Mani Ratnam Rajamouli: ఒకే వేదికపై మణిరత్నం, రాజమౌళి - జక్కన్నకు ఊహించని కాంప్లిమెంట్
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకు ప్రేరణ రాజమౌళి అన్నారు దర్శకుడు మణిరత్నం. జక్కన్న ‘బాహుబలి’ని తెరకెక్కించకపోయి ఉంటే తన సినిమా వచ్చేది కాదన్నారు.
‘RRR’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు రాజమౌళి. ఆయన దర్శకత్వ ప్రతిభకు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్, స్పీల్‌బర్గ్ సైతం ఫిదా అయ్యారు. మరెన్నో అద్భుత చిత్రాలు తీయాలని ఆకాంక్షించారు. తాజాగా జక్కన్నపై ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు కురిపించారు. రాజమౌళి దర్శకత్వం, సినిమా పట్ల ఆయనకున్న కమిట్మెంట్ తనకు ఎంతో ప్రేరణగా నిలిచిందన్నారు. ఆయనను స్పూర్తిగా తీసుకొనే ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు.
‘బాహుబలి’ స్పూర్తితో ‘పొన్నియిన్ సెల్వన్’ తీశా- మణిరత్నం
రీసెంట్ గా చెన్నై వేదికగా సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ జరిగింది. ఇందులో ‘ఫ్యూచర్ సినిమా ట్రెండ్’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. దర్శకులు మణిరత్నం, రాజమౌళి, సుకుమార్ ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రేక్షకుడు మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన అంశం ఏంటో చెప్పాలని మణిరత్నంను అడిగారు. దానికి సమాధానం చెప్తూ ఆయన రాజమౌళిని ప్రశంసించారు. “నన్ను అత్యంత ప్రభావించం చేసిన వ్యక్తి రాజమౌళి అనుకుంటున్నా. ఎందుకంటే నేను మీకు చెప్తాను. వాస్తవానికి నేను ‘పొన్నియిన్ సెల్వన్’ అనే ఈ సినిమాని తీయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. ‘బాహుబలి’ వచ్చే వరకు నాకు సరైన మార్గం దొరకలేదు. ఆ సినిమా గొప్పతనం ఏంటంటే రెండు భాగాలుగా రావడం. ఆ రెండు భాగాలు కూడా ప్రేక్షకులను అత్యద్భుతంగా ఆకట్టుకోవడం. ‘బాహుబలి’ రెండు భాగాలుగా రాకపోతే నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చేసి ఉండేవాడిని కాదు. అందుకే, రాజమౌళికి థ్యాంక్స్” అని చెప్పారు. మణిరత్నం సమాధానంతో చర్చా వేదిక మీద ఉన్నవారితో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. దర్శకుడు రాజమౌళి సైతం షాక్ అయ్యారు. “సార్, ఇది నేను మీ నుంచి పొందగలిగిన అతి పెద్ద కాంప్లిమెంట్” అని రాజమౌళి చెప్పారు.
విడుదలకు రెడీ అవుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ 2’
‘పొన్నియిన్ సెల్వన్’ కథను కల్కి కృష్ణమూర్తి మొత్తం 5 భాగాలుగా రాశారు. ఎంజీ రామచంద్రన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటులు సైతం ఈ కథతో సినిమా తీయాలని ప్రయత్నించారు. కథకు ఉన్న డ్యురేషన్, బడ్జెట్ సమస్యగా మారడంతో సినిమా చేయలేకపోయారు. ఎట్టకేలకు మణిరత్నం ఈ మూవీని తీర్చిదిద్దారు. రెండు భాగాలుగా విభజించి తెరకెక్కించారు. ‘పొన్నియిన్ సెల్వన్ 1’లో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ, ప్రభు, ఆర్. శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, ప్రకాష్ రాజ్, రెహమాన్, ,ఆర్. పార్తిబన్ కీలక పాత్రలు పోషించారు. ‘పొన్నియిన్ సెల్వన్’ మొదటి భాగం గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రూ. 500కోట్లు వసూలు చేసింది. దీనికి కొనసాగింపుగా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ను ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Read Also: ‘సలార్’కు శృతిహాసన్ గుడ్ బై - ఆధ్య ఎమోషనల్ పోస్టు