Mahi V Raghav - Shaitan : మహి వెంట పడుతున్న ఓటీటీలు - వైఎస్ జగన్ 'యాత్ర 2' ముందు దర్శకుడికి టఫ్ టాస్క్!
'సేవ్ ద టైగర్స్', 'సైతాన్'... రెండు వెబ్ సిరీస్‌లు సక్సెస్ సాధించడంతో దర్శకుడు మహి వి. రాఘవ్ వెంట పడుతున్నాయి ఓటీటీ సంస్థలు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను ఆయన ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి.
ఒక్క సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు... ఏ ఇండస్ట్రీలో అయినా సరే విజయానికి ఎక్కువ విలువ. వరుస విజయాలు వస్తే... అందరి చూపు ఆ విజయాలు సాధించిన వ్యక్తి మీద పడుతుంది. 'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' వెబ్ సిరీస్ (Shaitan Web Series)ల విజయాలతో దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) మీద ఓటీటీ దిగ్గజాల చూపు పడింది.
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టిన మహి!
'సేవ్ ద టైగర్స్' వెబ్ సిరీస్ ఓటీటీ ప్రపంచంలో సంచనలం సృష్టించింది. కామెడీ కథతో భారీ విజయం సాధించవచ్చని నిరూపించింది. దానికి మహి వి రాఘవ్ క్రియేటర్ & ప్రొడ్యూసర్! ఆ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఏప్రిల్ 27న విడుదల అయితే... మహి వి రాఘవ్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'సైతాన్' వెబ్ సిరీస్ జూన్ 15న విడుదల అయ్యింది. 'సేవ్ ద టైగర్స్' కామెడీ అయితే... 'సైతాన్' క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చింది. అసలు రెండిటి మధ్య పోలిక లేదు. రా అండ్ రస్టిక్ సిరీస్ వీక్షకుల ముందుకు తీసుకొచ్చి విజయం సాధించారు.
ఓటీటీకి ఏం తీయాలో మహికి తెలుసు!
'సైతాన్'లో శృంగారాత్మక సన్నివేశాలు, శృతి మించిన పదాలు ఉన్నాయి. అయితే వీక్షకాదరణ సైతం బావుంది. రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వర్గాలు చెబుతున్నాయి. బోల్డ్ కంటెంట్ చొప్పించిన సిరీస్ లు ఏవీ ఈ స్థాయిలో సక్సెస్ సాధించలేదు. బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్... ఈ రెండిటికి తోడు కథలో ఎమోషన్ బావుండటంతో జనాలు చూస్తున్నారు.
ఒకటి కామెడీ... మరొకటి క్రైమ్... రెండూ వేర్వేరు నేపథ్యంలో తీసిన రూపొందిన వెబ్ సిరీస్‌లు. రెండూ విజయాలు సాధించాయి. దాంతో 'ఓటీటీకి ఏం తీయాలో మహికి తెలుసు' అనే మాట వినబడుతోంది. రెండిటికి రికార్డ్ వ్యూస్ రావడంతో ఇప్పుడు మహి వి రాఘవ్ మీద మిగతా ఓటీటీ సంస్థల చూపు పడుతోంది. ఆయనతో ప్రాజెక్టులు చేయడానికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
సినిమాలు... సిరీస్‌లు...
రెండూ ఎలా బ్యాలెన్స్ చేస్తారో!?
మహి వి రాఘవ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లు వచ్చినప్పటికీ... ఇప్పుడు ఆయన చేతిలో సినిమాలు కూడా ఉన్నాయి. 'సేవ్ ద టైగర్స్', 'సైతాన్' మధ్య 'సిద్దా... లోకం ఎలా ఉంది నాయనా' సినిమా తీశారు. అది త్వరలో విడుదల కానుంది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా 'యాత్ర 2' చేయనున్నట్లు వెల్లడించారు. అందులో జగన్ పాత్రను తమిళ హీరో జీవా చేయనున్నారు.
Also Read : రామ్ చరణ్ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే
ఒక వైపు సినిమాలు... మరోవైపు వెబ్ ప్రాజెక్టులు... రెండిటినీ మహి వి రాఘవ్ ఎలా బ్యాలన్స్ చేస్తారో చూడాలి. దర్శకుడిగా తన కథను వెండితెరపై చూడాలని చాలా మంది కోరుకుంటారు. అదే సమయంలో సినిమాలో చెప్పలేని విషయాలను డిజిటల్ తెరపై చెప్పడానికి ట్రై చేస్తున్నారు. థియేటర్లలో సినిమాలు... ఓటీటీలో వెబ్ సిరీస్‌లు... రెండిటిలో మహి వి రాఘవ్ సక్సెస్ అందుకున్నారు కనుక రెండూ బ్యాలన్స్ చేయడం ఆయనకు టఫ్ టాస్క్ అని చెప్పాలి.
Also Read : మహేష్ బాబు సినిమా నుంచి పూజా హెగ్డే కూడా అవుట్!