Emergency Movie: ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ పూర్తి- ఆ సీన్లు కట్, కండీషన్లు అప్లై
Kangana Ranaut నటించిన ఎమర్జెన్సీ సినిమాకు ఎట్టకేలకు సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్ని సీన్లు కట్ చేయాలని ఆదేశించింది.
Emergency Movie: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎమర్జెన్సీ(Emergency) సినిమా విడుదలకు చిక్కుముడులు వీడుతున్నాయి. ఆ సినిమాకు ఎట్టకేలకు సన్సార్ క్లియర్ అయ్యింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఎట్టకేలకు సర్టిఫికేట్ జారీ చేసింది. ఎమర్జెన్సీ సినిమాకు యూఏ సర్టిఫికెట్ (U/A certificate) ఇచ్చింది. అయితే.. కొన్ని కండిషన్లు పెట్టింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలను తీసేయాలని చిత్ర నిర్మాతలను ఆదేశించింది సెన్సార్ బోర్డు. అంతేకాదు... చారిత్రక సంఘటనలను వర్ణించే సన్నివేశాలు ప్లే అవుతున్నప్పుడు కింద డిస్‌క్లయిమర్స్ ఇవ్వాలని ఆదేశించింది. అభ్యంతరకర సన్నివేశాలను తప్పకుండా తొలగించాలని... లేదా... వాటి స్థానంలో వేరే సన్నివేశాలను జోడించాలని పేర్కొంది.
సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసిన సన్నివేశాలు...
బంగ్లాదేశ్ శరణార్థులపై పాకిస్థాన్ సైనికులు దాడి చేసే సన్నివేశంపై సీబీఎఫ్‌సీ అభ్యంతరం వ్యక్తం చేసింది. చిన్నారితోపాటు ముగ్గురు మహిళల తలలు నరికేయడం వంటి సన్నివేశాలను వెంటనే తొలగించాలని... లేదా మార్చాలని ఆదేశించింది భారతీయ మహిళలను కించపరిచేలా నిక్సన్ పాత్ర చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ శరణార్థులు, కోర్టు తీర్పుల సమాచారం ఎక్కడిది? అని ప్రశ్నించింది .ఆపరేషన్ బ్లూస్టార్ ఫుటేజీ అనుమతికి సంబంధించి కూడా వివరాలు కోరింది సెన్సార్ బోర్డు.
U/A సర్టిఫికేట్ అంటే...
UA సర్టిఫికేట్ అంటే... ఈ సినిమాను అన్ని వయస్సుల వారు చూడొచ్చు. అయితే... పిల్లలు తల్లిదండ్రుల అనుమతితోగాని.. వారి సమక్షంలోగానీ చూడాల్సి ఉంటుంది. జూలై 8 న ఎమర్జెన్సీ సినిమాని సమీక్ష కోసం సెన్సార్ బోర్డ్‌కు పంపారు. కానీ... కొన్ని వివాదాలు రావడంతో.. ఆలస్యం జరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 8వ తేదీ) ఎమెర్జెన్సీ సినిమాకు కొన్ని కండిషన్లతో యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు.
ఎమర్జెన్సీ సినిమాపై వివాదం...
ఎమర్జెన్సీ సినిమాపై వివాదం నెలకొంది. గత నెలలో... అకల్ తఖ్త్, శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీతో సహా వివిధ సిక్కు సంస్థలు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాయి. ముఖ్యంగా సినిమా ట్రైలర్ విడుదల అయిన తర్వాత... ఆ డిమాండ్ మరింత పెరిగింది. ఎందుకంటే... సినిమా ట్రైలర్‌లో... వేర్పాటువాద ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే ప్రత్యేక రాష్ట్రం ఇస్తే... ఇందిరా గాంధీకి ఓట్లు వేస్తానని వాగ్దానం చేయడం కనిపించింది. దీంతో... సిక్కు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమర్జెన్సీ సినిమాపై నిషేధం విధించాలని సెన్సార్ బోర్డుకు లేఖలు రాశాయి. దీంతో.. సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. సినిమా విడుదల వాయిదా పడింది.
ఎమర్జెన్సీ సినిమా గురించి...
బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో ఎమర్జెన్సీ సినిమాను తెరకెక్కించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా... ఈ సినిమాని చిత్రీకరించారు. 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో అంటే ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్ (Anupam Kher), శ్రేయస్ తల్పడే (Shreyas Talpade), విశాక్ నాయర్ (Vishak Nair) ప్రముఖ పాత్రల్లో కనిపించబోతున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా... సెన్సార్ సర్టిఫికెట్ రావడం ఆలస్యం కావడం వల్ల వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ క్లియర్ కావడంతో... త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతోంది చిత్ర యూనిట్.