Jailer Villain Vinayakan : 'జైలర్'లో విలన్‌కు 35 లక్షలే ఇచ్చారా? - అసలు నిజం చెప్పిన వినాయకన్!
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' సినిమా భారీ సక్సెస్ సాధించింది. అందులో విలన్ రోల్ చేసిన వినాయకన్ కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి, ఆయనకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు.
'జైలర్' (Jailer Movie) విడుదలైన తర్వాత ఇంత భారీ విజయం సాధిస్తుందని, బాక్సాఫీస్ బరిలో వసూళ్ళ సునామీ సృష్టిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. స్వయంగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) రీ రికార్డింగ్ చేయక ముందు సినిమా చూసి ఏవరేజ్ అనుకున్నానని వ్యాఖ్యానించారు. అయితే... కమర్షియల్ పరంగా 'జైలర్' భారీ సక్సెస్ సాధించడంతో... ఆ సంతోషాన్ని చిత్ర బృందంతో పంచుకున్నారు నిర్మాత.
ఖరీదైన కార్లు బహుమతులుగా ఇచ్చిన నిర్మాత
'జైలర్' సక్సెస్ తర్వాత చిత్ర నిర్మాత, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కార్ల పంపిణీ మొదలు పెట్టారు. సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించిన సూపర్ స్టార్ రజనితో పాటు దర్శకుడు దిలీప్ నెల్సన్ కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులకు ఖరీదైన కార్లను బహుమతులుగా ఇచ్చారు. అంతే కాకుండా లాభాల్లో కొంత షేర్ ఇచ్చారని, ముందుగా అనుకున్న పారితోషికం కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారని టాక్! మరి, సినిమాలో విలన్ రోల్ చేసిన వ్యక్తికి ఎంత ఇచ్చారు?
వినాయకన్... కేవలం 35 లక్షలే తీసుకున్నారా?
'జైలర్' సినిమాలో విలన్ రోల్ చేసిన వ్యక్తి పేరు వినాయకన్. ఆయన మలయాళీ. అయితే... తమిళ సినిమాలు కూడా చేశారు. తెలుగులో 'పొగరు'గా విడుదలైన విశాల్ 'తిమిరు' ఆయనకు తమిళంలో బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించారు. పదేళ్ళ విరామం తర్వాత 'జైలర్'తో మళ్ళీ కోలీవుడ్ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చారు.
'జైలర్'లో వినాయకన్ చూపించిన విలనిజం ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. హీరోయిజం ఎలివేట్ కావడంలో ఆయన విలనిజానిది ముఖ్య పాత్ర. అయితే... అంత అద్భుతంగా నటించిన వినాయకన్ (Vinayakan)కు రెమ్యూనరేషన్ పరంగా అన్యాయం జరిగిందని ఓ వార్త ప్రచారంలో ఉంది. 'జైలర్'కు గాను ఆయనకు కేవలం 35 లక్షల రూపాయల పారితోషికం మాత్రమే అందిందని సదరు వార్త సారాంశం. దానిని వినాయకన్ ఖండించారు.
35 లక్షలు కాదు... దానికి మూడు రేట్లు ఎక్కువ!
'జైలర్'కు తాను కేవలం 35 లక్షల రూపాయలే అందుకున్నట్లు వచ్చిన వార్తలను వినాయకన్ కొట్టి పారేశారు. ''నాకు 35 లక్షలు ఇచ్చారనేది పుకారు మాత్రమే. మా నిర్మాత కళానిధి మారన్ చెవిలో ఈ మాటలు పడలేదని ఆశిస్తున్నా. ప్రచారంలో ఉన్న పారితోషికం కంటే మూడు రేట్లు ఎక్కువ నాకు అందింది. నేను అడిగిన మొత్తం నాకు ఇచ్చారు. చిత్రీకరణలో నన్ను చాలా మర్యాదగా చూసుకున్నారు'' అని వినాయకన్ పేర్కొన్నారు. అదీ సంగతి! ఆయన మాటలను బట్టి 'జైలర్'కు కోటి రూపాయల కంటే ఎక్కువ తీసుకున్నారని అనుకోవాలి.
Also Read : సనాతన ధర్మ రక్షణ కోసం ప్రాణ త్యాగానికి సిద్ధం - ఎవరీ జితేందర్ రెడ్డి?
'జైలర్'లో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించారు. ఆయన కుమారుడిగా 'అశ్విన్స్' ఫేమ్ వసంత్ రవి, కోడలిగా మిర్నా మీనన్, బ్లాస్ట్ మోహన్ పాత్రలో సునీల్, కీలక పాత్రలో తమన్నా తదితరులు నటించారు. ఈ సినిమా 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
Also Read : అక్కడ యోగిబాబు, ఇక్కడ సంపూర్ణేష్ బాబు - తెలుగులోకి తమిళ 'మండేలా'
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial