Mahi V Raghav Interview: జగన్ నవ్వారు, అంతే! సీరియస్‌గా తీసుకోలేదు - 'యాత్ర 2' దర్శకుడు మహి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
Yatra 2 Movie Director Interview: 'యాత్ర 2' విడుదలకు ముందు దర్శకుడు మహి వి రాఘవ్ ఏబీపీ దేశంతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
రాజకీయాలు వేరని, సినిమా వేరని 'యాత్ర 2' దర్శకుడు మహి వి రాఘవ్ అన్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకుని కల్పిత కథతో ఆయన తెరకెక్కించిన సినిమా 'యాత్ర 2'. ఫిబ్రవరి 8న... అంటే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'యాత్ర 2' వల్ల జగన్ మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడదని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా విడుదలకు ముందు ఏబీపీ దేశం ఎడిటర్ నగేష్ జీవీతో ఆయన ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
''మేం రాజకీయ నేపథ్యంలో 'యాత్ర 2' తీశాం. సాధారణంగా మన దగ్గర రాజకీయ సినిమాలు చూసే ప్రేక్షకులు తక్కువ. అటువంటి సినిమాలకు డబ్బులు రావాలి అంటే ఎన్నికల సీజన్ మంచి ఆప్షన్. అందుకని, ఈ సమయంలో విడుదల చేస్తున్నాం. అయినా రాజకీయాల గురించి మాత్రమే సినిమా తీస్తే ఎవరూ చూడరు. అందులో కథ ఉండాలి. ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయాలి. ప్రతి సినిమా ఎలా తీస్తారో మేమూ ఈ సినిమా అలాగే తీశాం'' అని మహి వి రాఘవ్ చెప్పారు.
సినిమా వల్ల రాజకీయాలు మారవు!
''సినిమా వల్ల రాజకీయాలు మారతాయని అంటే... అది 70, 80లలో కుదిరేది. ఈ కాలంలో ఇంత చదువు చదివి, ఇంత సమాచారం మనకు అందుబాటులో ఉన్న తర్వాత... ప్రజలు ఒక సినిమా చూసి ప్రభావితం అవుతారని అంటే ప్రజలను ఇన్సల్ట్ చేయడమే. వాళ్లకు ఎవరి వల్ల ఏం లాభం అనేది ఆలోచించి ఓటు వేస్తారు. సినిమాల వల్ల ఒక్క ఓటు కూడా పడదు'' అని మహి వి రాఘవ్ చెప్పారు. సినిమా వాళ్లు ముందు వ్యాపారస్తులు అని, వ్యాపారం కోసం మాత్రమే ఎన్నికల సీజన్ ముందు విడుదల చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
జగన్ నవ్వారు... సీరియస్‌గా తీసుకోలేదు!
'యాత్ర' సినిమా 2019లో విడుదలైంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డికి 'యాత్ర 2' తీయాలని ఉందని చెప్పానని మహి వి రాఘవ్ వివరించారు. ఆయన రియాక్షన్ ఏమిటి? అని అడిగితే... ''ఆయన నవ్వారు. అంతే! సీరియస్‌గా తీసుకోలేదు. ఒక్కసారి సినిమా అంతా పూర్తి అయ్యాక ఆయన చూడాలని అనుకుంటే... మేం చూపించాలని అనుకుంటున్నాం'' అని మహి వి రాఘవ్ సమాధానం ఇచ్చారు.
రెండూ వేర్వేరు కథలు... ఇది ఎమోషనల్ డ్రామా!
'యాత్ర' తీస్తున్నప్పుడు సీక్వెల్ ఐడియా ఉందని, 2019లో తాను సినిమా (యాత్ర 2) చేయాలని నిర్ణయించుకున్నట్లు మహి వి రాఘవ్ వివరించారు. అయితే... ఈ సినిమా తెరకెక్కించడానికి కాస్త సమయం పట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''రెండు వేర్వేరు కథలు. 'యాత్ర'లో రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర, ఇతర అంశాలపై ఎక్కువ ఫోకస్ చేశాం. 'యాత్ర 2' టైటిల్ పెట్టామని ఇదొక పాదయాత్ర అనుకోవద్దు. 2009 నుంచి 2019 వరకు జగన్ జీవిత ప్రయాణాన్ని చూపిస్తున్నాం. 'యాత్ర' రోడ్ ఫిల్మ్ అయితే... 'యాత్ర 2' కంప్లీట్ డ్రామా'' అని తెలిపారు.
Also Read: ఉపాసన తాతయ్య బయోపిక్ రామ్ చరణ్ చేస్తారా? భర్త గురించి ఉపాసన ఏమన్నారంటే?
ప్రతీక్ గాంధీని అనుకున్నాం కానీ...
'యాత్ర 2' సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం చాలా సుపరిచితుడైన జీవా నటించారు. అయితే... ముందు ఆ పాత్రకు 'స్కామ్' వెబ్ సిరీస్ ఫేమ్ ప్రతీక్ గాంధీని అనుకున్న మాట వాస్తవమేనని మహి వి రాఘవ్ చెప్పారు. జీవా సౌత్ ఇండియా కావడంతో పాటు లాంగ్వేజ్ అడాప్షన్ ఈజీ అవుతుందని అతడిని తీసుకున్నామని చెప్పారు.
తండ్రీ కొడుకుల కథ 'యాత్ర 2'
తండ్రీ కొడుకుల కథగా 'యాత్ర 2' తెరకెక్కించానని, సినిమాలో కోర్ పాయింట్ మీద స్క్రిప్ట్ రాసుకున్నానని, అందువల్ల కొన్ని పాత్రలకు కథలో చోటు కల్పించడం కుదరలేదని మహి వి రాఘవ్ స్పష్టం చేశారు. 'యాత్ర 2'లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జగన్ సోదరి వైఎస్ షర్మిల పాత్రలు ఉండవని మరోసారి స్పష్టం వచ్చింది.
Also Read: రజనీకాంత్ గెస్ట్ అప్పియరెన్స్ కాస్ట్లీ గురూ - నిమిషానికి కోటిన్నర!?