. వీరు భద్రతా వలయాన్ని పటిష్టం చేయడానికి, ఎస్కార్ట్ విధుల కోసం ప్రత్యేకింపబడిన వారు. ఈ జెడ్ కేటగిరీ భద్రతలో 22 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల రక్షణ కల్పిస్తారు. మూడు షిఫ్టుల్లో వీరు వీఐపీ భద్రత కోసం పని చేస్తారు. ఈ భద్రతా వలయంలో ఎస్కార్టుతో పాటు ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ జెడ్ కేటగిరీ భద్రత అధిక స్థాయిలో ముప్పు (High Threat Perception) ఉన్న ప్రముఖ వ్యక్తులకు, ముఖ్య రాజకీయ నాయకులకు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, గవర్నర్లకు, న్యాయమూర్తులకు, లేదా సీనియర్ ప్రభుత్వ అధికారులకు కల్పిస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచన మేరకు కేంద్ర హోం శాఖ ఈ భద్రత కల్పించడంపై నిర్ణయం తీసుకుంటుంది.
4. Y+ (వై ప్లస్) కేటగిరీ భద్రత: ఈ స్థాయి భద్రతను మధ్యస్థాయి ముప్పు ఉన్నవారికి ఏర్పాటు చేస్తారు. ఈ కేటగిరీలో 11 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) (CRPF లేదా CISF) నుంచి కమాండోలు 2 నుంచి 4 మంది ఉంటారు. వీరు వీఐపీలకు తక్షణ భద్రతను కల్పించేందుకు సిద్ధంగా ఉంటారు. వీరికి వ్యక్తిగత భద్రతాధికారులు (PSOs) ముగ్గురు ఉంటారు. రక్షిత వ్యక్తికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటూ, రొటేషన్ పద్ధతిలో పని చేసే సాయుధ సిబ్బందిగా ఈ ముగ్గురు వ్యవహరిస్తారు. ఇక, ఈ భద్రతా వలయాన్ని పటిష్టం చేసేందుకు మరో నలుగురు నుంచి 6 మంది వరకు సాయుధ సిబ్బంది, ఎస్కార్టు విధులకు కేటాయిస్తారు. అధిక ముప్పు ఉంటే వీరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అందుబాటులో ఉంచుతారు, కానీ తప్పనిసరిగా ఈ కేటగిరీలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా మధ్యస్థ (Moderate) నుంచి కొంత అధిక స్థాయి ముప్పు ఉన్న రాజకీయ నాయకులకు, ప్రముఖులకు లేదా ఉన్నతాధికారులకు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అంచనా ఆధారంగా ఈ రక్షణ కల్పిస్తారు.
5. Y (వై) కేటగిరీ భద్రత: వీఐపీలలో తక్కువ ముప్పు ఉన్న వారికి వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేస్తారు. ఇందులో గార్డులు మాత్రమే ఉంటారు. ఒకరిద్దరు కమాండోలు మాత్రమే ఈ కేటగిరీలో ఉంటారు. వీరిని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) (CRPF లేదా CISF) నుంచి తీసుకుంటారు. వీరు ముప్పు పొంచి ఉన్న వీఐపీకి తక్షణ భద్రతను అందిస్తారు. మరో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు (PSOs) ఉంటారు. వీరు ప్రధానంగా సాయుధ సిబ్బంది, రొటేషన్ పద్ధతిలో పనిచేస్తూ రక్షిత వ్యక్తికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారు. ఇతర సాయుధ సిబ్బంది నలుగురు నుంచి ఐదుగురు వరకు ఉంటారు. వీరు ప్రధానంగా భద్రతా వలయాన్ని పూర్తి చేయడానికి, ఎస్కార్ట్ విధుల కోసం కేటాయిస్తారు. తక్కువ స్థాయి (Low) నుంచి మధ్యస్థ (Moderate) ముప్పు ఉన్న ప్రముఖ వ్యక్తులకు, లేదా స్థానిక నాయకులకు ఇంటెలిజెన్స్ నిఘా అంచనా ఆధారంగా ఈ రక్షణ కల్పిస్తారు.
6. X (ఎక్స్) సాధారణ భద్రతా కేటగిరీ: ఈ కేటగిరీ భద్రతలో ఉండే వీఐపీకి వ్యక్తిగత భద్రతాధికారులు (PSOs) ఇద్దరు రక్షణ కల్పిస్తారు. వీరు రాష్ట్ర పోలీసుల నుంచి ఉండే సాయుధ సిబ్బంది. వీరు వీఐపీకి దగ్గరగా ఉండి భద్రతను ఇస్తారు. ఈ కేటగిరీలో కమాండోలు ఉండరు. వ్యక్తిగత భద్రత అధికారులే రొటేషన్ పద్ధతిలో 24 గంటలు రక్షణ కల్పిస్తారు. ఈ కేటగిరీలో ఎస్కార్ట్ వాహనాలు గానీ, ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు గానీ ఏర్పాటు చేయరు. తక్కువ స్థాయి ముప్పు (Low Threat Perception) ఉన్న వ్యక్తులకు లేదా వారి జీవితానికి ముప్పు ఉందని ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు భావించినప్పుడు ఈ భద్రతను కేటాయిస్తారు.
భద్రత కల్పించేందుకు ముప్పు అంచనానే ముఖ్య కారణం
భారత దేశంలోని వీవీఐపీలకు, వీఐపీలకు ముప్పు పొంచి ఉన్న స్థాయిని బట్టి ఏ కేటగిరీ భద్రత ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుంది. ఇందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) కింద పనిచేసే నిఘా సంస్థలు (Intelligence Agencies) ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మరియు రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) ఇచ్చే నివేదికల ఆధారంగా వ్యక్తికి ఉన్న ముప్పు స్థాయి (Threat Perception) ని అంచనా వేసి ఈ గ్రేడ్‌లను కేటాయిస్తారు. ముప్పు స్థాయి పెరిగితే, భద్రతా గ్రేడ్ కూడా పెరుగుతుంది.






















