Junior NTR: పాప్ సింగర్ ఎడ్ షీరన్ నోట 'చుట్టమల్లే' సాంగ్ - ఇది నిజంగా ప్రత్యేకమంటూ స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
Ed Sheeran Chuttamalle: బ్రిటీష్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ బెంగుళూరులోని ఈవెంట్‌లో దేవర 'చుట్టమల్లే' సాంగ్ తెలుగులో పాడగా క్షణాల్లోనే వైరల్ అయ్యింది. తాజాగా, దీనిపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు.

Junior NTR Responds On Ed Sheeran Chuttamalle Performance: ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన 'దేవర' (Devara) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో 'చుట్టమల్లే' (Chuttamalle) సాంగ్ విడుదలైనప్పటి నుంచీ ఇప్పటివరకూ సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తూనే ఉంది. తాజాగా పాపులర్ పాప్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) తన కాన్సర్ట్‌లో ఎన్టీఆర్ పాటను పాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బెంగుళూరులో ప్రదర్శన ఇచ్చిన షీరన్.. ఈవెంట్‌లో 'చుట్టమల్లే' పాట పాడి జోష్ నింపారు. బ్రిటిష్ సింగర్ నోట తెలుగు పాట రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనిపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR).. ఆనందం వ్యక్తం చేశారు. 'సంగీతానికి హద్దులుండవు. మీరు ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. మీ గొంతులో చుట్టమల్లే సాంగ్ వినడం నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం.' అంటూ ఎడ్ షీరన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Wow This is Crazyyy Reach 💥💥#Chuttamalle from @edsheeran ❤️🔥❤️🔥@DevaraMovie @anirudhofficial @tarak9999 #Devara pic.twitter.com/RdhDmTvu60
— Tony (@NMeklaNTR) February 9, 2025
6 నగరాల్లో ఈవెంట్స్
ప్రముఖ పాప్ సింగర్ ఎడ్ షీరన్ (Ed Sheeran) ప్రస్తుతం ఇండియా టూర్‌లో బిజీగా ఉండగా.. 6 నగరాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 30న పూణేతో తన పర్యటనను ప్రారంభించిన షీరన్, ఫిబ్రవరి 2న హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో కాన్సర్ట్ నిర్వహించారు. అలాగే ఫిబ్రవరి 5న చెన్నై, 8న బెంగళూరులో ఈవెంట్ నిర్వహించారు. ఫిబ్రవరి 12న షిల్లాంగ్‌లో ఆయన చివరి కాన్సర్ట్‌ను నిర్వహించబోతున్నారు. తాజాగా, బెంగుళూరులో నిర్వహించిన కాన్సెర్ట్‌లో షీరన్ 'చుట్టమల్లే చుట్టేశావే' పాటను తెలుగులో పాడి ఆడియన్స్‌ను అలరించారు. ఆయనతో పాటు సింగర్ శిల్పారావు కలిసి పాడారు. వీరికి అక్కడున్న వారు కోరస్ ఇవ్వడం మరో హైలైట్. కాగా.. ఎడ్ షీరన్ గతేడాది మార్చిలో తన కాన్సర్ట్ కోసం భారత్‌కు వచ్చినప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రస్తావించారు. అందులో 'నాటు నాటు' డ్యాన్స్ చాలా బాగుందని చెప్పడంతో మూవీ టీం సైతం స్పందించింది.
'దేవర 2లో వంద శాతం'
కాగా, ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ సోలో రిలీజ్‌గా కొరటాల శివ డైరెక్షన్‌లో 'దేవర' గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా పాటలన్నీ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకించి 'చుట్టమల్లే' సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించగా.. కొన్ని వందల రీల్స్ ఈ పాటపై షేర్ అయ్యాయి. ఈ సినిమా సీక్వెల్ 'దేవర 2' వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే, తొలి భాగం కంటే రెండో భాగం ఇంకా పవర్ ఫుల్ అని డైరెక్టర్ శివ ఇటీవల తెలిపారు. పార్ట్ 1లో 10 శాతం చూపిస్తే.. 2లో వంద శాతం చూపిస్తానని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

