Malayalam Actor Siddique: పరారీలో మలయాళ నటుడు సిద్ధిఖీ... రేప్ కేసులో బెయిల్ ఇవ్వని హైకోర్టు
Arrest Warrant Against Siddique: మలయాళ నటుడు సిద్ధిఖీ మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయ్యింది. ఆయన పరారీలు ఉన్నారు. పోలీసులకు దొరికితే ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు హాట్ టాపిక్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం మలయాళ చిత్ర పరిశ్రమ గురించి హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. అది మరువక ముందు టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టిన కేసు ఆయన అరెస్టుకు కారణం అయ్యింది. మలయాళ పరిశ్రమలోనూ లైంగిక వేధింపుల కేసులో నటుడు సిద్ధిఖీ అరెస్టు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే...
సిద్ధిఖీ మీద రేప్ కేసు పెట్టిన యువ నటి
హాలీవుడ్ ఇండస్ట్రీలో మొదలైన మీటూ (లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నటీమణులు చేపట్టిన ఉద్యమం) మూమెంట్ ఆ తర్వాత ఇండియాలో కూడా వచ్చింది. పలువురు నటీమణులు తమపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలను బయటపెట్టారు. తాజాగా మలయాళ నటుడు సిద్ధిఖీ (Malayalam Actor Siddique) మీద ఒక నటి కేసు పెట్టింది.
తిరువనంతపురంలోని కేరళ ప్రభుత్వానికి చెందిన ఒక హోటల్‌లో 2016లో తనను సిద్ధిఖీ రేప్ చేశారని ఓ నటి పేర్కొంది. దానిపై ఆమె కేసు పెట్టింది. ఆ కేసులో ముందస్తు బయలు కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు సిద్ధిఖీ. అయితే, బెయిల్ నిరాకరించడంతో మంగళవారం నుంచి ఆయన పరారీలో ఉన్నట్లు కేరళ నుంచి సమాచారం అందుతోంది. ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, లుక్ అవుట్ నోటీస్ జారీ చేశారని సమాచారం.
అసభ్యంగా ప్రవర్తించాడని తొలుత ఆరోపణ
ఒక తమిళ సినిమాలో తనకు అవకాశం ఇప్పిస్తానని సిద్ధిఖీ చెప్పాడని... అందుకు బదులుగా తన నుంచి సెక్సువల్ ఫేవర్ ఆశించాడని... అందుకు తాను నిరాకరించడంతో తనపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు అత్యాచారం చేశాడని సదరు నటి ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) సంఘానికి సిద్ధిఖీ జనరల్ సెక్రటరీగా ఎంపిక అయ్యారు. హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధ్యక్షుడిగా మోహన్ లాల్, ఆయన బాడీలో ఉన్న సిద్ధికి కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమె కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
తనపై వచ్చిన అత్యాచారం ఆరోపణలను సిద్ధిఖీ ఖండించారు. సదరు నటి 2019 నుంచి తనపై అసత్య ప్రచారం చేస్తోందని, 2016లో ఒక థియేటర్‌లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు చేస్తుందని, హేమ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అత్యాచారం చేశానని సరికొత్త ఆరోపణ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కేరళ హైకోర్టు నిరాకరించిన తర్వాత సిద్ధిఖీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందని మాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. బుధవారం ఉదయం ఆయన ఫోన్ స్విచ్ ఆన్ చేసినా కాల్స్ రిసీవ్ చేసుకోవడం లేదట. సిద్ధిఖీకి బెయిల్ నిరాకరించిన కొన్ని గంటలకు మలయాళ ఇండస్ట్రీలో మరొక నటుడు ముఖేష్ మీద రేప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ... ఎర్నాకుళం కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఉండటంతో కొన్ని గంటల్లోపే విడుదల అయ్యారు.