Manchu Lakshmi: నాకు సపోర్ట్‌గా ఎవరూ ఉండరు - సారీ యాక్సెప్టెడ్... ఇంటర్వ్యూ కాంట్రవర్శీకి చెక్ పెట్టిన మంచు లక్ష్మి
Manchu Lakshmi Reaction: నటి మంచు లక్ష్మి తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూ వివాదానికి సంబంధించి ఆమెకు క్షమాపణలు చెప్పగా కాంట్రవర్శీకి చెక్ పెట్టారు.

Manchu Lakshmi Reaction On Journalist Apology About Controversial Interview: 'దక్ష' మూవీ ప్రమోషన్లలో భాగంగా నటి మంచు లక్ష్మి రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ ప్రశ్నలు వివాదానికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు కంప్లైంట్ కూడా చేశారు. తాజాగా, సదరు జర్నలిస్ట్ ఆమెకు సారీ చెప్పడంపై మంచు లక్ష్మి రియాక్ట్ అయ్యారు.
'మౌనంగా ఉండాలని అనుకోలేదు'
ఈసారి తాను మౌనంగా ఉండాలని అనుకోలేదని... ఓ వ్యక్తి నుంచి క్షమాపణలు పొందడానికి తనకు 3 వారాల టైం పట్టిందని పోస్ట్ చేశారు మంచు లక్ష్మి. 'నేను ఈసారి మౌనంగా ఉండాలని అనుకోలేదు. ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు. ఈ ఎక్స్‌పీరియన్స్ నన్ను లోతుగా గాయపరిచింది. నాకు కావాల్సింది కేవలం ఓ నిజమైన క్షమాపణ. బాధ్యతను స్వీకరించడం మాత్రమే.
ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ల గొంతుని మూగబోకుండా కాపాడతాయి. నా కంటే ముందు ధైర్యంగా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేను నిలబడి ఉన్నాను. వారి ధైర్యమే నాకు ఈ రోజు బలాన్ని ఇచ్చింది. పత్రికా రంగంపై నాకు చాలా గౌరవం ఉంది. ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపం లాంటివారు. కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు అది ఎంతో బాధ కలిగిస్తుంది. నేను ఇక ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నా. ఇకపై కూడా నా ఆత్మగౌరవంతో నడవబోతున్నా. నిజాయతీతో తన స్టోరీని వినిపించే ప్రతీ మహిళకు గౌరవం తెలియజేస్తూ...' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: 'శశివదనే' రివ్యూ: గోదావరి నేపథ్యంలో రక్షిత్, కోమలీ ప్రేమకథ - సినిమా ఎలా ఉందంటే?
అసలేం జరిగిందంటే?
రీసెంట్‌గా 'దక్ష' మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఓ జర్నలిస్ట్ వయస్సు, డ్రెస్సింగ్ గురించి ప్రశ్నలు అడిగారు. దీనిపై ఇంటర్వ్యూలోనే ఆమె సీరియస్ అయ్యారు. మిగిలిన హీరోలను మీరు ఇలా అడగగలరా అంటూ ఫైర్ అయ్యారు. ఈ వీడియో వైరల్ కావడంతో సదరు జర్నలిస్ట్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సైతం మంచు లక్ష్మి ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమెకు క్షమాపణ చెప్పడంతో వివాదానికి చెక్ పడింది. ఆమెకు సారీ చెబుతూనే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని జర్నలిస్ట్ ట్వీట్ చేశారు.





















