Kamal Haasan: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, బాక్సాఫీస్ దగ్గర అద్భుత వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రం బ్యాన్ పై కమల్ హాసన్ స్పందించారు.
ఎన్నో నిరసనలు, ఆందోళనల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికీ భారీగా కలెక్షన్లు వసూలు చేస్తోంది. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా ఈ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించి లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది.
సంఖ్యతో మ్యాజిక్ చేయలేరు
తాజాగా ఈ చిత్రాన్ని కొన్ని చోట్ల బ్యాన్ చేయడం పై కమల్ హాసన్ స్పందించారు. ఇదే సమయంలో తమిళనాడులో తన సినిమా ‘విశ్వరూపం’ మీద బ్యాన్ విధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. “’ది కేరళ స్టోరీ’ ట్రైలర్ లో 32 వేల మంది మహిళలు ఐఎస్ఐఎస్ లో చేరారని చెప్పారు. ఆ తర్వాత 32 వేలు కాదు ముగ్గురు అని నిర్మాతలు సవరించారు. ఈ నిర్ణయంతోనే సినిమా క్రెడిబిలిటీపై అనుమానాలు పెరిగాయి. నేను ఈ సినిమా చూడలేదు. కానీ, ప్రజలు దాని గురించి ఏం మాట్లాడారో విన్నాను. సినిమా దర్శక నిర్మాతలు సంఖ్యలతో అతిశయోక్తి చేయలేరు అని గుర్తు పెట్టుకోవాలి” అన్నారు కమల్ హాసన్.
‘ది కేరళ స్టోరీ’ లాంటి సినిమాలను తప్పకుండా చూడాలి
మీకు అవకాశం ఇస్తే ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని నిషేధిస్తారా? అనే ప్రశ్నకు లేదని చెప్పారు కమల్. “నేను ఏ సినిమాను నిషేధించను. వాటిని ప్రజలు చూడాలి. అయితే, ఆయా సినిమాలు ఉద్దేశం ఏంటి? అనే విషయాన్ని మాత్రం ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. తమిళనాడు ప్రభుత్వం నేను తీసిన ‘విశ్వరూపం’ సినిమాను నిషేధించింది. ఆ సినిమాను ఎందుకు నిషేధించారని ప్రజలు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత రాజ్ కమల్ ఫిలింస్, తమిళనాడు ప్రభుత్వం మధ్య కేసు నడిచింది. కేసు గెలిచి సినిమాను విడుదల చేశాం. నేను ఏ సినిమాను బ్యాన్ చేయడాన్ని సమర్థించను. దేశానికి వాక్ స్వాతంత్ర్యం ఉండాలి. ‘ది కేరళ స్టోరీ’ లాంటి సినిమా చూసి ఆ తర్వాత ప్రజలు ఆలోచించాలి” అన్నారు కమల్.
ప్రచారం కోసం తీసే సినిమాలను నేను వ్యతిరేకం
కొద్ది రోజుల క్రితం ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై కమల్ హాసన్ స్పందించారు. ఓ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం ప్రచారం కోసం తీసే సినిమాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు. “నేను మీకు ఇప్పటికే చెప్పాను. నేను ప్రచారం కోసం తీసే చిత్రాలకు వ్యతిరేకం. సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు. కానీ, నిజం అనే రాస్తే సరిపోదు. నిజంగా నిజం ఉండాలి. ఈ సినిమాలో చూపించే నిజం నిజం కాదు” అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు.
Read Also: భుజం నొప్పి ఉన్నా అమ్మ వంట చేసి పెట్టింది, మహేష్ బాబుకు థాంక్స్: అడవి శేష్