Jr NTR Speech SIIMA : నా ప్రతి కన్నీటి చుక్కకూ బాధ పడ్డారు, ఫ్యాన్స్‌కు పాదాభివందనం - 'సైమా'లో ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
SIIMA 2023 Awards : 'సైమా' అవార్డుల్లో ఉత్తమ నటుడిగా 'ఆర్ఆర్ఆర్'కి గాను అవార్డు అందుకున్న ఎన్టీఆర్... అభిమానుల గురించి మాట్లాడిన మాటలు హృదయంలో నుంచి వచ్చాయని చెప్పవచ్చు.
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) మరోసారి అభిమానుల మీద తనకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఫ్యాన్స్ గురించి ఆయన మాట్లాడిన ఒక్కో మాట గుండె లోతుల్లోంచి వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆయన దుబాయ్ (Dubai)లో ఉన్నారు. సైమా 2023 (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్) కోసం వెళ్లిన సంగతి తెలిసిందే.
'సైమా'లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ పురస్కార వేడుకకు ఆయన కళ తీసుకు వచ్చారు. సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.
నేను కింద పడ్డప్పుడు పైకి లేపారు : ఎన్టీఆర్
ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి ఎన్టీఆర్ థాంక్స్ చెప్పారు. ''మళ్ళీ మళ్ళీ నన్ను నమ్మిన నా జక్కన్నకు థాంక్స్'' అని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'లో తనతో పాటు నటించిన రామ్ చరణ్ (Ram Charan)కు కూడా థాంక్స్ చెప్పారు. అతడిని బ్రదర్ అని పేర్కొన్నారు. ఆ తర్వాత అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
''అభిమానులు అందరికీ థాంక్యూ. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా భాద పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు'' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
Also Read : చిరంజీవి సినిమాలో కథానాయికగా అనుష్క?
NTR Won the SIIMA Best Actor award For leading role in RRR Movie 💥🔥#SIIMA2023 #SIIMAinDubai@tarak9999 #ManofMassesNTR pic.twitter.com/IcIMEF1Dg1
— Jr NTR Fan Club (@JrNTRFC) September 15, 2023
'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీముడిగా జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. యాక్షన్ దృశ్యాల్లో ఎంత వీరోచితంగా కనిపించారో... భావోద్వేగభరిత సన్నివేశాల్లో అంతలా కంటతడి పెట్టించారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం అయితే ప్రేక్షకుల గుండెలను పిండేసింది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. ఆ నటనకు ఇప్పుడు సైమా అవార్డు వచ్చింది.
సైమా వేడుకల కోసం 'దేవర' చిత్రీకరణకు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో 'దేవర' అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ సీన్లు తీస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' విడుదలైన తర్వాత సుమారు సంవత్సరం పాటు ఎన్టీఆర్ 'దేవర' స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత చిన్న చిన్న బ్రేక్స్ ఇస్తూ... శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు.
Also Read : వాయిదాలు లేవమ్మా - దసరా బరిలో బాలయ్య సినిమా!
'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలయికలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన 'అతిలోక సుందరి' శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ... జాన్వీకి తొలి తెలుగు సినిమా. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుని పాత్ర పోస్తున్నారు.
'దేవర' తర్వాత ఎన్టీఆర్ ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం కష్టమే. వరుసగా రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు. అందులో 'కెజియఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్, మైత్రీ మూవీ మేకర్స్ కలయికలో చేయనున్న సినిమా ఒకటి. ఇంకొకటి... హిందీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా 'వార్', 'పఠాన్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న 'వార్ 2'.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial