Ulajh Teaser: ‘ఉలఝ్’ టీజర్: సీక్రెట్ మిషన్ కోసం జాన్వీ కపూర్ రిస్క్ - ప్రాణాలు ఇవ్వు లేదా తీస్కో!
Ulajh: మరోసారి లేడీ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చేసింది జాన్వీ కపూర్. ఈసారి ‘ఉలఝ్’ అనే మూవీలో ఒక ఇండియన్ స్పై పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యింది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలయ్యింది.
Ulajh Movie Teaser Is Out Now: బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. గత కొన్నాళ్లుగా కమర్షియల్ సినిమాల్లో హీరోలతో స్టెప్పులు వేస్తూనే.. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. తను నటించిన పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే లిస్ట్‌లోకి ఇప్పుడు మరో మూవీ యాడ్ అవ్వనుంది. అదే ‘ఉలఝ్’. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల కాగా.. అందులో జాన్వీ కపూర్ పాత్రను మాత్రమే హైలెట్ చూసి చూపించారు. తన దేశం కోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే సుహానా అనే పాత్రలో జాన్వీ కనిపించింది. ‘ఉలఝ్’ టీజర్.. సినిమాపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తోంది.
దేశం కోసమే..
ముందుగా ఒక ఫారిన్ దేశంలో ‘ఉలఝ్’ టీజర్ మొదలవుతుంది. టీజర్ ముందుకు వెళ్తుంటే అది ఆస్ట్రేలియా అని అర్థమవుతుంది. అక్కడ ఇండియాకు చెందిన అధికారిగా జాన్వీ కపూర్ కనిపిస్తుంది. అప్పుడే బ్యాక్‌గ్రౌండ్ నుండి ఒక డైలాగ్ వినిపిస్తుంది. ‘‘నువ్వేం అనుకుంటున్నావు సుహానా? ఇప్పటివరకు నువ్వు చేసిందంతా నీ దేశం కోసం చేశానని అనుకుంటున్నావా? ద్రోహం, విధేయత అనేవి కేవలం పదాలు మాత్రమే. కానీ వాటి ఉచ్చులోనే ప్రజలు పడిపోతున్నారు. దేశాలు, సరిహద్దులు అనేవి కేవలం మట్టిపై గీసిన రేఖలు. అవి దేనికి పనికిరావు’’ అనే డైలాగ్‌తో ‘ఉలఝ్’ టీజర్ ముందుకు సాగుతుంది.
కావాల్సిన ఆధారాల కోసం..
‘ఉలఝ్’ టీజర్‌లో వినిపించే ఆ డైలాగ్‌పైనే సినిమా ఆధారపడి ఉందని అర్థమవుతుంది. ఇక ఆ డైలాగ్ వినిపిస్తున్నంత సేపు జాన్వీ కపూర్ ఎవరికీ తెలియకుండా తన దేశానికి సంబంధించిన కొన్ని ఆధారాలను సేకరిస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఎవరి కంట పడకుండా తప్పించుకుంటూ ఉంటుంది, టెన్షన్ పడుతూ ఉంటుంది. చివరిగా ఆ డైలాగ్‌కు తాను కూడా ఒక రిప్లై ఇస్తుంది. ‘‘ద్రోహం వల్ల ప్రాణాలు పోతాయి. అయితే మన ప్రాణం త్యాగం చేయాలి లేదా వేరొకరి ప్రాణం తీయాలి’’ అంటూ కౌంటర్ ఇస్తుంది జాన్వీ క్యారెక్టర్. ఇక ‘ఉలఝ్’ టీజర్‌లోనే తన దేశం కోసం ఏదైనా చేసే పాత్రలో జాన్వీ కపూర్ కనిపిస్తుందని స్పష్టమయ్యేలా చేశారు మేకర్స్.
అదే కథ..
‘ఉలఝ్’లో జాన్వీ కపూర్ ఫైట్ సీక్వెన్స్‌లలో కూడా నటించిందని టీజర్‌లోనే హింట్ ఇచ్చేశారు మేకర్స్. అయితే టీజర్ చూసిన చాలామంది ఇది దాదాపుగా ఆలియా భట్ నటించిన ‘రాజీ’ స్టోరీ లైన్‌తోనే తెరకెక్కిందని అంచనా వేస్తున్నారు. అందులో కూడా ఆలియా భట్ ఒక స్పైలాగా పాకిస్థాన్ దేశంలోకి వెళ్లి వివరాలు సేకరిస్తుంది. ఇక ‘ఉలఝ్’లో కూడా జాన్వీ కపూర్ ఆస్ట్రేలియా నుండి కావాల్సిన సమాచారాన్ని ఇండియాకు చేరవేస్తుంది. సుధాన్షు సారియా దర్శకత్వం వహించిన ఈ మూవీకి వినీత్ జైన్ నిర్మాతగా, అమృతా పాండే సహ నిర్మాతగా వ్యవహరించారు. జులై 5న థియేటర్లలో ‘ఉలఝ్’ సందడి చేయనుంది.
Also Read: ఎన్నికల ప్రచారంలో హీరోయిన్ నమిత - పూల వర్షం కురిపించిన స్థానికులు, వీడియో వైరల్