Indian 2: 'ఇండియన్ 2' సెన్సార్ పూర్తి.. కమల్ సినిమా రన్ టైమ్ ఎంతంటే?
Indian 2 Censor: కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు 2'. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.
Kamal Haasan's Indian 2 Censor And Runtime Details: విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2'. 1996లో ఘన విజయం సాధించిన 'ఇండియన్' సినిమాకి సీక్వెల్ ఇది. 'జీరో టోలరెన్స్' అనే ట్యాగ్ లైన్ తో స్టార్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం ఈ పొలిటికల్ యాక్షన్ మూవీని తెరకెక్కించారు. 'భారతీయుడు 2' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
'ఇండియన్ 2' చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా 'U/A' (యూ/ఏ) సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన CBFC సభ్యులు.. కొన్ని పదాల విషయంలో అభ్యంతరం తెలిపి వాటిని మ్యూట్ చేయమని సూచించారట. రిపోర్టుల ప్రకారం సినిమా రన్ టైమ్ 180 నిమిషాల 4 సెకన్లు వచ్చింది. అంటే 3 గంటలకు పైగా నిడివితో కమల్ హాసన్ మూవీ థియేటర్లలోకి రాబోతోందన్నమాట. ఇటీవల కాలంలో 'యానిమల్', 'సలార్', 'కల్కి 2898 AD' లాంటి చిత్రాలు 3 గంటల రన్ టైమ్ తో వచ్చాయి. ఇప్పుడు 'భారతీయుడు 2' సైతం 'పెద్ద' సినిమాల జాబితాలో చేరబోతోంది.
'ఇండియన్ 2' సినిమాలో అవినీతి, లంచగొండితనాలకు వ్యతిరేకంగా పోరాడే ఓల్డ్ మ్యాన్ సేనాపతి పాత్రలో కమల్ హాసన్ మరోసారి అలరించనున్నారు. ఇందులో బొమ్మరిల్లు సిద్ధార్థ్, SJ సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని, కాళిదాస్ జయరామ్, నెదురుమూడి వేణు, వివేక్, బ్రహ్మానందం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ టీజర్, ట్రైలర్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకోవడమే కాదు, అంచనాలను రెట్టింపు చేశాయి.
'భారతీయుడు 2' చిత్రాన్ని జూలై 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో తెలుగు ప్రమోషన్స్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లో జూలై 7న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్ తెలుగు మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చే అవకాశం ఉంది.
దాదాపు 28 ఏళ్ల తర్వాత...
లైకా ప్రొడక్షన్స్ & రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్స్ పై నిర్మాత సుభాస్కరన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత కమల్ హాసన్, డైరెక్టర్ ఎస్. శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న 'ఇండియన్ 2' సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.
Also Read: 2024లో టాలీవుడ్ ఫస్టాఫ్ ఎలా నడిచింది? ఆ సినిమాలు అదుర్స్, కానీ!